రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృతి

ABN , First Publish Date - 2020-10-25T10:32:17+05:30 IST

జిల్లాలోని జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ మగతపాలెం ఘాట్‌లో శుక్రవారం రాత్రి మినీ వ్యాన్‌ బోల్తా పడడంతో నవ వరుడు..

రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృతి

బోల్తాపడిన మినీ వ్యాన్‌ 

ఘటనలో ఇద్దరి మృతి...ఎనిమిది మందికి గాయాలు


పాడేరు/జి.మాడుగుల, అక్టోబర్‌ 24: జిల్లాలోని జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ మగతపాలెం ఘాట్‌లో శుక్రవారం రాత్రి మినీ వ్యాన్‌ బోల్తా పడడంతో నవ వరుడు సహా ఇద్దరు మృతిచెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. మృతుల్లో నవవరుడు ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. 


మగతపాలెం గ్రామానికి చెందిన యువతికి, జీకే వీధి మండలం రింతాడ పంచాయతీ కడుగుల గ్రామానికి చెందిన వంతల శివకు నెల క్రితం వివాహం అయ్యింది. శుక్రవారం వరుడు బంధువులతో కలిసి బొలెరో పికప్‌ వాహనంలో కడుగుల నుంచి మగతపాలెం వచ్చాడు. వరుడు, వధువులకు చెందిన కుటుంబీకులంతా సహపంక్తి భోజనాలు చేశారు. రాత్రి ఏడు గంటల సమయంలో వరుడు శివతో పాటు అతని బంధువులంతా తిరుగు ప్రయాణమయ్యారు. మగతపాలెం గ్రామం దాటి ఘాట్‌ ఎక్కుతున్న సమయంలో వీరి వాహనం బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో బోల్తా పడింది.


ఈ ప్రమాదంలో కడుగుల గ్రామానికి చెందిన వంతల సుంబేరి (40) అక్కడిక్కడే మృతిచెందగా, వరుడు వంతల శివ (26), పోతు, పండు, రవి, శ్రీరాముడు, పోతు కృష్ణ, పవన్‌, వెంకటరావుతో పాటు మరొకరికి గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న మగతపాలెం వాసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని 108 వాహనాన్ని రప్పించి గాయపడిన వారిని జి.మాడుగుల పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించి పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవ వరుడు శివ మార్గమధ్యంలోనే మృతిచెందాడు. గాయాలైన ఎనిమిది మందికి పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.


ఓవర్‌ లోడే కొంప ముంచింది..

బొలెరో పికప్‌ వాహనంలో 20 నుంచి 25 మందికి మించి ఎక్కితే, ఓవర్‌ లోడై అదుపు తప్పుతుంది. అటువంటిది ప్రమాద సమయంలో 45 మంది వరకూ వాహనంలో వున్నట్టు చెబుతున్నారు. ఘాట్‌ ఎక్కుతున్న సమయంలో ఓవర్‌ లోడు కారణంగానే అదుపు తప్పి బ్రేకులు ఫెయిలై వాహనం బోల్తా పడిందని తెలుస్తున్నది. ఈ ఘటనపై జి.మాడుగుల ఎస్‌ఐ ఉపేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-10-25T10:32:17+05:30 IST