సాధినేని యామినీ సాహసం.. గేటు ఎక్కేందుకు యత్నం

ABN , First Publish Date - 2021-01-07T18:47:09+05:30 IST

ప్రకాశం జిల్లా అద్దంకిలో అద్దంకిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సాధినేని యామినీ సాహసం.. గేటు ఎక్కేందుకు యత్నం

ఒంగోలు: ప్రకాశం జిల్లా అద్దంకిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అద్దంకిలోని కురిచేడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం పక్కన చర్చి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు బీజేపీ నాయకురాలు సాధినేని యామిని పయనమయ్యారు. అయితే సందర్శనకు ఎలాంటి అనుమతి లేదని ఆమె వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు.. యామినీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కారు దిగేసిన ఆమె బీజేపీ కార్యకర్తలతో సుమారు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూనే వెళ్లారు. ఈ క్రమంలో భవాని కూడలి వద్ద రోడ్డుపై యామిని, బీజేపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. రోడ్డుపై ఆందోళన చేస్తున్న యామినీని పోలీసులు అదుపులోకి తీసుకుని అద్దంకిలోని ఆర్బీ బంగ్లాకు తరలించారు. అయితే అక్కడి నుంచి గేటు ఎక్కి బయటికెళ్లడానికి ప్రయత్నించారు. అయితే ఆమె సాహసం ఫలించలేదు. అప్రమత్తమైన పోలీసులు ఆమెను అడ్డుకుని మళ్లీ బంగ్లాకు తరలించారు. ప్రస్తుతం యామిని పోలీసు బంగ్లాలోనే ఉన్నారు. 


రామతీర్థంలో ఇలా..

మరోవైపు.. విజయనగరం రామతీర్థం కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ నేతలు యత్నించగా అక్కడ కూడా వారిని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును కూడా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వర్సెస్ బీజేపీ కార్యకర్తలుగా పరిస్థితులు ఏర్పడ్డాయి. రామతీర్థం కొండపైకి ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. అయితే అందరినీ అనుమతించాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులను తోసుకుంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, కార్యకర్తలు ముందుకు వచ్చారు. తోపులాటలో సోమువీర్రాజు, విష్ణువర్థన్‌ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీగా వస్తున్న ఎమ్మెల్సీ మాధవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రామతీర్థం పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. 

Updated Date - 2021-01-07T18:47:09+05:30 IST