‘టెట్‌’ నోటిఫికేషన్‌ ఇంకెప్పుడు?

ABN , First Publish Date - 2021-04-10T17:13:37+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(ఏపీ టెట్‌) నోటిఫికేషన్‌ ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది..

‘టెట్‌’ నోటిఫికేషన్‌ ఇంకెప్పుడు?

డీఎడ్‌, బీఎడ్‌ పరీక్షల తర్వాతేనా...

డీఎస్సీ నోటిఫికేషన్‌పైనా ప్రభావం 

జూలైలో పరీక్ష నిర్వహించే చాన్స్‌ 

పాఠశాల విద్యాశాఖ కాలయాపన 


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(ఏపీ టెట్‌) నోటిఫికేషన్‌ ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. తగిన కారణాలు లేకపోయినా నోటిఫికేషన్‌ విడుదలలో పాఠశాల విద్యాశాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ పరీక్ష కోసం పెద్దసంఖ్యలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్నా అధికారులకు పట్టడం లేదు. డీఎడ్‌, బీఎడ్‌ ఫైనలియర్‌ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించేందుకు వారి పరీక్షలు పూర్తయి ఫలితాలు వచ్చేవరకు నోటిఫికేషన్‌ విడుదల చేయకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం జూలైలో టెట్‌ నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన అనంతరం 2017, 2018లో మాత్రమే టెట్‌ నిర్వహించారు. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ తాజా మార్గదర్శకాల మేరకు ఇకపై ఏటా ఒకసారి టెట్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్‌ ఆలస్యమైతే ఆ ప్రభావం డీఎస్సీపైనా పడుతుంది. అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం జగన్‌ గత 22నెలల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. గత ప్రభుత్వం 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌కు సంబంధించిన నియామకాలే ఇంకా పూర్తికాలేదు. ప్రభుత్వ రంగ పాఠశాలల్లో వచ్చే జూన్‌నాటికి దాదాపు 26వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉంటాయని అంచనా. పాఠశాలలకు అవసరమైన టీచర్లను నియమించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న ఆరోపణలున్నాయి. టెట్‌ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించినా ఆచరణలోకి రాలేదు. 


డీఎస్సీలో 20శాతం వెయిటేజీ 

తాజా మార్గదర్శకాల ప్రకారం... టెట్‌ రెండు పేపర్లలో నిర్వహిస్తారు. 1నుంచి 5తరగతులకు బోధించే టీచర్ల కోసం పేపర్‌-1, 6నుంచి 8 తరగతుల టీచర్ల కోసం పేపర్‌-2 నిర్వహించాల్సి ఉంది. ప్రతి పేపర్‌లో రెండు కేటగిరీలు ఉంటాయి. జనరల్‌ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు పేపర్‌-1ఏ, 2ఏ, స్పెషల్‌ స్కూళ్లలో పని చేసేవారికి పేపర్‌-1బీ, 2బీ నిర్వహిస్తారు. పేపర్‌-1 రాసేవారు ఇంటర్‌లో 50శాతం మార్కులు, పేపర్‌-2 రాసేవారు డిగ్రీలో 50శాతం మార్కులు పొంది ఉండాలి. టెట్‌లో అభ్యర్థులు సాధించిన మార్కులకు డీఎస్సీలో 20శాతం వెయిటేజీ ఉంటుంది. జనరల్‌ అభ్యర్థులకు 60 శాతం, బీసీ అభ్యర్థులకు 50శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 40శాతం క్వాలిఫైయింగ్‌ మార్కులుగా నిర్ణయించారు. పేపర్‌-1, 2ను 150 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌లో 150 మల్టిఫుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. కంప్యూటర్‌ ఆధారితంగా టెట్‌ నిర్వహిస్తారు. అయితే నోటిఫికేషన్‌ విడుదల విషయమై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. 

Updated Date - 2021-04-10T17:13:37+05:30 IST