నెల్లూరులో ఎన్‌ఐఏ సోదాలు

ABN , First Publish Date - 2021-11-19T02:17:59+05:30 IST

నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారులు గురువారం నెల్లూరులో తనిఖీలు చేశారు. అరవిందనగర్‌లోని ఓ ఇంట్లో వేకువజామున

నెల్లూరులో ఎన్‌ఐఏ సోదాలు

నెల్లూరు: నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారులు గురువారం నెల్లూరులో తనిఖీలు చేశారు. అరవిందనగర్‌లోని ఓ ఇంట్లో వేకువజామున నుంచి సోదాలు జరిపి అక్కడ నివసిస్తున్న ఇద్దరు మహిళల నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఓ డైరీ స్వాధీనం చేసుకున్నారు. కొన్ని గంటల పాటు ఆ ఇంటిని పూర్తిగా జల్లెడ పట్టారు. ఆ సమయంలో ఇంట్లోకి చుట్టుపక్కల వాళ్లను, మీడియాను అనుమతించలేదు. స్థానిక పోలీసులు అంతర్గతంగా చెప్పిన సమాచారం మేరకు..  నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిమ్మాయపాలెంలో ఒకే కుటుంబానికి సునీల్‌ అలియాస్‌ రవి, అన్నపూర్ణ, అనుష, భవానీలు చిన్నతనం నుంచి విప్లవ భావాలకు ఆకర్షితులయ్యారు. గతంలో వీరు హైదరాబాదులో ఉండేవారు. అయితే వీరిలో అన్నపూర్ణ, అనూషలు కొంతకాలం క్రితం నెల్లూరుకు వచ్చి ఓ ఇంట్లో అద్దెకు నివాసం ఉంటున్నారు. గతంలో చైతన్య మహిళా సంఘంలో పని చేసేవారు. ప్రస్తుతం టైలరింగ్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా ప్రజాసంఘాల ఉద్యమాలకు దూరంగా ఉంటున్నారు.


అయితే వీరి సోదరుడు సునీల్‌ అలియాస్‌ రవి మావోయిస్టు పార్టీలో చేరి టెక్నికల్‌ బృందంలో కీలకంగా వ్యవహరించేవారు. ఇటీవల జార్ఖండ్‌లో జరిగిన బాంబు ప్రమాదంలో అతడు మరణించినట్లు మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఐఏ అధికారులకు అందిన సమాచారం మేరకు నెల్లూరులో నివాసం ఉంటున్న రవి సోదరీమణుల నివాసంలో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎన్‌ఐఏ అధికారులు వెనుదిరిగిన అనంతరం అన్నపూర్ణ, అనూషలు మీడియాతో మాట్లాడుతూ ఎన్‌ఐఏ అధికారులు ఎందుకు తమ ఇంటికి వచ్చారన్నది తమకు కూడా తెలియదన్నారు. కోర్టు ఆర్డర్‌ ఉందని చెప్పి తనిఖీలు చేశారని, తమ ఇద్దరి సెల్‌ఫోన్లతోపాటు టైలరింగ్‌ కొలతలు రాసుకునే డైరీని తీసుకెళ్లారని తెలిపారు. తమ తమ్ముడు నక్సలైట్ల ఉద్యమంలో పనిచేస్తూ చనిపోయాడని తెలిసిందని, దాని కారణంగా ఏమైనా ఎన్‌ఐఏ అధికారులు తమ వద్దకు వచ్చి ఉండవచ్చని వారు చెప్పారు. 



Updated Date - 2021-11-19T02:17:59+05:30 IST