ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-04-07T06:57:06+05:30 IST

కరోనా ఉధృతి నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెలాఖరు వరకు కొనసాగనుంది.

ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ

  • నెలాఖరు వరకు అమలు.. ఉధృతితో నిర్ణయం
  • దేశంలో కొత్తగా 97 వేల కేసులు; 446 మరణాలు
  • పుణె ఆస్పత్రుల్లో నిండిపోయిన పడకలు
  • వెయిటింగ్‌ ఏరియాలో రోగులకు ఆక్సిజన్‌ ఏర్పాటు
  • సూరత్‌లో చెత్త వాహనంలో వెంటిలేటర్ల తరలింపు
  • ఒకేరోజు రికార్డు స్థాయిలో 43 లక్షల మందికి టీకా
  • కర్ఫ్యూ లేదా నాలుగు రోజులు లాక్‌డౌన్‌ విధించండి
  • గుజరాత్‌ ప్రభుత్వానికి హైకోర్టు సీజే సూచన
  • దేశంలో కొత్తగా 97 వేల కరోనా కేసులు; 446 మరణాలు

న్యూఢిల్లీ, ముంబై, ఏప్రిల్‌ 6: కరోనా ఉధృతి నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెలాఖరు వరకు కొనసాగనుంది. సోమవారం ఢిల్లీలో 3,500 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 15 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 5 వరకు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. కాగా, గుజరాత్‌లో పరిస్థితి చేయిదాటుతోందని.. మూడు, నాలుగు రోజులు రాష్ట్రమంతటా రాత్రి కర్ఫ్యూ లేదా లాక్‌డౌన్‌ ప్రకటించాలని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ప్రభుత్వానికి సూచించారు.


మరోవైపు జోధ్‌పూర్‌లో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 వరకు రాజస్థాన్‌ ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటించింది. కాగా దేశంలో సోమవారం 96,982 మందికి వైరస్‌ నిర్ధారణ అయిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 446 మంది చనిపోయినట్లు పేర్కొంది. తాజా గణాంకాలతో మొత్తం కేసులు 1,26,86,049కి, మరణాలు 1,65,547కు పెరిగాయి. కొత్త కేసుల్లో 47,300 మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో 155 మంది మృతి చెందారు.


పంజాబ్‌లో 72 మంది చనిపోయారు. దేశంలో యాక్టివ్‌ కేసులు 7.88 లక్షలకు చేరాయి. బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌కు పాజిటివ్‌ వచ్చింది. స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ క్రమా, ఆయన తల్లిదండ్రులకూ వైరస్‌ నిర్ధారణ అయింది.


కాగా ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనివిధంగా దేశంలో సోమవారం ఒక్కరోజే 43 లక్షల మందికి టీకా వేసినట్లు కేంద్రం తెలిపింది. దీంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 8.31 కోట్లకు చేరిందని వివరించింది. 45 ఏళ్లు దాటిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పనిసరిగా టీకా తీసుకోవాలని కోరింది. వైరస్‌ ఉధృతి నేపథ్యంలో 18 ఏళ్లు దాటినవారందరికీ టీకా ఇవ్వాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌  ప్రధాని మోదీకి లేఖ రాసింది. టీకా పంపిణీ వ్యూహాన్ని మార్చాలని.. ఇది యుద్ధ ప్రాతిపదికన జరగాలని కోరింది.




వివాహాలు, రైతుల ఆందోళనల వల్లే.. 

కేసుల పెరుగుదలపై హర్షవర్ధన్‌

వివాహాలు ఆడంబరంగా జరుపుకోవడం, రైతుల ఆందోళనలు, స్థానిక ఎన్నికలతో కరోనా కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ అన్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న 11 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 


Updated Date - 2021-04-07T06:57:06+05:30 IST