హైదరాబాద్ మహిళతో ఫ్రెండ్‌షిప్‌.. లక్షలు కొట్టేసిన నైజీరియన్‌

ABN , First Publish Date - 2021-06-22T12:54:18+05:30 IST

ఫేస్‌బుక్‌లో స్నేహం పెంచుకుని ఓ మహిళను ట్రాప్‌ చేసి...

హైదరాబాద్ మహిళతో ఫ్రెండ్‌షిప్‌.. లక్షలు కొట్టేసిన నైజీరియన్‌

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : ఫేస్‌బుక్‌లో స్నేహం పెంచుకుని ఓ మహిళను ట్రాప్‌ చేసిన నైజీరియన్‌ లక్షలు కాజేశాడు. హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రాధే కిరణ్‌ అనే మహిళ ఓ ఎన్జీవో సంస్థను నిర్వహిస్తోంది. ఆర్ధర్‌ మిస్ట్రాడో పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను యూకేలో ఉంటున్నానని, ఇక్కడ వ్యాపారాలు ఉన్నాయని నమ్మించాడు. మహిళ నిర్వహిస్తున్న ట్రస్ట్‌ వివరాలు తెలుసుకున్నాడు. మీ ట్రస్ట్‌కు పెద్ద మొత్తంలో డొనేషన్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, కొరియర్‌ ద్వారా డబ్బులు పంపిస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత మూడు రోజులకు మహిళకు ఫోన్‌ వచ్చింది.


తాము ఎయిర్‌పోర్ట్‌ కస్టమ్స్‌ నుంచి కాల్‌ చేస్తున్నామని, మీకు వచ్చిన నగదు పార్శిల్‌పై ట్యాక్స్‌లు చెల్లించాలని, అంతేకాకుండా నిబంధనలు అతిక్రమించినందున జరిమానా కూడా చెల్లించాలని భయపెట్టారు. దీంతో వారు చెప్పిన ఖాతాకు రూ.2.75లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఆ తర్వాత మళ్లీ ఫోన్‌ చేసిన ఇంకో రెండు లక్షలు కావాలని డిమాండ్‌ చేయడంతో అనుమానించిన బాధితురాలు సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది.

Updated Date - 2021-06-22T12:54:18+05:30 IST