Pregnancy : నవమాసాలు నిండకుండానే.. ఇంటా, బయట గర్భిణులపై ఒత్తిడి..!

ABN , First Publish Date - 2021-11-23T16:13:20+05:30 IST

నవ మాసాలు మోయకుండానే తక్కువ బరువు, నెలలు నిండకుండా పిల్లలు ...

Pregnancy : నవమాసాలు నిండకుండానే.. ఇంటా, బయట గర్భిణులపై ఒత్తిడి..!

  • పనిభారంతో సతమతం
  • గర్భస్థ శిశువుపై ప్రభావం
  • నెలల నిండకుండానే పుడుతున్న వైనం


నవ మాసాలు మోయకుండానే తక్కువ బరువు, నెలలు నిండకుండా పిల్లలు (ప్రీమెచ్యూర్‌) పుట్టి పురిటిలో కన్నుమూస్తున్నారు. ముఖ్యంగా గర్బస్థ శిశువు ఎదుగుదలకు ఒత్తిడి కీలకంగా మారుతోంది. ఆ ఒత్తిడి అనేక రుగ్మతలకు దారితీసి బిడ్డ పుట్టుకకే శాపంగా మారుతోంది. ఆఫీసు, ఇంట్లో ఒత్తిళ్లతో సమతమయ్యే కొందరు గర్భిణులు పుట్టబోయే బిడ్డలపై శ్రద్ధ చూపడం లేదని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


హైదరాబాద్‌ సిటీ : పనిఒత్తిళ్లు.. ఇంట్లో, ఆఫీసుల్లో ఎక్కడ చూసినా టెన్షన్‌. గర్భం దాల్చిన నాటినుంచి ప్రసవం వరకు వ్యక్తిగతం కంటే ఇతరత్రా పనులపైనే మనస్సు లగ్నం చేయడం.. బిడ్డ ఎదుగుదలపై దృష్టి పెట్టకపోవడం, ఇన్‌ఫెర్టిలిటి చికిత్సలతో ప్రీమెచ్యూర్‌ బేబీ ప్రసవాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఒత్తిళ్ల వల్ల, బ్రెయిన్‌ స్టిమిలేషన్‌ వల్ల కణా ల ఎదుగుదల మందగిస్తుందని, ఇది గర్భంలో ఉండే శిశువు ఎదుగుదలకు అడ్డుపడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. గర్భిణుల్లో ఈ సమస్యలు తీవ్ర రూపం దాలిస్తే నెలల నిండని శిశువులు, తక్కువ బరువు ఉంటే బిడ్డలు జన్మిస్తారని పేర్కొంటున్నారు.


ఇతర జబ్బులు తోడైతే..

గర్భిణులకు ఒత్తిడితోపాటు మధుమేహం, బీపీ వంటి సమస్యలు తోడైతే అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. వారు తీవ్రమైన ఒత్తిళ్లకు గురైతే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్‌ హైపర్‌టెన్షన్‌కు దారి తీస్తుంది. హైపర్‌టెన్షన్‌ వల్ల రక్తప్రసరణలో అంటకాలు ఏర్పడి బిడ్డ ఎదుగుదల నిలిచిపోతోంది. కొందరికి బీపీ వల్ల ఫిట్స్‌ రావడం, వాంతులు కావడం వల్ల శిశువు పెరుగుదల సరిగ్గా ఉండదు.


ఇలా ఉంటే..

- కొంతమంది మహిళలకు గర్భిణి సమయంలో మధుమేహం ఎక్కువగా ఉంటోంది. ప్రసవం తరువాత ఇది కనిపించదు. గర్భిణుల్లో మధుమేహం తీవ్ర స్థాయిలో ఉంటే అది బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. థైరాయిడ్‌, హైపర్‌టెన్షన్‌, యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌, వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల ప్రీ మెచ్యూర్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 

- తక్కువ వయస్సు, ఆలస్యంగా వివాహాలు చేసుకుంటే నెలలు పూర్తి కాకుండా, తక్కువ బరువుతో పిల్లలు పుట్టే ప్రమాదం ఉంది. 20ఏళ్ల లోపు, 30నుంచి 35 ఏళ్లు దాటిన తర్వాత పిల్లల ప్రసవం విషయంలో కాస్త ఆలోచించాలి. 

- గర్భిణికి రక్తహీనత ఉంటే కూడా పిల్లల్లో ఎదుగుదల తగ్గిపోయే అవకాశముంది. ధూమపానం, మద్యపానం అలవాటు ఉండే మహిళలకు పుట్టబోయే బిడ్డ ఎదుగుదల, బరువుపై ప్రభావం పడే అవకాశముంది.

- రక్తస్రావం (బ్లీడింగ్‌) ఎక్కువగా జరిగే గర్భిణులకు తక్కువ బరువుతో బిడ్డ పుట్టే ప్రమాదముంది. ఇన్‌ఫెక్షన్‌ వంటి వాటితో కూడా బిడ్డ బరువు తక్కువగా ఉండడం, నెలలు నిండకుండా పుట్టే అవకాశముంటుంది. 

- ఆధునిక వైద్య చికిత్సలు, నైపుణ్యం గల వైద్యుల చికిత్సలతో ప్రీ మెచ్యూర్‌ బేబీలలో 70 శాతం మందిని బతికించడానికి అవకాశముంది. 24 వారాల తర్వాత పుట్టిన బేబీని చికిత్స ద్వారా బతికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ఎక్కవగా ఇబ్బందులు ఉంటాయి. 24 వారాల సమయంలో పుట్టిన 20 నుంచి 30 శాతం, 30 వారాల నుంచి పై బడిన వారిలో 80 నుంచి 90 శాతం పిల్లలను బతికించే అవకాశాలు ఉంటాయి. 


ఇలా అయితే..

- 34 వారాలు దాటిన తర్వాత జన్మించే శిశువులు 1.82 కిలోల బరువు ఉంటే ప్రమాదం ఉండదు. వారిలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఇతర జబ్బులు లేకపోతే ఇబ్బంది ఉండదు. 

- 32 నుంచి 34 వారాల లోపు శిశువులు కిలో కంటే తక్కువ బరువు ఉంటే ప్రత్యేక చికిత్స అందించాలి.

- 28 నుంచి 32 వారాల లోపు పుట్టే పిల్లలకు నవజాత శిశువు వార్డుల్లో చికిత్స అందించాలి. 

-  25 నుంచి 32 వారాల లోపు పుట్టిన పిల్లలకు అన్ని సదుపాయాలు ఉన్న వార్డులో చేర్పించి మెరుగైన వైద్యం అందిస్తే వారి ప్రాణాలను కాపాడవచ్చు.

- 500 గ్రాములతో పుట్టిన శిశువులకు చికిత్స అందించి వారి బరువు పెంచే ఆధునిక సదుపాయాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. 


ప్రీమెచ్యూర్‌ బేబీ అంటే..

సాధారణంగా 37 వారాల తరువాత జన్మించే శిశువులను పూర్తిగా నెలలు నిండిన శిశువుగా వైద్యులు భావిస్తారు. ఎక్కువగా 37 నుంచి 40 వారాలలోపు శిశువు జన్మిస్తారు. 24 నుంచి 37 వారాల మధ్య జన్మించే శిశువును ప్రీమెచ్యూర్‌ బేబీగా పరిగణిస్తారు. 34 నుంచి 36 వారాల మధ్య జన్మించే శిశువుకు త్వరగా చికిత్స అందించి ఆరోగ్యవంతులను చేయవచ్చు. 


ప్రీమెచ్యూర్‌ నివారణకు..

ప్రీమెచ్యూర్‌ అని తెలియగానే ప్రసవానికి ముందే గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలి. ముందునుంచే మెరుగైన మెడికేషన్‌ చేయడం వల్ల పిల్లలకు మున్ముందు వచ్చే ఇతర ఇబ్బందులను అదిగమించవచ్చు. 26 వారాలకే ఉమ్మనీరు పోతుంటే ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసి, మెరుగైన చికిత్స ద్వారా త్వరగా ప్రసవాన్ని నివారించి ప్రీమెచ్యూర్‌ జరగకుండా చూడొచ్చు. 


-  ప్రీమెచ్యూర్‌ బేబీ పుట్టిన మొదటి నిమిషం నుంచి వైద్యులు చికిత్సలు అందించాలి. టెంపరేచర్‌, శ్వాస సమస్య, గుండె పనితీరును నిరంతరం పర్యవేక్షించాలి. ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, పేగులు సున్నితంగా ఉంటాయి. మెద డు రక్తనాళాలు సన్నగా ఉంటాయి. దీనికి తోడు పుట్టగానే పిల్లలు ఈ వాతావారణానికి అలవాటు పడలేరు. వారిలో ఊపిరితిత్తులు, గుండె తదితర అవయవాలు తయారైనప్పటికీ పనితీరు అంతగా ఉండదు. ఆఖరి వారంలోనే గర్బంలోని శిశువు అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది. 30 నుంచి 40 వారాలలో పిల్లల ఎదుగుదల బాగా ఉంటుంది. 


-  ప్రీమెచ్యూర్‌ బీబీ 1.5 కిలోల కంటే తక్కువ బరువు ఉన్నా, శ్వాస ఇబ్బందులు ఉన్నా ఇంక్యుబేటర్‌లో పెట్టి చికిత్స అందించాలి. కొంతమందికి వార్మర్‌లో చికిత్సలు అందించాలి. ఇన్‌ఫెక్షన్‌ రాకుండా యాంటిబయాటిక్‌, బ్లడ్‌ పరీక్షలు, గుండె పనితీరు, ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌, మూత్ర విసర్జనను పరిశీలించాల్సి ఉంటుంది. బ్రెయిన్‌ స్కాన్‌ వంటివి చేయాల్సి ఉంటుంది. ప్రీమెచ్యూర్‌ బేబీకి తల్లి పాలు తప్పని సరిగా ఇవ్వాలి. దీని వల్ల క్రమంగా బరువు పెరుగుతారు. - డాక్టర్‌ సురేందర్‌ రావు, నవజాత శిశు వైద్యుడు, రెయిన్‌బో పిల్లల ఆస్పత్రి. 

Updated Date - 2021-11-23T16:13:20+05:30 IST