HYD : ఇదేం పనుల తీరు.. సమస్యలు పెంచుతున్న అధికారులు.. అక్కడ అందుకే ముంపు..!

ABN , First Publish Date - 2021-09-30T17:47:05+05:30 IST

కిందటి సంవత్సరం కురిసిన వర్షాలకు గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో చెరువులు..

HYD : ఇదేం పనుల తీరు.. సమస్యలు పెంచుతున్న అధికారులు.. అక్కడ అందుకే ముంపు..!

హైదరాబాద్‌ సిటీ : కిందటి సంవత్సరం కురిసిన వర్షాలకు గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు తెగాయి. కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరింది. ప్రాణ భయంతో పరుగులు తీసిన పదుల సంఖ్యలో పౌరులు వరద నీటిలో కొట్టుకుపోయారు. వరద నీరు దిగువకు వెళ్లేలా తూములు, అలుగులు లేకపోవడమే చెరువులు తెగేందుకు కారణమని గుర్తించిన అధికారులు దిద్టు బాటు చర్యలు చేపడుతున్నట్టు అప్పుడే ప్రకటించారు. ఏడాది గడిచింది.. కానీ పరిస్థితిలో మార్పు లేదు. అలుగులు, తూముల పునరుద్ధరణ పూర్తిస్థాయిలో చేయలేదు. దీంతో తాజా వర్షానికి పలు చెరువుల వద్ద ముంపు ముప్పు మరో మారు ప్రస్ఫుటమైంది. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల చెరలో అవుట్‌లెట్‌లు కనుమరుగు అయ్యాయి. 


రాజకీయ, ఇతరత్రా ఒత్తిళ్లతో అధికారులు వాటిని తొలగించి తూములు, అలుగుల పునరుద్ధరణ చేపట్టకపోవడంతో సమస్యకు పరిష్కారం లభించలేదు. ఉన్నత స్థాయి ఒత్తిళ్ల వల్లే అప్పా చెరువు వద్ద సహజ సిద్ధమైన ప్రవాహ వ్యవస్థను కాదని మరో చోట నాలా నిర్మించారు. దీంతో వరద నీరు సాఫీగా వెళ్లే అవకాశం లేక.. శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో రోడ్డుపైకి భారీ స్థాయిలో వర్షపు నీరు చేరింది. నగరం, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న గొలుసు కట్టు చెరువులకు సహజ సిద్ధమైన వరద ప్రవాహ వ్యవస్థ (నాలా) ఉండేది. నాటి నాలాలను చెరిపి వేసి పలు చెరువుల వద్ద అక్రమార్కులకు ఊతమిచ్చేలా కొత్త ప్రవాహ వ్యవస్థ నిర్మిస్తున్నారు. దీంతో ముంపు ముప్పు తొలగకపోగా కొత్త ఇబ్బందులు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజాధనం వృథా అవడం తప్ప కొత్తగా నిర్మిస్తున్న నాలాలతో ప్రయోజనం లేకుండా పోతోంది.


అక్కడ అందుకే ముంపు.. 

ఖైతలాపూర్‌ సమీపంలోని కాముని చెరువు అలుగు పునరుద్ధరణ, నాలా విస్తరణ పనులు చేపట్టలేదు. కూకట్‌పల్లిలోని రంగధాముని చెరువు అలుగు వద్ద అభివృద్ధి జరగలేదు. చెరువు అలుగు నుంచి నాలాలోకి నీళ్లు వెళ్లేందుకు సరైన సదుపాయం లేదు. అంతేకాకుండా నాలా కూడా ఆక్రమణకు గురి కావడంతో నాలా పరీవాహక కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. 


మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలో ఇలా..

మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలోని బండ చెరువు వద్ద వరద నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేదు. అవుట్‌ లెట్‌లు కొంత మూసుకుపోయాయి. పూర్తిస్థాయిలో పునరుద్ధరించ లేదు. రూ.185 కోట్లతో నాలా నిర్మిస్తున్నా, చెరువు అవుట్‌లెట్‌లను పూర్వపు స్థాయిలో ఆధునికీకరించనంత వరకు పరిసర ప్రాంతాలైన ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ డివిజన్‌లోని షిర్డీనగర్‌, రాజా శ్రీనివా్‌సనగర్‌, ఎన్‌ఎండీసీ కాలనీలకు ముంపు ముప్పు మిగిలే ఉంది. 


నత్తనడకన..

గౌతంనగర్‌ డివిజన్‌లో ఐఎన్‌నగర్‌ నుంచి జ్యోతినగర్‌ వరకు నాలా విస్తరణ పనులు నత్తనడకన జరుగుతున్నాయి. రూ.1.6 కోట్లతో 340 మీటర్ల మేర బాక్స్‌ డ్రెయిన్‌ పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తి అయినా ఎగువ భాగంలో ఉన్న మీర్జాల్‌గూడ, ఓల్డ్‌ మీర్జాల్‌గూడ పరిధిలో నాలా అభివృద్ధి జరిగితే తప్ప తీర ప్రాంతాలకు ముంపు ముప్పు తొలగదు. 


ఆ చెరువుల వద్ద చర్యలు కరువు..

రామంతాపూర్‌ పెద్ద, చిన్న చెరువుల వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదలకు నిర్దిష్టమైన చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అలుగులు, తూముల విస్తరణ పనులు అటకెక్కడంతో ముంపు ముప్పు అలానే ఉంది. బాక్స్‌ డ్రెయిన్‌ నిర్మాణానికి రూ.10.52 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. దీంతో చెరువు కింది ప్రాంతాలైన శాంతినగర్‌, బాలాజీనగర్‌, భరత్‌నగర్‌, శ్రీనగర్‌ కాలనీల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.


అప్పా చెరువు అలుగు పారి..

రాజేంద్రనగర్‌ సర్కిల్‌ గగన్‌పహడ్‌ అప్పా చెరువు నిండి అలుగు పారడంతో కింది భాగంలో ఉన్న ఐస్‌ ఫ్యాక్టరీ ఆవరణలోని ఇళ్లు బుధవారం కూడా నీట మునిగాయి. స్థానికులు ముందే సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. 


ట్రంక్‌ లైన్‌ ఏర్పాటు చేయాలి 

బుర్హాన్‌ఖాన్‌ చెరువు నుంచి బాలాపూర్‌ పెద్ద చెరువు, బతుకమ్మకుంట, గుర్రంచెరువు వరకు ట్రంక్‌లైన్‌ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అప్పుడే అప్పా చెరువు ముంపు సమస్య తప్పుతుందని భావిస్తున్నారు. 


తుర్కయాంజల్‌ గోడు..

తుఫాన్‌ కారణంగా తుర్కయాంజల్‌ మున్సిపాలిటీలోని పలు కాలనీలు, హయత్‌నగర్‌ డివిజన్‌లోని కొన్ని కాలనీలు నేటికీ వరద నీటిలోనే ఉన్నాయి. చాలా ఇళ్లు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతమైన జీవీఆర్‌ కాలనీలోకి వరద నీరు చేరి చెరువును తలపిస్తోంది. గంగరాయి చెరువు కింద ఉన్న మరో 8 కాలనీలలో కూడా నీరు నిలిచి ఉంది.

Updated Date - 2021-09-30T17:47:05+05:30 IST