HYD : సెటిల్‌మెంట్స్‌కు కేరాఫ్ ఖాకీలు.. కోట్లలో డీల్స్‌.. వివాదాలపైనే ఆసక్తి..!

ABN , First Publish Date - 2021-10-25T18:27:51+05:30 IST

పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్న కొంతమంది అధికారుల తీరుపై..

HYD : సెటిల్‌మెంట్స్‌కు కేరాఫ్ ఖాకీలు.. కోట్లలో డీల్స్‌.. వివాదాలపైనే ఆసక్తి..!

  • రూ.కోట్లలో డీల్స్‌ చేస్తున్న కొందరు పోలీసు అధికారులు
  • సివిల్‌ వివాదాలపై ఆసక్తి
  • అంతా తాము చక్కబెడతామంటూ డీలింగ్స్‌
  • అవినీతి అధికారుల తీరుతో బేజారవుతున్న బాస్‌లు
  • ఆరోపణలపై వేగంగా దర్యాప్తు
  • నేరం రుజువైతే చర్యలు

మంగళ్‌హాట్‌ ఇన్‌స్పెక్టర్‌ రణ్‌వీర్‌రెడ్డి, ఎస్‌ఐ రామునాయుడు, షాహినాయత్‌ గంజ్‌ ఎస్‌ఐ వెంకట్‌కిషన్‌లు కూడా సస్పెండ్‌ అయ్యారు. చేయాల్సిన పనికి విరుద్ధంగా వ్యవహరిస్తుండడమే వీరి సస్పెన్షన్‌కు కారణం. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో మూడు రోజుల క్రితం సరూర్‌నగర్‌ పీఎస్‌ ఎస్‌ఐ సస్పెన్షన్‌కు గురయ్యారు.


అవినీతి, లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో మూడు నెలల క్రితం పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐ కుమారస్వామిలపై కూడా వేటు పడింది. ల్యాండ్‌ సెటిల్‌మెంట్లలో తలదూర్చిన నార్సింగ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐ తాజాగా సస్పెన్షన్‌కు గురయ్యారు.


.. ఇలా పోలీసు బాస్‌లు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కొందరు అధికారులు వ్యవహారాలు చక్కబెడుతూనే ఉన్నారు. రూ. కోట్ల విలువైన భూ వివాదాల్లో తలదూర్చుతున్నారు. కొన్ని పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలు సెటిల్‌మెంట్‌ హెడ్‌లుగా మారుతున్నారు.


హైదరాబాద్‌ సిటీ : పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్న కొంతమంది అధికారుల తీరుపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని ట్రై కమిషనరేట్‌ పరిధుల్లో సివిల్‌ తగాదాలు, భూవివాదాల్లో తలదూర్చడం, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం కొందరు అధికారులకు అలవాటుగా మారింది. అక్రమార్జన కోసం కక్కుర్తి పడుతూ అడ్డదారులు తొక్కుతున్నారు. పోలీస్‌ బాస్‌లు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఆదివారం నార్సింగ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐపై సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర సస్పెన్షన్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీపీగా చార్జి తీసుకున్న మరుసటి రోజే హెచ్చరికలు జారీ చేసిన స్టీఫెన్‌ చెప్పింది చేసి చూపించారు. ఇది ఒక పీఎస్‌కు... ఓ కమిషనరేట్‌కు సంబంధించినది ఏ మాత్రం కాదు. గతంలోనూ ఎంతో మంది అధికారులపై అవినీతి రుజువు కావడంతో వేటు పడింది. అధికారిక వ్యవస్థతో పాటు సమాంతర ప్రైవేట్‌ వ్యవస్థను సైతం కొంతమంది అధికారులు ఏర్పాటు చేసుకుని అవినీతికి పాల్పడుతున్నారు.


వివాదాలు..

భూవివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నార్సింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏడాదికి పైగా సర్వీసు పూర్తి చేసుకున్నారు. గతంలో ఆయనపై ఇతర ఆరోపణలు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కొల్లూరు-జన్వాడ మధ్య కొనసాగుతున్న భూ వివాదాల్లో తలదూర్చినందుకు ఆయనపై వేటు పడిందని తెలుస్తోంది. గతంలోనూ పలు సివిల్‌, భూవివాదాల్లో ఆయన ప్రమేయముందని, బాధితుల సంఖ్య ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది. జన్వాడ మాత్రమే కాకుండా నెక్నాంపురాలోనూ రూ. కోట్ల విలువ చేసే ఓ భూవివాదంలో తలదూర్చి కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. తనకు న్యాయం చేయాలని వేడుకుంటే... అతన్ని బెదిరించడమే కాకుండా నోటీసులు జారీ చేసినట్లు ఓ బాధితుడు తెలిపాడు. ఇది కేవలం ఓ పీఎ్‌సకు సంబంధించినది మాత్రమే కాదు.. ఇదే విధంగా ట్రై కమిషనరేట్‌లో ఇలాంటి ఎన్నో వివాదాలకు కొంతమంది ఏజెంట్లు పోలీసు అధికారులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ దందా చేస్తున్నట్లు సమాచారం.


రూ. కోట్లలో డీల్‌..

ఇలాంటి వ్యవహారాలు కేవలం ఒక ఇన్‌స్పెక్టర్‌కు సంబంధించినవే కావు. ఎస్‌హెచ్‌ఓ స్థాయిలో ఉన్న అధికారుల్లో కొందరు అవినీతి డబ్బుకు దాసోహమంటున్నారు. రూ.లక్షల్లో కాదు.. ఏకంగా రూ.కోట్లకే డీల్‌ చేస్తున్నారు. డబ్బుల కోసం వారిపై చట్టపరంగా సాధ్యం కాకున్నా ఏదో రకంగా.. దాన్ని చట్టం పరిధిలోకి తెచ్చేందుకు వెనకాడటం లేదు. సెటిల్‌మెంట్ల కోసం హోటళ్లలో గదులు బుక్‌ చేసి మరీ రహస్య సమావేశాలకు సిద్ధమవుతున్నారు. అవినీతి అధికారులు ఎంతో మంది ఇప్పటికే రూ. కోట్లలో కూడబెట్టుకున్నట్లు, కొంతమంది అధికారులు తమ పై అధికారులను సైతం మచ్చిక చేసుకుని అవినీతికి పాల్పడుతున్న ఘటనలు గతంలో వెలుగు చూశాయి. బాధితులు నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, తమకున్న పలుకుబడి, పరపతిని వినియోగించి బాధితుల మీదనే రివర్స్‌ కేసులు పెట్టి  బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారనే ఆరోపణలు కూడా కొందిరిపై ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్లకు వచ్చే ఫిర్యాదుల్లో భూవివాదాలు అధికంగానే ఉంటాయి. కొందరు అధికారులు తమ పరిధిలోకి రాని వివాదాలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం తమ పరిధిలో లేనప్పటికీ.. తలదూర్చి ఇబ్బందులు ఎదుర్కొనడమే కాకుండా శాఖకూ చెడ్డ పేరు తెస్తున్నారు.


నార్సింగ్‌ సీఐ, ఎస్‌ఐ సస్పెన్షన్‌

నార్సింగ్‌ పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ను, ఎస్‌ఐ లక్ష్మణ్‌ను సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌రవీంద్ర సస్పెండ్‌ చేశారు. గంగాధర్‌ స్థానంలో సైబరాబాద్‌లో ఈఓడబ్ల్యు (సైబర్‌క్రైమ్‌)లో పని చేస్తున్న శివకుమార్‌ను ఇన్‌చార్జి సీఐగా నియమించడంతో ఆయన ఆదివారం చార్జ్‌ తీసుకున్నారు. భూ వివాదాలకు సంబంధించిన అవినీతి ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్‌ చేశారు. ఇటీవల భూ వివాదాలలో వీరు తలదూర్చడంతో పాటు అవినీతి ఆరోపణలు అధికంగా రావడంతో సీపీ అంతర్గత విచారణ చేపట్టి ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. నార్సింగ్‌, కోకాపేటలో కూడా కొంతమంది బాధితులు ఫిర్యాదు చేశారు. సస్పెండ్‌ అయిన ఎస్‌ఐ లక్ష్మణ్‌ రెండు నెలల క్రితం సైబరాబాద్‌ ఈఓడబ్ల్యుకు బదిలీ అయ్యారు. 

Updated Date - 2021-10-25T18:27:51+05:30 IST