రాత్రికి.. రాత్రే!

ABN , First Publish Date - 2022-01-28T05:04:35+05:30 IST

చాలా వరకు మనం ప్రైవేట్‌ భూముల్లో అనుమతి లేని వెంచర్ల గురించి విన్నాం.. చూశాం. కానీ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో ఏకంగా అసైన్డ్‌ భూముల్లో సైతం వెంచర్లు చేస్తున్నారు.

రాత్రికి.. రాత్రే!

  • అసైన్డ్‌ భూముల్లో వెలసిన వెంచర్లు
  • దమ్మాయిగూడ మున్సిపల్‌ పరిధిలో మూడెకరాల్లో రాత్రికి రాత్రి తాత్కాలిక ఇళ్ల నిర్మాణాలు
  • ఇళ్లకు బోగస్‌ ఇంటి నెంబర్లు.. విద్యుత్‌ కనెక్షన్లు
  • చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
  • ప్లాట్లుకొని  మోసపోతున్న సామాన్యులు

చాలా వరకు మనం ప్రైవేట్‌ భూముల్లో అనుమతి లేని వెంచర్ల గురించి విన్నాం.. చూశాం. కానీ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో ఏకంగా అసైన్డ్‌ భూముల్లో సైతం వెంచర్లు చేస్తున్నారు. జిల్లా నగరానికి ఆనుకొని ఉండడం, భూముల రేట్లు విపరీతంగా పెరగడంతో రియల్టర్ల కన్ను అసైన్డ్‌ భూములపై పడింది. పేదలను ఏదోరకంగా ఒప్పించి వారికి ఎంతో కొంత ముట్టజెప్పి రాత్రికి రాత్రే తాత్కాలిక ఇళ్లు నిర్మిస్తున్నారు. బోగస్‌ ఇంటి నెంబర్లు వేస్తున్నారు. కొన్నిం టిలో వెంచర్లూ చేస్తున్నారు. వీటికి ప్రభుత్వం ఎలాగూ అనుమతిస్తుందనే ధీమాతో నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ అక్రమాలకు అధికార పార్టీ నాయకుల మద్దతు, అధికారుల అండ దండలు పుష్కలంగా ఉంటున్నాయి. ప్లాట్లు కొంటున్న సామాన్యులు మాత్రం మోసపోతున్నారు.

(మేడ్చల్‌, జనవరి 27, ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని మునిసిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలు, అసైన్డ్‌ భూముల్లో అనధికారికంగా ఇళ్లు నిర్మిస్తున్నారు. జిల్లాలో 9మునిసిపాలిటీలు, నాలుగు కార్పొరేషన్లు ఉన్నాయి. చాలా మట్టుకు వ్యవసాయ భూములు నేడు నివాస ప్రాంతాలుగా మారుతున్నాయి. దీంతో కొందరి కన్ను అసైన్డ్‌ భూములపై పడింది. అసైన్డ్‌, సీలింగ్‌, ఆలయ, ప్రభుత్వ భూములు ఆక్రమార్కులు ఆధీనంలోకి తీసుకొని రియల్‌ దందా చేస్తున్నారు. ఈ భూములకు నాలా, ఎన్వోసీ వంటివేవీ తీసుకోకుండా వెంచర్లు చేసి అమ్ముతున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకుల అండ, అధికారుల సహకారంతో అసైన్డ్‌ భూములు వెంచర్లుగా మారుతున్నాయి.


  • బోగస్‌ ఇంటి నెంబర్లు.. కరెంట్‌ కనెక్షన్లు!

ఘట్‌కేసర్‌ మునిసిపాలిటీ చౌదరిదూడలో మూడెకరాల అసైన్డ్‌ భూమిలో ఇల్లు వెళిశాయి. దమ్మాయిగూడ సర్వే నెంబరు 77, 24లో ఉన్న అసైన్డ్‌ భూముల్లో నిర్మాణాలు వెలిశాయి. అనధికార నిర్మాణాలకూ ప్రభుత్వం అనుమతులిచ్చేందుకు సుముఖంగా ఉందని కొందరు రాత్రికిరాత్రి ఇళ్లు నిర్మించారు. ఈ ఇళ్లకు బోగస్‌ ఇంటి నెంబర్లు సృష్టించారు. విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకున్నారు. దమ్మాయిగూడలో ఫుడ్‌కోర్టు పేరుతో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. వివాదాస్పద స్థలాల్లోనూ పనులు శరవేగంగా చేస్తున్నారు. నాగారంలోని ఓ ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేస్తున్నారు. ఇక్కడ ఓ వెంచర్‌లో 1,670 గజాల స్థలం మున్సిపాలిటీకి వచ్చింది. ఈ స్థలంలో మొక్కలు నాటారు. తీరా అధికార పార్టీ నాయకులు మొక్కలను తొలగించి ఈ భూమిని చదనుచేశారు. దీనిపై బీజేపీ నాయకులు అందోళనలు, ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. కీసరలో 185 సర్వే నెంబర్‌ ప్రభుత్వ, సీలింగ్‌ భూమిని ప్రైవేట్‌ పట్టా సృష్టించారు. ఇప్పుడీ భూమిలో వెంచర్‌ వేస్తున్నారు. 


  • అక్రమ నిర్మాణాలపై నిఘా ఏదీ?

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలసౌ అధికారుల నిఘా లేదు. ఒక వేళ వారి దృష్టికి వచ్చినా ఏదో ఓ కారణంతో వాటిని అడ్డుకోవడం లేదు. శామీర్‌పేట మండలం అవుటర్‌ రింగ్‌ రోడ్డు పక్కన ఉన్న కాల్వను పూడ్చి ఈ స్థలాన్ని గజానికి రూ.35వేలకు అమ్మేస్తున్నారు. మరో పక్క చెరువుల ఎఫ్టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఇల్లు, విల్లాలు వెలుస్తున్నాయి.


  • అసైన్డ్‌ భూములకు రెక్కలు..

మేడ్చల్‌ జిల్లాలో ఐదు మండలాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది పేదలకు ప్రభుత్వం గతంలో భూములు పంచింది. ఇప్పుడు భూములకు ధర భారీగా పెరుగడంతో రియల్టర్లు అసైన్డ్‌ రైతులకు ఆశలు చూపి భూములను కొల్లగొట్టారు. వాటిల్లో వెంచర్లు చేసి అమ్మేస్తున్నారు. అసైన్డ్‌ భూములు అమ్మే వీలు లేదు. అసైనీ తదనంతరం వారి వారసులు అనుభవించాలి లేదా ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి. వాటిని కమర్షియల్‌కు వాడుకోకూడదు. కానీ టీఆర్‌ఎస్‌ నాయకుల సహకారం, అధికారుల అప్రూవల్‌తో అసైౖన్డ్‌ భూముల్లో రాత్రికిరాత్రే నిర్మాణాలు చేపడుతున్నారు. ఎక్కువగా ఘట్‌కేసర్‌, పోచారం, మేడ్చల్‌, గుండ్ల పోచమ్మ శామీర్‌పేట, తూంకుంట, దమ్మాయిగూడ, నాగారం మునిసిపాలిటీల పరిధిల్లో అక్రమ లేవుట్లు, నిర్మాణాలు వెలుస్తున్నాయి.


  • అసైన్డ్‌ భూముల్లో నిర్మాణాలు చేపట్టొద్దు : ఏనుగు నర్సింహారెడ్డి, అదనపు కలెక్టర్‌

భూమి లేని పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. వారు సాగుచేసుకోవడమే గానీ భూమిని అమ్ముకునే హక్కు రాదు. దమ్మాయిగూడ, ఇతర మున్సిపాలిటీల్లో అసైన్డ్‌ భూములు, ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న నిర్మాణాలపై విచారణ చేపట్టి వెంటనే చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-01-28T05:04:35+05:30 IST