Abn logo
Feb 21 2021 @ 01:32AM

ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

  • 20 ఏళ్ల తర్వాత ఎన్‌ఎఫ్‌డీసీ ఫండింగ్‌


మన దేశంలో మంచి చిత్రాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌.ఎఫ్‌.డి.సి.) ప్రతి ఏడాది కొన్ని చిత్రాలకు ఫండింగ్‌ ఇస్తుంది. ఈ ఏడాది కోరంగి నుంచి అనే తెలుగు సినిమాకు ఎన్‌ఎఫ్‌డీసీ కోటి రూపాయల ఫండింగ్‌ ఇవ్వబోతోందనే వార్త అనేక మందిలో ఆసక్తి రేపింది. దేశవ్యాప్తంగా 386 స్ర్కీప్టు స్ర్కీనింగ్‌కు వస్తే.. వాటిలో రెండింటిని ఎన్‌ఎఫ్‌డీసీ ఎంపిక చేసింది. వాటిలో ఒకటి కోరంగి నుంచి కావటం ఒక విశేషమైతే.. ఒకప్పుడు ఎన్‌ఎఫ్‌డీసీ నిర్మించిన తిలాదానం చిత్ర దర్శకుడు కె.ఎన్‌.టి. శాస్త్రి కుమారుడు- జయదేవ్‌ ఈ చిత్ర దర్శకుడు కావటం మరో విశేషం. 25 ఏళ్ల తర్వాత ఒకప్పటి నటి అర్చన తెలుగు సినిమాలో నటించటం ఇంకో విశేషం. 


1980లో  ఫిల్మ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఇండియన్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఎక్ప్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ సంస్థలను కేంద్ర ప్రభుత్వం విలీనం చేసి.. నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి తొలి అధ్యక్షుడుగా తెలుగు నిర్మాత డి.వి.ఎస్‌. రాజు వ్యవహరించేవారు. వ్యాపార దృక్పథం లేకుండా ఆఫ్‌బీట్‌ చిత్రాల నిర్మాణాన్ని ప్రొత్సహించటంతో పాటుగా వాటి మార్కెటింగ్‌ బాధ్యతలను కూడా ఎన్‌ఎఫ్‌డీసీనే స్వీకరించేది. వీటితో పాటుగా ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కు కూడా చిత్రాలను పంపేది. మృణాల్‌సేన్‌, శ్యామ్‌బెనగల్‌ వంటి దర్శకుల సినిమాలకు కూడా ఎన్‌ఎఫ్‌డీసీ సాయం చేసింది. అనేక ఆస్కార్‌ అవార్డులను గెలుచుకున్న గాంధీ సినిమా చిత్రనిర్మాణానికి కూడా ఎన్‌ఎఫ్‌డీసీ 5 కోట్లు సాయం చేసింది. డీవీఎస్‌ రాజు అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే హైదరాబాద్‌, బెంగుళూరులలో ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఆదిశంకరాచార్య, తోడు వంటి చిత్రాలు కూడా ఎన్‌ఎఫ్‌డీసీ ఆర్థిక సాయంతోనే నిర్మించారు. ఎన్‌ఎఫ్‌డీసీని ఏర్పాటు చేసిన సమయంలో- ముడి ఫిల్మ్‌ దిగుమతులకు అనుమతులు, థియేటర్ల నిర్మాణానికి రుణాలు- మొదలైన విషయాలు కూడా ఆ సంస్థ పరిధిలోకి వచ్చేవి. పి.వి. నరసింహారావు హయాంలో సరళీకరణ విధానాలు చిత్రపరిశ్రమపై కూడా ప్రభావం చూపించాయి. ఒక వైపు ఈ విధానాల వల్ల.. మరో వైపు సంస్థలో ఆర్థిక క్రమశిక్షణ లోపించటం వల్ల- ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. సంస్థ నిబంధనలల్లో మార్పులు తీసుకువచ్చింది.  


సమస్యలెన్నో..

ఎన్‌ఎఫ్‌డీసీ నిబంధనల్లో మార్పులు వచ్చిన తర్వాత- ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా హైదరాబాద్‌, బెంగుళూరులలో ఉన్న ప్రాంతీయ కార్యాలయాలను మూసివేసింది. హైదరాబాద్‌లో కార్యాలయం ఉన్న సమయంలో- ఆఫ్‌బీట్‌ చిత్రాల దర్శకులు- స్వయంగా కార్యాలయానికి వెళ్లి స్ర్కిప్ట్‌లను, తమ ప్రతిపాదనలను పంపటానికి వీలుండేది. ఈ కార్యాలయాన్ని మూసివేయటంతో ఇప్పుడు అందరూ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే కాకుండా ఈ కార్యాలయాన్ని మూసివేస్తున్న సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ తమ నిరసన వ్యక్తం చేయలేదు. ఆఫ్‌బీట్‌ చిత్రాలు వ్యాపారానికి పనికి రావని.. కమర్షియల్‌ సినిమాలే లాభాలు తెచ్చిపెడతాయని భావన సినీ పరిశ్రమలో బాగా పెరిగిపోయింది. దీనితో ఆఫ్‌బీట్‌ చిత్రాల నిర్మాణానికి అవసరమైన సాయం చేసే వారే కరువయ్యారు. ఒకప్పుడు ఈ చిత్రాల నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించిన ఎన్‌ఎఫ్‌డీసీ పూర్తిగా చేతులు ఎత్తివేయటం కూడా గమనించదగ్గ విషయం. ఈ నేపథ్యంలో మళ్లీ ఒక తెలుగు చిత్రానికి ఫండింగ్‌ చేయటం అందరూ స్వాగతించాల్సిన అంశం. 


ఎలా ఎంపిక చేస్తారు?

దక్షిణాదికి సంబంధించిన ఎన్‌.ఎఫ్‌.డిసి. ప్రాంతీయ కార్యాలయాలు చెన్నై, త్రివేండ్రంలో ఉన్నాయి. 2017లో చివరి సారి ఎన్‌ఎఫ్‌డీసీ స్ర్కిప్ట్‌లను ఆహ్వానించింది. వీటి ఫైనలేజేషన్‌ 2019 వరకూ జరగలేదు. ఎన్‌ఎఫ్‌డీసీ మళ్లీ ఎప్పుడు ప్రకటన ఇస్తుందో తెలియదు. ‘‘హిందూ దినపత్రికలో 2014లో ఓ ఆర్టికల్‌ వచ్చింది. దాన్ని ఆధారంగా ఈ సినిమా కథను తయారుచేశాం.  రంపచోడవరంలో ఓ గిరిజన మహిళ తన కొడుకు పెళ్లి కోసం పడే పాట్లే ఈ సినిమా కథ. దీనిలో గిరిజన మహిళగా అర్చన నటించారు. 25 ఏళ్ల తర్వాత ఆవిడ తెలుగులో మళ్లీ నటించటం ఒక విశేషం. ఆమె కొడుకుగా తమిళ హీరో విజయ్‌ తమ్ముడు విక్రాంత్‌ నటించారు. ఈ సినిమా  స్ర్కిప్ట్‌కు ఇప్పటికే మంచి ఆదరణ లభించింది. గుటన్‌బర్గ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఈ స్ర్కిప్ట్‌ ఎంపియింది. అమీర్‌ఖాన్‌, రాజ్‌కుమార్‌  హిరాణి  తదితరులు జ్యూరీ సభ్యులుగా  ‘సినీస్థాన్‌’ పేరుతో నిర్వహించిన కథల పోటీలో కూడా మా కథకు మూడో స్థానం లభించింది. ‘హు విల్‌ మ్యారీ థామస్‌’ అనే పేరిట దీనిని పోటీలకు పంపాం. తెలుగులో  ‘కోరంగి నుంచి’ అనే పేరు పెట్టాం. 2017లో ఎన్‌ఎఫ్‌డీసీ ప్రకటన చూసి మేము కూడా మా స్ర్కిప్ట్‌ను పంపాం. 386 స్ర్కిప్టులు వారికి వస్తే వాటిల్లో రెండింటిని ఎంపిక చేశారు. ఒకటి మనదైతే.. రెండోది బెంగాలీ డైరక్టర్‌ ఇంద్రాణిది. కోవిడ్‌ వల్ల 2019లో పూర్తవ్వాల్సిన షూటింగ్‌కు బ్రేక్‌ వచ్చింది. ఈ సినిమాకు ఎన్‌ఎఫ్‌డీసీ కోటి రూపాయలు ఫండింగ్‌ ఇచ్చింది. ముంబై నుంచి వచ్చిన ఎన్‌ఎఫ్‌డీసీ ప్రొడక్షన్‌ టీమ్‌ షూటింగ్‌ను పర్యవేక్షించింది.  

- ‘కోరంగి నుంచి’ చిత్ర దర్శకుడు జయదేవ్‌- వినాయకరావు