చెరువులో ఇళ్ల నిర్మాణాలపై ఎన్జీటీ విచారణ

ABN , First Publish Date - 2021-09-18T05:29:44+05:30 IST

హుద్‌హుద్‌ బాధితుల కోసం కొమ్మాది సర్వే నంబర్‌ 83లో గృహనిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఇళ్ల సముదాయాలను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) బృందం శుక్రవారం పరిశీలించింది.

చెరువులో ఇళ్ల నిర్మాణాలపై ఎన్జీటీ విచారణ
కొమ్మాదిలో ఇళ్ల సముదాయాలు నిర్మించిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎన్‌జీటీ బృందం

జిల్లా అధికారులపై ప్రశ్నల వర్షం

ఫిర్యాదుదారుడికి సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం 


కొమ్మాది, సెప్టెంబరు 17: హుద్‌హుద్‌ బాధితుల కోసం కొమ్మాది సర్వే నంబర్‌ 83లో గృహనిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఇళ్ల సముదాయాలను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) బృందం శుక్రవారం పరిశీలించింది. సుమారు ఆరు ఎకరాల చెరువుగర్భంలో 600కుపైగా ఇళ్ల సముదాయం నిర్మిస్తున్నందున కొమ్మాది పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆయకట్టుకు నీరు అందదని, అంతేకాక పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందంటూ అదే గ్రామానికి చెందిన ఒకరు ఎన్‌జీటీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎన్‌జీటీ నుంచి ఉన్నతాధికారి చక్రవర్తి, సైంటిస్టు సురేశ్‌బాబుతోపాటు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, నీటి పారుదల శాఖ ఎస్‌ఈ సూర్యకుమార్‌, హౌసింగ్‌ పీడీ శ్రీనివాసరావు, విశాఖ ఆర్డీవో పెంచల కిశోర్‌ తదితరులు ఇళ్ల సముదాయ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు జిల్లా అధికారులను పలు అంశాలపై ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణానికి జీవీఎంసీ, వుడా(వీఎంఆర్‌డీఏ) నుంచి ప్లాన్‌ తీసుకున్నారా? అని ప్రశ్నించగా... అన్నిరకాల అనుమతులున్నాయని అధికారులు వివరించారు. ఇళ్లు నిర్మించిన ప్రాంతం పంచాయతీరాజ్‌ శాఖ నుంచి బదలాయింపు జరిగిందా? అని ప్రశ్నించగా, ఆ శాఖ ఇచ్చిన 3,500 చెరువుల జాబితాలో సర్వే నంబర్‌ 83 లేదని ఇరిగేషన్‌ అధికారులు చెప్పారు. నీటి ముంపునకు గురికాకుండా ఇళ్లు నిర్మించేందుకు ఎంత ఎత్తున మట్టితో పూడ్చారని ప్రశ్నించగా, స్థలాన్ని ఎత్తు చేయలేదని, కేవలం లెవెలింగ్‌ చేసి ఇళ్లు నిర్మించామని అధికారులు బదులిచ్చారు. నిర్మాణ ప్రాంతంలో డ్రైనేజీ ఛానెల్స్‌పైనా ట్రైబ్యునల్‌ సభ్యులు ఆరా తీశారు. ఇళ్లు నిర్మించిన ప్రాంతానికి ఆనుకుని వ్యవసాయ భూములు ఉన్నాయా? ఎంత విస్తీర్ణంలో సాగు చేపడుతున్నారు? రైతులకు నష్టం వాటిల్లుతుందా? అని ప్రశ్నించారు. 


ఫిర్యాదుదారుడికి సమాచారం ఇవ్వరా?

కాగా జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) బృందం పరిశీలనకు వస్తున్నట్టు ఫిర్యాదుదారుడికి జిల్లా అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో అతను హాజరుకాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిటీ సభ్యులు, వెంటనే అతనికి సమాచారం అందించాలని ఆదేశించారు. అనంతరం ఇళ్లకు దగ్గరగా ఉన్న కొమ్మాది చెరువును పరిశీలించారు. ఈ పర్యటనలో జీవీఎంసీ సీసీపీ విద్యుల్లత, డీసీపీ రాంబాబు, ఇరిగేషన్‌, హౌసింగ్‌, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T05:29:44+05:30 IST