HYD : గూడుపోయి.. గుండె చెదిరి.. పోలీసు భద్రత మధ్య కూల్చివేతలు.. రోడ్డున పడ్డ బసవతారకనగర్‌

ABN , First Publish Date - 2021-12-09T16:34:48+05:30 IST

సుమారు 500 మంది పోలీసులు.. బుధవారం తెల్లవారుజామునే గౌలిదొడ్డిలోని బసవతారకనగర్‌ బస్తీకి చేరుకున్నారు. వారి వెంట ఎక్స్‌కవేటర్లతో...

HYD : గూడుపోయి.. గుండె చెదిరి.. పోలీసు భద్రత మధ్య కూల్చివేతలు.. రోడ్డున పడ్డ బసవతారకనగర్‌

  • బోరున విలపించిన బాధితులు


హైదరాబాద్ సిటీ/రాయదుర్గం : సుమారు 500 మంది పోలీసులు.. బుధవారం తెల్లవారుజామునే గౌలిదొడ్డిలోని బసవతారకనగర్‌ బస్తీకి చేరుకున్నారు. వారి వెంట ఎక్స్‌కవేటర్లతో అధికారులు ఉన్నారు. భారీ బందోబస్తు మధ్య 240 ఇళ్లను కూల్చివేశారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉద్రిక్తతంగా మారింది. బాధితుల ఆవేదనలతో మార్మోగింది. గూడు కోల్పోయి చిన్నపిల్లలు, కట్టుబట్టలతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సుమారు 35 ఏళ్ల క్రితం స్టోన్‌ క్రషర్ల వద్ద రాళ్లు పగలగొట్టేందుకు సుమారు 60 కుటుంబాలు నగరానికి వలస వచ్చాయి. 


స్టోన్‌ క్రషర్లను ప్రభుత్వం తొలగించిన తర్వాత వారంతా బసవతారకనగర్‌లో గుడిసెలు వేసుకుని ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 240 గుడిసెలు, ఇళ్లు వెలిశాయి. ఈ ప్రాంతమంతా గోపన్‌పల్లి సర్వేనెంబర్‌ 37లోకి వస్తుంది. ఈ భూమిపై తమకు హక్కు ఉందని గతంలో కొంతమంది కోర్టుకు వెళ్లడంతో వివాదంలో ఉంది. పేదలమాటున కొందరు రియల్‌ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో రెవెన్యూ యంత్రాంగం కదిలింది. శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వంశీమోహన్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది మాదాపూర్‌ ఏసీపీ ఆధ్వర్యంలో సుమారు 500 మంది పోలీసులు, సిబ్బంది అధికారులతో బుధవారం తెల్లవారుజామున బసవతారకనగర్‌కు వచ్చి గుడిసెలు, ఇళ్లను తొలగించారు. మూడు దశాబ్దాలుగా ఉంటున్న తమకు ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా కూల్చివేయడంపై కూలీలు బోరున విలపించారు. పిల్లాపాలతో ఎక్కడికి వెళ్లాలని వాపోయారు.


కార్పొరేటర్‌ వాగ్వాదం.. అరెస్ట్‌.. 

స్థానిక కార్పొరేటర్‌ గంగాధర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు. అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముందస్తు సమాచారం లేకుండా పేదలను రోడ్డున పడేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న ఆయనను అరెస్టు చేసి నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


భోజన సదుపాయాలు..

గుడిసెలు తొలగిస్తుండటంతో ఆయా కుటుంబాలు వంట చేసుకునేందుకు ఇబ్బంది పడతాయని ముందుగానే గుర్తించిన తహసీల్దార్‌ బాధితులకు టిఫిన్స్‌, భోజనాలు, మంచినీరు సరఫరా చేశారు. గుడిసెల తొలగింపుపై మాట్లాడుతూ అది ప్రభుత్వ భూమి అని, ఎన్నేళ్లుగా ఉంటున్నప్పటికీ ఏదో ఒకరోజు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. ఈ విషయాన్ని బస్తీవాసులకు పలుమార్లు చెప్పినా వినిపించుకోలేదన్నారు.

Updated Date - 2021-12-09T16:34:48+05:30 IST