శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా

ABN , First Publish Date - 2020-08-14T14:24:33+05:30 IST

శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘిస్తే లక్ష రూపాయల వరకు జరిమానా విధించవచ్చని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతిపాదనలను....

శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తాజా ఉత్తర్వు

న్యూఢిల్లీ : శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘిస్తే లక్ష రూపాయల వరకు జరిమానా విధించవచ్చని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతిపాదనలను జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆమోదించింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో శబ్ద కాలుష్య నియమాలను పాటించేలా చూసేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్పీ గార్గ్ నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఛైర్ పర్సన్ ఆదర్శ్ కుమార్ గోయెల్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆదేశించారు.శబ్ద కాలుష్య ఉల్లంఘనలకు జాతీయ కాలుష్య నియంత్రణ మండలి ప్రతిపాదించిన జరిమానాలను దేశవ్యాప్తంగా అమలు చేయగానికి చట్టబద్దమైన ఉత్తర్వులను జారీ చేయాలని ఎన్జీటీ కోరింది. శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘిస్తే లౌడ్ స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ను స్వాధీనం చేసుకోవడంతోపాటు రూ.10వేలు జరిమానా విధించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతిపాదించింది. 1000 కేవీఏ కంటే ఎక్కువ సామర్థ్యం కల డీజిల్ జనరేటర్ల నుంచి వచ్చే శబ్ద కాలుష్యానికి లక్ష రూపాయల వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది. నిర్మాణ ప్రదేశాల్లో అనుమతించిన స్థాయికి మించిన శబ్దం  చేస్తే రూ.50వేలు జరిమానా విధించడంతోపాటు పరికరాలను స్వాధీనం చేసుకునేందుకు ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నివాస ప్రాంతాల్లో పగలు 55 డెసిబెల్స్, రాత్రివేళలో 45 డెసిబెల్స్ శబ్దం స్థాయిని అనుమతించనున్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో పగటిపూట 75 డీబీ, రాత్రి వేళ 70 డీబీ, ఆసుపత్రులు, విద్యాసంస్థలున్న ప్రాంతాల్లో పగలు ప్రామాణిక శబ్దం పరిమితి రాత్రి సమయంలో 50 డెసిబెల్స్, పగలు 40 డెసిబెల్స్ శబ్దాన్ని అనుమతించనున్నారు. అనుమతించదగిన పరిమితికి మించి శబ్దం చేసేలా పటాకులు పేలిస్తే భారీ జరిమానాలు విధించాలని కేంద్ర బోర్డు నిర్ణయించింది. నివాసప్రాంతాల్లో పటాకులు పేల్చిన వ్యక్తికి వెయ్యిరూపాయలు, సైలెన్స్ జోన్ లో పటాకులు పేలిస్తే మూడువేలరూపాయల జరిమానా విధించవచ్చు. బహిరంగ ర్యాలీలో పటాకులు పేలిస్తే రూ.10వేల నుంచి రూ.20వేల వరకు జరిమానా విధించనున్నారు. శబ్దకాలుష్య ఉల్లంఘనలు పునరావృతమైతే జరిమానాలు రెట్టింపు విధించనున్నారు. ప్రస్థుతం వివాహాలు, ఈవెంట్స్, రెస్టోబార్ లలో రాత్రి 11 గంటలకు మించి లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదు. 

Updated Date - 2020-08-14T14:24:33+05:30 IST