Shocking : Corona కేసుల్లో ‘గ్రేటర్‌’.. కేవలం వారం రోజుల్లోనే..

ABN , First Publish Date - 2022-01-09T14:58:46+05:30 IST

కొవిడ్‌ శరవేగంగా నగరాన్ని చుట్టేస్తోంది. భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి....

Shocking : Corona కేసుల్లో ‘గ్రేటర్‌’.. కేవలం వారం రోజుల్లోనే..

  • తాజాగా 1583 మందికి కొవిడ్‌
  • ఎనిమిది రోజుల్లో 6610 కేసులు

హైదరాబాద్‌ సిటీ : కొవిడ్‌ శరవేగంగా నగరాన్ని చుట్టేస్తోంది. భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గత నెలలో వచ్చిన మొత్తం కేసుల కంటే ఇప్పుడు కేవలం వారం రోజుల్లోనే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం రోజుకు సగటున 576 వరకు కేసులు నమోదయితే, శనివారం ఒక్కరోజే 1,583 మందికి వైరస్‌ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన ఎనిమిది రోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 6,610 మందికి వైరస్‌ సోకింది. ఈనెల 3వ తేదీ నుంచి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇబ్బందులు ఉంటే కొవిడ్‌గా అనుమానించే వారు. కానీ, ఇప్పుడు అలాంటి లక్షణాలు ఉంటే పారాసిటమాల్‌ వేసుకొని ఇంటి వద్దనే ఉంటున్నారు. డాక్టర్లు సూచిస్తే కానీ కొందరు పరీక్షలు చేయించుకోవడం లేదు. మరికొందరు తెలిసిన డాక్టర్‌ను సంప్రందించి మందులు వాడుతున్నారు.


నిర్లక్ష్యం.. :-

- ఓ కంపెనీలో పనిచేసే విభాగం అధిపతికి కొవిడ్‌ అనుమానం ఉంది. అదేరోజు నమునాలు ఇచ్చి ఆఫీసుకు వచ్చారు. తోటి ఉద్యోగులతో సమావేశమయ్యారు. సాయంత్రం ఆఫీసర్‌కు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అతడిని కలిసిన మరో ఆరుగురికి కొవిడ్‌ సోకింది.

- చాలామందికి లక్షణాలు కనిపించినా, అనుమానం ఉన్నప్పటికీ అందరితో కలివిడిగా ఉంటున్నారు. జాగ్రత్తలు పాటించడం లేదు.  

- వైరస్‌ సోకిన వారిలో కొందరికి లక్షణాలు లేకపోవడంలో పరీక్షలు చేయించుకోవడం లేదు. దీంతో వారి ద్వారా  కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులకు విస్తరిస్తోంది.  

- ప్రస్తుతం మాల్స్‌, మార్కెట్లు, సినిమా హాళ్లు, వస్త్రదుకాణాలు...ఇలా ప్రతిచోటా జనం ఎక్కువ సంఖ్య ఉంటుండడంతో వైరస్‌ వ్యాప్తికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. 


- చాలా మంది మాస్కులు ధరించడం లేదు, భౌతిక దూరం అసలే పాటించడం లేదు. శానిటైజ్‌ వినియోగం, ఇంటికి వెళ్లిన తర్వాత సబ్బుతో శుభ్రంగా చేతులు కడుకోవడం, స్నానం చేయడం వంటివి చేయడం లేదు. 

- కూకట్‌పల్లిలో శనివారం 41 మందికి కరోనా సోకింది.  

- మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలో శనివారం 24 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

- కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్లు, దుండిగల్‌ పీహెచ్‌సీలో కలిపి శనివారం 19మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  

- ముషీరాబాద్‌లో 13మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ముషీరాబాద్‌ యూపీహెచ్‌సీలో 2, భోలక్‌ఫూర్‌ యూపీహెచ్‌సీలో 11 మందికి కరోనా వచ్చిందని డాక్టర్‌ కృష్ణమోహన్‌ తెలిపారు.  


జీహెచ్‌ఎంసీలో కలవరం

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలవరం మొదలైంది. ఇంజనీరింగ్‌ విభాగంలోని ఆరో అంతస్తులో ఓ అసిస్టెంట్‌ ఇంజనీర్‌కు వైరస్‌ నిర్ధారణ అయినట్టు తెలిసింది. నాలుగో అంతస్తులోనూ ఓ కేసు నమోదైనట్టు చెబుతుండగా.. వివరాలు మాత్రం అధికారులు వెల్లడించడం లేదు. కరోనా కేసుల నమోదు నేపథ్యంలో ఇతర విభాగాల్లోని ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉన్న దృష్ట్యా.. అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2022-01-09T14:58:46+05:30 IST