ఎన్ఐఏకు లష్కరే తోయిబాపై కీలక సమాచారం లభ్యం

ABN , First Publish Date - 2020-06-15T14:43:00+05:30 IST

ఎన్ఐఏ అధికారులకు లష్కరే తోయిబా కార్యకలాపాలపై కీలక సమాచారం లభించింది....

ఎన్ఐఏకు లష్కరే తోయిబాపై కీలక సమాచారం లభ్యం

ఎన్ఐఏ కస్టడీలో లష్కరే తోయిబా మహిళా ఉగ్రవాది 

న్యూఢిల్లీ : ఎన్ఐఏ అధికారులకు లష్కరే తోయిబా కార్యకలాపాలపై కీలక సమాచారం లభించింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా నగరానికి చెందిన ఓ మహిళకు లష్కరే తోయిబా ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కోల్‌కతా నగరానికి చెందిన తానియా పర్వీన్ అనే మహిళ పాకిస్థాన్ వాట్సాప్ నంబరును వినియోగిస్తూ ఆ దేశంలోని పలు వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. తానియా పర్వీన్ కు లష్కరే తోయిబా ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని, పాక్ సిమ్ కార్డుతో పలువురు పాకిస్థానీయులతో మాట్లాడుతున్నారని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. తానియా పర్వీన్ ను గతంలో అరెస్టు చేసి డం డం సెంట్రల్ జైలుకు తరలించారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులతో సంబంధాలపై తానియాను ప్రశ్నించేందుకు ఎన్ఐఏ అధికారులు పదిరోజుల పాటు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. లష్కరే తోయిబా కార్యకలాపాలపై తానియా పలు విషయాలు వెల్లడించే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. బంగ్లాదేశీయురాలైన తానియా అక్రమంగా సరిహద్దు దాటి కోల్ కతాలో నివాసముంటూ, ఇక్కడే ఎంఏ చదివిందని అధికారులు చెప్పారు.తానియా వద్ద పాక్ దేశానికి చెందిన పలు సిమ్ కార్డులు లభించాయి. లష్కరే తోయిబా సాహిత్యంతోపాటు వీడియోలు, శిక్షణ కార్యక్రమాలపై వాట్సాప్ గ్రూపులో సమాచారం మార్పిడి చేసుకుందని వెల్లడైంది. ముంబై ఉగ్రదాడి వ్యూహకర్త హఫీజ్ సయీద్ తో తానియా పర్వీన్ మాట్లాడుతున్నారని, ఆమెకు హవాలా మార్గంలో ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు వస్తున్నాయని ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.  

Updated Date - 2020-06-15T14:43:00+05:30 IST