వచ్చేవారం మెట్రో రెండో విడత పనులు

ABN , First Publish Date - 2021-06-17T16:06:56+05:30 IST

మెట్రో రెండో విడత పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఉత్తర-మధ్య-దక్షిణ చెన్నైలను కలుపుతూ 118.9 కి.మీటర్ల దూరానికి మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు చెన్నై మెట్రోరైల్వే

వచ్చేవారం మెట్రో రెండో విడత పనులు


చెన్నై: మెట్రో రెండో విడత పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఉత్తర-మధ్య-దక్షిణ చెన్నైలను కలుపుతూ 118.9 కి.మీటర్ల దూరానికి మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు చెన్నై మెట్రోరైల్వే లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) సంస్థ పథకాన్ని రూపొందించింది. ఈ రెండో విడత పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. మాధవరం - శిరుచ్చేరి సిప్కాట్‌ల మధ్య 48.81 కి.మీటర్ల దూరంతో మూడో రైల్వే మార్గంనిర్మితం కానుంది. ఇందులో 19 కి.మీ దూరం పిల్లర్లపైనా, 26.72 కి.మీ మేర సొరంగ మార్గంలో నిర్మితం కానుంది. 4వ మార్గంలో మైలాపూర్‌ లైట్‌హౌస్‌ నుంచి పూందమల్లి మధ్య 26.1 కి.మీ దూరానికి, 5వ మార్గం మాధవరం నుంచి షోళింగనల్లూర్‌ మధ్య 47 కి.మీ దూరానికి నిర్మితం కానుంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ వల్ల రెండో విడత మెట్రోరైలు పనుల్లో జాప్యం ఏర్పడింది. ఈ పనుల్లో పాల్గొనే పొరుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు సొంతూళ్లకు వెళ్లడం వల్లనే జాప్యం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నగరంలో కరోనా ఉధృతి తగ్గుతుండడం వల్ల ప్రభుత్వం సడలింపులతో కూడిన లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. సొంతూళ్లకు వెళ్లిన వలస కార్మికులు కూడా ఇప్పుడిప్పుడే నగరానికి తిరుగుముఖం పట్టారు. అందువల్ల మెట్రోరైల్‌ 2వ విడత పనులు వచ్చే వారం ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా మాధవరం మెట్రోరైల్‌ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. మాధవరం - కెల్లీస్‌, కెల్లీస్‌ - తరమణిల మధ్య సొరంగమార్గం తవ్వకాల పనులను టెండర్ల ద్వారా రెండు భారీ సంస్థలకు అప్పగించారు. ఈ మార్గంలో మాధవరం మెట్రోరైల్వే స్టేషన్‌ టెర్మినల్‌గా పని చేస్తుందని, అందువల్లే మాధవరం నుంచే ఈ పనులను ప్రారంభించేందుకు సీఎంఆర్‌ఎల్‌ నిర్ణయించిందని అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-06-17T16:06:56+05:30 IST