Sep 24 2021 @ 00:31AM

నాకు నెక్ట్స్‌ లెవల్‌ సినిమా

‘‘శేఖర్‌ కమ్ముల గత చిత్రాల్లో హీరోయిన్‌ పాత్రకు ఎక్కువ పేరొచ్చింది. ఈ చిత్రంలో సాయిపల్లవితోపాటు నాకూ మంచి గుర్తింపు వస్తుంది. ఇద్దరి పాత్రలు సరిసమానంగా ఉంటాయి. సాయి పల్లవి అద్భుతమైన నటి. తనతో డాన్స్‌ చేయడం సవాలే!’’ అని నాగచైతన్య అన్నారు. తనకు నచ్చిన కథలతోనే సినిమాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారాయన. తాజాగా ‘లవ్‌స్టోరి’ చిత్రంతో అలరించనున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయిక. నారాయణ దాస్‌ నారంగ్‌, పి.రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మించారు. శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా నాగచైతన్య విలేకర్లతో ముచ్చటించారు. 


దర్శకుడు శేఖర్‌ కమ్ములగారి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయనతో పనిచేయాలని చాలాకాలంగా అనుకుంటున్నా. ఆయన కథల్లో రియలిస్టిక్‌ అప్రోచ్‌ ఉంటుంది. ఆ తరహా కథలంటే నాకు అమితాసక్తి. ‘మజిలీ’తో నాకు అలాంటి సంతృప్తి కొంత దొరికింది. క్యూట్‌ లవ్‌స్టోరితో తెరకెక్కిన ఈ చిత్రంతో ఆ ఆనందం రెట్టింపు అయింది. పని విషయంలో శేఖర్‌ కమ్ముల ఇచ్చిన కంఫర్ట్‌తో ఆయనతో ఎంతదూరమైనా ట్రావెల్‌ చేయాలనుంది. ఈ  సినిమా తర్వాత నటుడిగా ఎదిగాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకు నెక్ట్స్‌ లెవల్‌ సినిమా ఇది. 


ఇందులో మహిళలకు సంబంధించిన సున్నితమైన విషయాన్ని దర్శకుడు అద్భుతంగా చెప్పారు. కుల వివక్ష, లింగ వివక్ష వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి కథ చెప్పాం. పల్లవి క్యారెక్టర్‌ ద్వారా ఈ విషయాన్ని చెబుతున్నాం. ఇందులో తెలంగాణ యాసలో మాట్లాడతాను. దాని కోసం చాలా ప్రాక్టీస్‌ చేశాను.  


మంచి కథ కుదిరితే ఇతర భాషల్లోనూ నటిస్తా. ఆమిర్‌ ఖాన్‌ గారితో ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన ప్రీ రిలీజ్‌కు వచ్చి మా సినిమా గురించి బాగా చెప్పారు. ఆయనకు వీలు చిక్కితే ‘లవ్‌ స్టోరి’ సినిమా చూపిస్తాం.