కొత్త ఔషధాల అభివృద్ధికి ఫార్మా అడుగులు

ABN , First Publish Date - 2021-11-25T08:58:54+05:30 IST

భారత ఔషధ కంపెనీలు కొత్త ఔషఽధాల అభివృద్ధి, ఇన్నోవేషన్‌ ఉత్పత్తుల వైపు అడుగులు వేస్తున్నాయి. ..

కొత్త ఔషధాల అభివృద్ధికి ఫార్మా అడుగులు

ప్రభుత్వం నిధులు అందించాలి: సతీశ్‌రెడ్డి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భారత ఔషధ కంపెనీలు కొత్త ఔషఽధాల అభివృద్ధి, ఇన్నోవేషన్‌ ఉత్పత్తుల వైపు అడుగులు వేస్తున్నాయి. కొత్త ఔషధాల నుంచి లభించే ఆదా యం వాటాను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. పరిశ్రమ భవిష్యత్‌ వృద్ధికి కొత్త ఔషధాల అభివృద్ధి, ఇన్నోవేషన్‌ దోహదకారి కాగలవని పరిశ్రమ భావిస్తోంది. అలా చేసినప్పుడే 2030 నాటికి పరిశ్రమ పరిమాణం 13,000 కోట్ల డాలర్ల (రూ.9.75 లక్షల కోట్లు) స్థాయికి చేరగలదని చెబుతోంది. ‘‘డిజిటల్‌ థెరప్యుటిక్స్‌, సెల్‌, జీన్‌ థెరపీ టెక్నాలజీల వైపు అడుగులు వేస్తున్నాం. ఇన్నోవేషన్‌ అభివృద్ధిని వేగిరం చేయగలదు. ఔషధ, హెల్త్‌కేర్‌ రంగాలకు ప్రపంచంలోనే మూడు అత్యుత్తమ గమ్యస్థానాల్లో భారత్‌ ఒకటి కానుంది’’ అని డాక్టర్‌ రెడ్డీస్‌ కో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ జనరిక్స్‌లో 22 శాతాన్ని భారత్‌ సరఫరా చేస్తోంది. ఈ హోదాతో ‘ప్రపంచ ఫార్మసీ’గా నిలిచింది. అయితే.. ఈ కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయట పడినప్పుడే  భవిష్యత్తులో వృద్ధిని కొనసాగించగలమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 


ఐటీ పరిశ్రమతో సమానంగా..

కొత్త ఔషధాల అభివృద్ధి, ఇన్నోవేషన్‌కు కంపెనీలు అడుగులు ముందుకు వేయాలంటే ప్రభుత్వ మద్దతు అవసరం. నియంత్రణ వ్యవస్థ మెరుగుపడాలి. నిధులు, పన్ను ప్రోత్సాహకాలు, ఐపీఓ నిబంధనల్లో మార్పులు, ఇతరత్రా మద్దతు ప్రభుత్వం అందించాల్సి ఉందని సతీశ్‌ రెడ్డి అన్నారు. ఐటీ పరిశ్రమ కన్నా ఫార్మా పరిశ్రమ ఎక్కువ విలువను సృష్టిస్తోందంటూ ఐటీ పరిశ్రమకు ఇచ్చిన స్థాయిలోనే ఔషధ పరిశ్రమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. 

బయోలాజిక్స్‌,  బయోసిమిలర్లలో: బయోలాజిక్స్‌, బయోసిమిలర్లలో కొత్త ఔషధాలను అభివృద్ధి చేసే సామర్థ్యాలు భారత కంపెనీలకు ఉన్నాయి. కొత్త ఔషధాలు విజయవంతమైతే.. పెట్టుబడులు పెరుగుతాయి. పరిశ్రమలో మార్పుల ప్రక్రియ, ప్రభుత్వ మద్దతుతో వచ్చే పదేళ్లలో  ఔషధ పరిశ్రమ మరింత ఆకర్షణీయంగా మారనుందని సతీశ్‌ రెడ్డి అన్నారు. ఇమ్యునో అంకాలజీ విభాగానికి సంబంధించి డాక్టర్‌ రెడ్డీస్‌ 13 వినూత్న ఔషధాలను అభివృద్ధి చేస్తోందని, ఇవి వివిధ దశల్లో ఉన్నాయని చెబుతూ వచ్చే పదేళ్లలో మొత్తం ఆదాయంలో ఇన్నోవేటివ్‌ ఔషధాల వాటాను 20 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బయోసిమిలర్లు, స్పెషాలిటీ డ్రగ్స్‌పై సన్‌ ఫార్మా పెట్టుబడులు పెడుతోంది. స్పెషాలిటీ థెరఫీలను అభివృద్ధి చేస్తోంది. సన్‌ ఫార్మా ఆదాయంలో 12-13 శాతం వినూత్న ఉత్పత్తుల నుంచి లభిస్తోంది. లుపిన్‌ సైతం పదేళ్లలో మొత్తం ఆదాయంలో కొత్త ఔషధాల వాటాను 20 శాతానికి పెంచుకోవాలని భావిస్తోంది.

Updated Date - 2021-11-25T08:58:54+05:30 IST