ఇక గెహ్లాట్, బాఘెల్ వంతు రాబోతోందా?

ABN , First Publish Date - 2021-09-18T23:22:15+05:30 IST

పంజాబ్ కాంగ్రెస్‌లో అంతఃకలహాలపై కఠినంగా వ్యవహరించిన

ఇక గెహ్లాట్, బాఘెల్ వంతు రాబోతోందా?

న్యూఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్‌లో అంతఃకలహాలపై కఠినంగా వ్యవహరించిన అధిష్ఠానం దృష్టి రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లపై పడినట్లు తెలుస్తోంది. అధికార పంపిణీపై ఈ రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు తలపడుతున్న సంగతి తెలిసిందే. 


పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ఆదేశించి కాంగ్రెస్ అధిష్ఠానం తన వైఖరిని స్పష్టం చేసింది. ఇది రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులకు గట్టి సందేశాన్ని పంపించినట్లయిందని విశ్లేషకులు చెప్తున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ కూడా తమ రాష్ట్రాల్లో ఈ విధంగానే అంతఃకలహాల్లో చిక్కుకున్నారు. పరస్పరం వ్యతిరేకించుకుంటున్న నేతలను ఏకతాటిపైకి తేవడానికి కాంగ్రెస్ అధిష్ఠానం చాలా ప్రయత్నిస్తోందని, ఈ ప్రయత్నాలు ఫలించకపోతే, కఠిన వైఖరిని ప్రదర్శించక తప్పదనే సంకేతాలను పంపిందని చెప్తున్నారు. 


రాజస్థాన్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సచిన్ పైలట్, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. 2020లో సచిన్ తిరుగుబాటు యత్నాలు విఫలమవడంతో గెహ్లాట్, సచిన్ మధ్య సయోధ్య కుదిర్చారు. అయితే ఆ ఫార్ములాకు అనుగుణంగా సచిన్ వర్గంలోని నేతలకు మంత్రి పదవులు ఇచ్చేందుకు గెహ్లాట్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. పార్టీ అధిష్ఠానాన్ని కలిసేందుకు కూడా గెహ్లాట్ ఢిల్లీ వెళ్ళడం లేదని సమాచారం. 


అదే విధంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్, ఆయన కేబినెట్ మంత్రి టీఎస్ సింగ్ దేవ్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. రొటేషన్ పద్ధతిలో సింగ్ దేవ్‌ను ముఖ్యమంత్రిగా చేస్తామని 2017లో ప్రభుత్వం ఏర్పాటైనపుడు హామీ ఇచ్చారని పేర్కొన్నాయి. వీరిరువురితోనూ రాహుల్ గాంధీ చర్చలు జరిపారు. 


Updated Date - 2021-09-18T23:22:15+05:30 IST