వృక్ష సంపదతోనే మనుగడ

ABN , First Publish Date - 2020-08-02T10:32:29+05:30 IST

వృక్ష సంపదతోనే మనుగడ

వృక్ష సంపదతోనే మనుగడ

ప్రకృతికి సేవ చేస్తే సాటి మనిషికి సేవ చేసినట్లే 

పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వ ప్రాధాన్యం

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు 

డ్రోన్‌తో విత్తన బంతులను విడిచిన మంత్రి


కొండపాక, ఆగస్టు 1: వృక్ష సంపదతోనే మనుగడ సాధ్యమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రకృతికి సేవ చేస్తే మనుషులకు సేవ చేసినట్టేనని, మొక్కలను నాటి కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉన్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గత ప్రభుత్వాలు అడవుల్లో చెట్లను నరికితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడవుల్లో మొక్కలను నాటి పెంచుతున్నదని చెప్పారు. కొండపాక మండలం మర్పడగ నాగులబండ వద్ద గల అర్బన్‌ పార్కులో డ్రోన్‌ ద్వారా విత్తన బంతులను చల్లే కార్యక్రమాన్ని శనివారం పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా అడవుల్లో పచ్చదనాన్ని పెంచేందుకు వినూత్న ప్రయత్నాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలో డ్రోన్‌ ద్వారా విత్తన బంతులను చల్లడం సులభంగా ఉంటుందన్నారు. కోతులకు ఆహారాన్ని అందించే మొక్కల విత్తనాలు సీడ్‌ బాల్స్‌ ద్వారా చల్లుతున్నట్లు వివరించారు. అడవుల్లో మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో మొక్కలను నాటేందుకే డ్రోన్‌ను వినియోగించనున్నట్టు వెల్లడించారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మాట్లాడుతూ.. అడవుల్లో మొక్కలను పెంచడానికి సీడ్‌ బాల్స్‌ మంచి ప్రయత్నమన్నారు. సహజంగా మొలకెత్తిన మొక్క బలంగా పెరుగుతుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ విధ్వంసం పరుగులు తీస్తోందని, ప్రతి రోజు 50వేల హెక్టార్ల విస్తీర్ణంలో అడవి అంతరించిపోతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి రక్షణకు తప్పకుండా మొక్కలను నాటి వృక్షాలుగా చేయాలని కోరారు.

Updated Date - 2020-08-02T10:32:29+05:30 IST