ఎన్‌ఐఏ సోదాలును తీవ్రంగా ఖండించిన పౌరహక్కుల సంఘం

ABN , First Publish Date - 2021-04-01T21:04:46+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సంఘాల నేతల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పౌరహక్కుల సంఘం

ఎన్‌ఐఏ సోదాలును తీవ్రంగా ఖండించిన పౌరహక్కుల సంఘం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సంఘాల నేతల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అక్రమ అరెస్టులతో, ప్రజా సంఘాల నాయకులను ఎన్‌ఐఏ టార్గెట్ చేస్తోందని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అర్బన్ నక్షలైట్లుగా ముద్ర వేస్తున్నారని తప్పుబట్టారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎన్‌ఐఏను ఏర్పాటు చేశారని, ఎన్‌ఐఏను ఉపసంహరించుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకాపాల నిరోధక చట్టం(ఉపా చట్టం)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేసి, వారు తెచ్చిన మెటీరియల్ ఇంట్లో పెట్టి మావోలతో సంబంధాలు ఉన్నాయని కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బుధవారం ఒక్క రోజు రెండు రాష్ట్రాల్లో 27 మందిని ఎన్‌ఐఏ విచారించిందని లక్ష్మణ్ తెలిపారు.


హైదరాబాద్‌లో ప్రజా సంఘాల నేతల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు చేసింది. ఏపీలోని విశాఖపట్నం జిల్లా మంచంగిపుట్టు పోలీస్‌ స్టేషన్‌లో ప్రజా సంఘాల నేతలపై నమోదైన కేసు ఎన్‌ఐఏకి బదిలీ అయింది. 64 మంది ప్రజా సంఘాల నేతలపై ఎన్‌ఐఏ హైదరాబాద్‌ విభాగం ఉపా కేసు నమోదు చేసింది. నిషేధిత మావోయిస్టు పార్టీతో వారికి సంబంధాలు ఉన్నాయని అభియోగాలు మోపింది.  పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు జాను, రాష్ట్ర కార్యదర్శి కోటి, చైతన్య మహిళా సంఘం నాయకురాలు దేవేంద్ర, జననాట్యమండలి నాయకుడు డప్పు రమేశ్‌ ఇళ్లలో బుధవారం రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. మంచంగిపుట్ట, పిడుగురాళ్ల కేసులను కొట్టివేయాలంటూ ప్రజాసంఘాల తరఫున అడ్వకేట్‌ రఘునాథ్‌ వాదిస్తున్నారు. 

Updated Date - 2021-04-01T21:04:46+05:30 IST