పీఎఫ్‌ఐ కేసులో నలుగురిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

ABN , First Publish Date - 2022-09-20T07:49:48+05:30 IST

కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌, లీగల్‌ అవేర్‌నెస్‌ పేరుతో యువతలో ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోస్తున్నారనే అభియోగంతో.

పీఎఫ్‌ఐ కేసులో నలుగురిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

  • మరికొందరిని విచారిస్తున్న ఎన్‌ఐఏ అధికారులు 
  • పీఎఫ్‌ఐ శిక్షణ శిబిరాలపై నిగ్గు తేల్చాలి: వీహెచ్‌పీ
  • మా వాళ్లపై దాడులు ఆపాలి: పీఎఫ్‌ఐ..
  • కరీంనగర్‌పై ఎన్‌ఐఏ ప్రత్యేక దృష్టి

హైదరాబాద్‌, పంజాగుట్ట, కరీంనగర్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌, లీగల్‌ అవేర్‌నెస్‌ పేరుతో యువతలో ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోస్తున్నారనే అభియోగంతో.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ)కి చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని 40 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో లభించిన ఆధారాల మేరకు పలువురు పీఎ్‌ఫఐ నేతలకు సీఆర్పీసీ సెక్షన్‌ 41(ఏ) కింద నోటీసులు జారీ చేశారు. ఆదివారం అదుపులోకి తీసుకున్న సయ్యద్‌ సమీర్‌, మహమ్మద్‌ ఇర్ఫాన్‌ అహ్మద్‌, ఫిరోజ్‌ఖాన్‌, మహమ్మద్‌ ఒమన్‌ను అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ అధికారులు సోమవారం వెల్లడించారు. ఆ నలుగురిని నాంపల్లిలోని ఎన్‌ఐఏ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో.. ఆ నలుగురిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎన్‌ఐఏ అధికారులు మరికొందరిని విచారిస్తున్నారు. ఏపీలోని కడప కేంద్రంగా దశాబ్దాలుగా సాగుతున్న పీఎ్‌ఫఐ శిక్షణ శిబిరాలపై నిగ్గు తేల్చాలని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. శిక్షణ పొందిన ఉగ్రవాదులను పట్టుకుని, ఎన్‌కౌంటర్‌ చేయాలన్నారు. 


కరాటే నేర్పించడం తప్పా: పీఎఫ్ఐ

మార్షల్‌ ఆర్ట్స్‌, కరాటే నేర్పించడం తప్పా? రాష్ట్రంలో దానిపై నిషేధమేమీ లేదు కదా? అని పలువురు పీఎ్‌ఫఐ నేతలు ప్రశ్నించారు. పీఎఫ్ఐకు చెందిన నలుగురు యువకుల అరెస్టు నేపథ్యంలో ఇమామ్స్‌ కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్‌ వాహెద్‌, ఆల్‌ ఇండియా ఇమామ్స్‌ కౌన్సిల్‌ ప్రధాన కార్యదర్శి వలియుల్లాతో కలిసి పీఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రఫీక్‌ అహ్మద్‌-- సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పీఎ్‌ఫఐ నేతలపై పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు దాడులను ఆపాలని, లేనిపక్షంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పీఎ్‌ఫఐ సంస్థకు.. కరాటే మాస్టర్‌ అబ్దుల్‌ ఖాదర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.  


కరీంనగర్‌లో చాపకింద నీరులా..?

కరీంనగర్‌లో ఎన్‌ఐఏ తనిఖీలతో కలకలం నెలకొంది. జిల్లాలో మరో ముగ్గురు కూడా పీఎ్‌ఫఐ తరఫున క్రియాశీలంగా పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిజామాబాద్‌, జగిత్యాల కేంద్రాలుగా.. కరీంనగర్‌లో పీఎఫ్‌ఐ చాపకింద నీరులా విస్తరిస్తోందని పోలీసులు గుర్తించారు. 2002 నంబరు 23న కరీంనగర్‌ శివార్లలోని రేకుర్తిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తాయిబా ఉగ్రవాదిఅజీజ్‌ మరణించాడు. 2005 ఆగస్టు 11న కరీంనగర్‌ బస్‌స్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై ఒక బాంబు పేలిన సంఘటనలో 30 మందికిపైగా గాయపడ్డారు. 2008లో కరీంనగర్‌ ఆర్టీసీ బస్‌స్టేషన్‌ ప్లాట్‌ఫాం వద్ద ఒక పేలని బాంబును పోలీసులు స్వాధీనం చేసుకుని, నిర్వీర్యం చేశారు. 2014 సెప్టెంబరులో ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌)లో చేరేందుకు కోల్‌కతా మీదుగా బంగ్లాదేశ్‌ వెళ్లేందుకు యత్నించిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం నాటి ఎన్‌ఐఏ తనిఖీలతో మళ్లీ కరీంనగర్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Updated Date - 2022-09-20T07:49:48+05:30 IST