Abn logo
Apr 7 2020 @ 12:01PM

మంత్రి అవంతి, విజయసాయికి చుక్కెదురు!

విశాఖపట్నం : కరోనా మహమ్మారి విస్తరిస్తుండటం.. లాక్‌డౌన్ నేపథ్యంలో పేద ప్రజలు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు, కంపెనీలు తమ వంతుగా సాయం ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా.. దివీస్ ఫార్మా కంపెనీ నిత్యావసర పంపిణీ చేస్తోంది. విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్న ఈ పంపిణీ కార్యక్రమానికి వెళ్లిన మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డికి చుక్కెదురైంది. అవంతి శ్రీనివాస్ సొంత నియోజకవర్గమైన భీమిలిలో ఈ ఘటన చోటుచేసుకుంది.


అసలేం జరిగింది..!?

పూర్తి వివరాల్లోకెళితే.. భీమిలిలో నియోజకవర్గంలోని అన్నవరం గ్రామంలో దివీస్ కంపెనీ నిత్యావసర సరకులు పంపిణీ కార్యక్రమానికి విజయసాయి, అవంతి వెళ్లారు. అయితే దివీస్ ఇస్తున్న సరుకులను తమకు వద్దని గ్రామస్తులు తిరస్కరిస్తున్నారు. ఆ కంపెనీ వల్ల తమకు నష్టమేగానీ లాభం లేదని గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గ్రామస్తులు అలా చేయడంతో వారిద్దరూ కంగుతిన్నారట. ఈ ఘటనతో చేసేదేమీ లేక గ్రామస్తులతో గట్టిగా మాట్లాడలేక మంత్రి, ఎంపీ ఇద్దరూ అక్కడ్నుంచి వెనుదిరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


గత రెండు మూడ్రోజులుగా..

ఇదిలా ఉంటే.. గత రెండు మూడ్రోజులుగా విజయసాయిరెడ్డి విశాఖలోనే ఉన్నారు. సోమవారం నాడు.. మంత్రి అవంతి, విజయసాయి కలిసి ప్రగతి భారతి ఫౌండేషన్ తరఫున విశాఖపట్నంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. పలువురు పారిశుధ్య కార్మికులు ఇతర వర్గాల ప్రజలకు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్‌లు పంపిణీ చేశారు.

Advertisement
Advertisement
Advertisement