భారత్‌లో ‘ఏ2ఏ’ కరోనా విధ్వంసం

ABN , First Publish Date - 2020-05-27T07:45:16+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు పాకిన ఏ2ఏ రకం కరోనా వైరస్సే భారతదేశంలోనూ విస్తృతంగా వ్యాపిస్తోందని కోల్‌కతాకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ జీనోమిక్స్‌

భారత్‌లో ‘ఏ2ఏ’ కరోనా విధ్వంసం

  • చాలా దేశాల్లో ఆ రకానిదే ఆధిపత్యం
  • తెలంగాణలో వ్యాపిస్తున్నది ‘ఓ’ రకం: ఎన్‌ఐబీజీ 


కోల్‌కతా: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు పాకిన ఏ2ఏ రకం కరోనా వైరస్సే భారతదేశంలోనూ విస్తృతంగా వ్యాపిస్తోందని కోల్‌కతాకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ జీనోమిక్స్‌ (ఎన్‌ఐబీజీ) పరిశోధకులు తెలిపారు. చైనాలో పుట్టిన కొవిడ్‌-19 వైరస్‌ ‘ఓ’ రకం కాగా.. దాంట్లో ఉత్పరివర్తనాలు జరుగుతూ ఏ2ఏ, ఏ3, బీ3, బి, బీ1, ఏ1ఎ.. ఇలా దాదాపు పది కొత్త రకాలుగా మారింది. వాటన్నింటిలో బలమైనది ఏ2ఏ రకమే. చైనాలోనే జనవరిలో ఈ రకాన్ని గుర్తించారు. ఒకరి నుంచి మరొకరికి సోకే సామర్థ్యం, మానవుల ఊపిరితిత్తుల కణాలపై దాడిచేసే సత్తా పుష్కలంగా ఉండడంతో ఈ స్ట్రెయిన్‌ పలు దేశాలక విస్తృతంగా వ్యాపించిందని ఎన్‌ఐబీజీ పరిశోధకులు గతంలోనే తెలిపారు.


తాజాగా మనదేశంలో 327 జన్యుక్రమాలను పరిశీలించిన ఎన్‌ఐబీజీ పరిశోధకులు.. అందులో 48.6 శాతం ఏ2ఏ రకానివేనని తేల్చారు. ‘ఓ’ రకం స్ట్రెయిన్లు 42.4 శాతం ఉండగా.. మిగతా 9.2 శాతంలో ఇతర స్ట్రెయిన్లు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రాలవారీగా చూస్తే.. పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఏ2ఏ ఎక్కువగా వ్యాపిస్తుండగా.. తెలంగాణలో ‘ఓ’ రకం ఎక్కువగా ఉందని.. ఢిల్లీ, కర్ణాటకల్లో ఈ రెండు రకాల వైరస్‌లూ ఉన్నట్టు తేలిందని పరిశోధకులు వివరించారు. కాగా.. గతంలో 55 దేశాల నుంచి సేకరించిన 3600 జన్యుక్రమాలను పరిశీలించిన పరిశోధకులు వాటిలో 50.8% ఏ2ఏ రకానివేనని తేల్చారు. సాధారణంగా వైరస్‌ల జన్యువుల్లో ఉత్పరివర్తనాలు జరిగినప్పుడు అవి వేరొకరికి సోకే సామర్థ్యాన్ని కోల్పోతాయి. కొన్ని ఉత్పరివర్తనాలు మాత్రం ఆ సామర్థ్యాన్ని పెంచుతాయి. అలాంటి రకాలు ఒకదశలో తమ పుట్టుకకు కారణమైన అసలు వైరస్‌ను సైతం అధిగమించి భారీగా వ్యాపిస్తాయి. ఏ2ఏ రకం అలాంటిదే. అసలు, కొవిడ్‌-19 ఈ స్థాయిలో ప్రపంచాన్ని వణికించడానికి కారణం ఈ రకమే.

Updated Date - 2020-05-27T07:45:16+05:30 IST