నీళ్లు తోడాకే తెలిసేది!

ABN , First Publish Date - 2020-10-18T10:26:13+05:30 IST

నీట మునిగిన మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(ఎంజీకేఎల్‌ఐ) మొదటి లిఫ్టు పునరుద్ధరణపై సందిగ్థత నెలకొన్నది.

నీళ్లు తోడాకే తెలిసేది!

సవ్యంగా సాగితే కల్వకుర్తి ఎత్తిపోతల

పంప్‌హౌస్‌లో వారంలో నీటి తొలగింపు

లోపల పగుళ్లున్నాయని ప్రభుత్వం అంగీకారం

శ్రీశైలం వరద ఒత్తిడి వల్లేనని అధికార్ల విశ్లేషణ 

రెండ్రోజుల్లో నీటిని తోడేయగలమని భరోసా

పగుళ్లుంటే కష్టమేనని విపక్షాల అంచనా

నీటి జాలు కొనసాగితే శ్రీశైలం మట్టం

తగ్గే వరకు వేచిచూడాలని అభిప్రాయం


మహబూబ్‌నగర్‌/హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): నీట మునిగిన మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(ఎంజీకేఎల్‌ఐ) మొదటి లిఫ్టు పునరుద్ధరణపై సందిగ్థత నెలకొన్నది. శనివారం ఇరిగేషన్‌ ఉన్నతాధికారులతో పాటు ఆ మోటర్లను తయారు చేసిన బీహెచ్‌ఈఎల్‌ నిపుణుల బృందం పంపుహౌ్‌సకు చేరుకొని పరిశీలించింది. మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనల అనంతరం రాత్రి 8 గంటల తర్వాత పంపుహౌ్‌సలో నీటిని తోడటం మొదలుపెట్టారు. పంపుహౌ్‌సలోమోటార్లున్న బేస్‌తో పాటు, మరో రెండు అంతస్తుల మేర సుమారు 100 అడుగుల వరకు నీరు నిలిచి ఉంది.


తాజా అంచనా ప్రకారం ప్రస్తుతం ఉన్న మోటార్లతో ఏ ఆటంకాల్లేకుండా ఈ నీటిని తొలగించాలంటే కనీసం వారం రోజుల సమయం పడుతుంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో మోటార్లు, పంపులు ఉన్న బేస్‌మెంట్‌ కుంగి, పగుళ్లు బారితే మాత్రం నీరు తోడటానికి ఆటంకం కలుగుతుందని భావిస్తున్నారు. ప్రతిపక్షాలు, నిపుణులు చెబుతున్నట్లు పాలమూరు పథకంలో చేపట్టిన భూగర్భ పంపుహౌస్‌ నిర్మాణం కోసం జరిగిన పేలుళ్ల ప్రభావంతోఈ మోటర్ల వద్ద బేస్‌ కుంగి నీరు లోపలికి వచ్చినట్లయితే నీళ్లు పూర్తిగా తోడటం కష్టమేనంటున్నారు. అదే పరిస్థితి నెలకొంటే, పంపుహౌ్‌సలోకి నీటిజాలు వస్తుందని, దీంతో పంపుహౌ్‌సలో ఎంతనీరు తొలగిస్తే అంతనీరు వచ్చి చేరుతుందని, దీంతో శ్రీశైలంలో నీరు తగ్గేంతవరకు పునరుద్ధరణ వీలు కాదని అంచనా వేస్తున్నారు. ఈ అంశాలపై ప్రాజెక్టు ఉన్నతాధికారులు, ఇతర ఇంజనీరింగ్‌ బాఽధ్యులు మాత్రం పెదవి విప్పడం లేదు. నిపుణులు పరిశీలించిన తర్వాతే ఏ విషయం ప్రకటిస్తామని చెబుతున్నారు.


బ్లాస్టింగ్‌ కారణం కాదు: ప్రభుత్వం

పంప్‌హౌ్‌సలో పగుళ్లు ఏర్పడినట్లు ప్రభుత్వంలోని ఉన్నతాధికారి ఒకరు అంగీకరించారు. విపక్షాలు ఆరోపిస్తున్నట్లు అవి పక్కన నిర్మిస్తున్న ప్రాజెక్టులో జరిపిన బ్లాస్టింగ్‌ వల్ల ఏర్పడినవి కాదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు నెలలుగా నిరంతరాయంగా శ్రీశైలం పూర్తిగా నిండి ఉండటంతో ఏర్పడిన ఒత్తిడి వల్ల ఈ పరిస్థితి వచ్చిందని, దీన్ని నియంత్రించగలమని అనుకున్నామని, సాధ్యం కాలేదని చెప్పారు. పంప్‌ హౌస్‌లో నీటి తోడకం మొదలైందని, మరింత పెద్ద మోటార్లు తెచ్చి సోమ, మంగళవారాల్లో మొత్తం నీళ్లు తోడేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మోటార్ల పరిస్థితిని సమీక్షిస్తామన్నారు.


తాగునీటికి తండ్లాటే

ఎల్లూరు పంపుహౌస్‌ పునరుద్ధర ణ జరగకపోతే మిషన్‌ భగీరథ పథకానికి తాగునీటి లభ్యత కష్టమవుతుంది. ఎల్లూరు రిజర్వాయర్‌ నుంచే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఉద్దేశించిన మిషన్‌ భగీరథ పథకానికి తాగునీరందిస్తున్నారు. గద్వాల, అలంపూర్‌ మినహా మిగిలిన 12 నియోజకవర్గాలకు ఈ పథకం నుంచే నీరు సరఫరా అవుతుంది. 0.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్‌ నీటిని పూర్తిగా తాగునీటికే వినియోగించినా, నెలకు మించి సరిపోదని తెలుస్తోంది. కోయిల్‌సాగర్‌, జూరాల, భీమా తదితర ప్రత్యామ్నాయ ప్రాజెక్టుల నుంచి మిషన్‌ భగీరథ పథకాలకు నీరందించాల్సిన పరిస్థితి ఏర్పడితే అదో ప్రహసనంగా మారుతుందని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణం పునరుద్ధరణ పనులు చేపట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. 


అప్పట్లోనే విమర్శలు

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం చుట్టూ వివాదాలే నడుస్తున్నాయి. రూ.5 వేల కోట్ల  వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో టన్నెళ్లు, కాలువల సామర్థ్యాన్ని తగ్గించడంపై వైఎ్‌స.రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి అనేక వివాదాలున్నాయి. 


నీటి తొలగింపునకు ఏర్పాట్లు

అధికారులు శనివారం ప్రాజెక్టు వద్దకు పరుగులు పెట్టి పంపుహౌ్‌సలో నీరు చేరికపై సమీక్షించారు. మోటార్లను ఏర్పాటు చేసి శనివారం రాత్రి నుంచే నీటి తొలగింపునకు ఏర్పాట్లు చేపట్టారు. వారంలోపు నీటి తొలగింపు ప్రక్రియ పూర్తి చేస్తామని, మోటారులో నెలకొన్న సాంకేతిక సమస్యలను గుర్తించి మరమ్మతులు చేసి నడిపిస్తామని ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు ఈఎన్‌సీ మురళీధర్‌, రిటైర్డు ఇంజనీరు పెంటారెడ్డి చెప్పారు. 


ప్రాజెక్టు కింద ఎకరా కూడా ఎండనివ్వం: శ్రీనివాస్‌గౌడ్‌

నాగర్‌కర్నూల్‌/కొల్లాపూర్‌, అక్టోబరు 17: ఎంజీఎల్‌ఐ (మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం) ప్రాజెక్టు కింద ఎకరా కూడా ఎండనివ్వబోమని మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. శనివారం కొల్లాపూర్‌ మండల పరిధిలోని ఎల్లూరు వద్ద ఉన్న కల్వకుర్తి మొదటి లిఫ్టు పంపుహౌస్‌ను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎలక్ర్టానిక్‌ పరికరాల్లో ఏ చిన్న లోపం వచ్చినా సమస్య వస్తుందని, ఎంజీఎల్‌ఐ మొదటి లిఫ్టు పంపుహౌస్‌లో మోటార్ల సీల్‌ ఎగిరిపోవడంతో పంపుహౌస్‌లోకి వరద నీరు వచ్చిందని చెప్పారు. సాధ్యమైనంత త్వరలో పంపుహౌస్‌ పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-10-18T10:26:13+05:30 IST