సిద్దిపేట జిల్లాలో రాత్రి కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-04-21T05:06:20+05:30 IST

కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జిల్లాలో మంగళవారం నుంచి 30 వరకు నైట్‌ కర్ఫ్యూ విధించనున్నట్లు కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి మంగళవారం తెలిపారు.

సిద్దిపేట జిల్లాలో రాత్రి కర్ఫ్యూ

 అమలుకు ప్రత్యేక బృందాలు

 రాత్రి 8 గంటల లోపే బార్లు, థియేటర్లు మూసివేయాలి

 సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి


సిద్దిపేట అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 20: కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జిల్లాలో  మంగళవారం నుంచి 30 వరకు నైట్‌ కర్ఫ్యూ విధించనున్నట్లు కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి మంగళవారం తెలిపారు. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా ప్రజా ప్రయోజనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని వెల్లడించారు. రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, థియేటర్లు, దుకాణాలు, మద్యం దుకాణాలు, హోటల్స్‌, బార్‌లు, రెస్టారెంట్‌లు మూసివేయాలని సూచించారు. జిల్లాలో నైట్‌ కర్ఫ్యూ పక్కా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, రెవెన్యూ, పోలీస్‌ అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించామని కలెక్టర్‌ తెలిపారు. కర్ఫ్యూ సమయంలో ప్రజలు బయట తిరగడం నిషేధమని, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కూడా రాత్రి వేళల్లో బయట తిరుగొద్దని చెప్పారు. అత్యవసర సేవల్లో ఉన్న అధికారులు ప్రత్యేక పాస్‌లు తీసుకోవాలని ఆయన సూచించారు. నిబంధనలు పాటించని దుకాణాలు, బార్‌లు, రెస్టారెంట్‌లను వారం రోజుల పాటు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. కర్ఫ్యూ నుంచి ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా, అత్యవసర సేవలు, పెట్రోల్‌ బంకులు, మెడికల్‌ షాపులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, ఆస్పత్రులు, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు, ఈ-కామర్స్‌ సేవలు, ఆహార పదార్థాల పంపిణీ, కోల్డ్‌ స్టోరేజ్‌లు, గోడౌన్లకు మినహాయింపు ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. విమాన, రైలు, బస్సు ప్రయాణికులకు వ్యాలిడ్‌ టికెట్లు ఉంటే కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులకు ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర రవాణాకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. 


నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: సీపీ


సిద్దిపేట క్రైం, ఏప్రిల్‌ 20: ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాత్రి పూట కర్ఫ్యూ మంగళవారం నుంచి అమలు చేస్తున్నట్లు సీపీ జోయల్‌ డేవిస్‌  తెలిపారు. కర్ఫ్యూ అమలు పరచడానికి జిల్లాలో 32 టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సిద్దిపేట, గజ్వేల్‌,  హుస్నాబాద్‌, చేర్యాల, దుబ్బాక, పట్టణాల్లో ప్రత్యేకంగా అన్ని చౌరస్తాలో పికెట్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కర్ఫ్యూ సమయంలో మినహాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్‌ సిబ్బంది, మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా ఐడీ కార్డులను చూపాలని ఆయన కోరారు. 


 


Updated Date - 2021-04-21T05:06:20+05:30 IST