నైట్‌ కర్ఫ్యూ వేస్ట్‌.. ఇలా చేయడమే బెస్ట్!

ABN , First Publish Date - 2021-04-27T06:29:32+05:30 IST

కరోనా కట్టడికి..

నైట్‌ కర్ఫ్యూ వేస్ట్‌.. ఇలా చేయడమే బెస్ట్!

నైట్‌ కర్ఫ్యూతో ప్రయోజనమేంటి?

బార్ల కోసమే 10 గంటల తర్వాత అమలు

పోలీసు సిబ్బందికి అనవసరపు శ్రమ

ప్రజలు బయటకొచ్చే సమయాల్లో చర్యలేంటి?

దూర ప్రాంత ప్రయాణికులకు ఎలాగూ అనుమతులు! 

ఉదయం, సాయంత్రం కొన్ని గంటల పాటు అమలుకు డిమాండ్‌


ఆంధ్రజ్యోతి, విజయవాడ: కరోనా కట్టడికి నైట్‌ కర్ఫ్యూ విధించటం వల్ల ఉపయోగమేమిటని పలువురి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జన సమూహాలకు, సంచారానికి అవకాశమే లేని రాత్రిళ్లు నైట్‌ కర్ఫ్యూ అమలు చేయటంపై సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. కొవిడ్‌ ఆంక్షలు విధించామని చెప్పుకోవటానికే తప్ప ఒనగూరే ప్రయోజనాలు చాలా తక్కువగా ఉన్నాయని వారు పెదవి విరుస్తున్నారు. దానికి బదులు ఉదయం, సాయంత్రాల్లో కొంత సమయం కర్ఫ్యూ విధించటం వల్ల కొంత వరకు కరోనాను అరికట్టవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.


రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా నైట్‌ కర్ఫ్యూను రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుఝామున 5గంటల వరకు విధిస్తున్నారు. ఈ సమయంలో ప్రధాన రోడ్లు, జాతీయ రహదారులు, నగర, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లను బారికేడ్లతో మూసివేస్తున్నారు. ప్రధానంగా వాహనచోదకులపై దృష్టిసారించి నిలువరిస్తున్నారు. సాధారణంగా రాత్రిళ్లు జనసంచారం తక్కువగా ఉంటుంది. వాహనదారులు సంఖ్య తక్కువే. ఈ సమయంలో నైట్‌ కర్ఫ్యూతో ఉపయోగమేమిటన్నది ఎవరికీ అర్థం కావటం లేదు. రాత్రి 10గంటల తర్వాత దాదాపుగా దుకాణాలన్నీ మూతపడతాయి. జన సంచారం ఉండదు. నగరాల్లో అయితే రాత్రి 10గంటల వరకు దుకాణాలుంటాయి. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే రాత్రి 8 - 9 గంటలకల్లా అన్నీ బంద్‌ అయిపోతాయి. రెండు రోజులుగా నగరంలో అమలవుతున్న పరిస్థితి చూస్తే.. పర్యవేక్షణ చేసే పోలీసులకు అనవసరపు శ్రమ తప్పితే పనికొచ్చే వాతావరణం కనిపించటం లేదు. 


బార్ల కోసమేనా 10 గంటల వరకు సమయం

నైట్‌ కర్ఫ్యూ తీరు చాలా విచిత్రంగా ఉంది. కరోనా కట్టడికి నైట్‌ కర్ఫ్యూ పెట్టినట్లు చెబుతున్న ప్రభుత్వం అంతకు ముందు బార్లు యథేచ్ఛగా తెరిచినా తప్పులేనట్టు ఉంది. బార్లు ఎక్కువగా కళకళలాడేది సాయంత్రాల నుంచి రాత్రి సమయాల్లోనే! ఎలాగూ 10 గంటలకల్లా బార్లు మూసివేస్తారు. ఈలోపు ఎంత రష్‌ ఉన్నా.. సమూహాలున్నా... ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టుగా ఉంది. బార్ల వ్యాపారానికి ఇబ్బందులు లేకుండా చేసేందుకే రాత్రి 10 గంటల తర్వాత నైట్‌ కర్ఫ్యూ విధించారన్న విమర్శలున్నాయి. 


ప్రజలు బయటికొచ్చే సమయాల్లో నియత్రణేదీ?

ప్రజలు తమ అవసరాల కోసమో, వ్యక్తిగత పనుల కోసమో వేరే ఇతర కారణాలతో బయటకొచ్చే సందర్భాలు ఉదయం, సాయంత్రం, రాత్రి. అర్ధరాత్రి సమయాల్లో చాలా తక్కువ. ఉదయం 5 నుంచి 8 గంటల వరకు కూరగాయల కోసమో, వ్యాహ్యాళి కోసమో బయటికొస్తారు. అలాగే సాయంత్రం 5 నుంచి మహా అయితే రాత్రి 10 గంటల వరకు షాపింగ్‌, రెస్టారెంట్స్‌కు వస్తుంటారు. నగరాల్లో అయితే మాల్స్‌, మల్టీప్లెక్స్‌లకు వస్తారు. ప్రజలు సమూహంగా ఏర్పడే సమయాలను వదిలేసి ఎవరూ బయటికి రాని సమయంలో నైట్‌కర్ఫ్యూతో ఏం ప్రయోజనమో ఆలోచించాలి.


రాత్రి 10 గంటల తర్వాత కొనసాగేవి ఏవి?

నైట్‌ లైఫ్‌కు నగర ప్రజలు కొంత అలవాటు పడినా వీటిపై ఇప్పటికే ఆంక్షలున్నాయి. ముఖ్యంగా ఫుడ్‌కోర్టులు, సినిమాహాల్స్‌ వల్ల కొంత జనసమూహం ఉంటుంది. నైట్‌ ఫుడ్‌కోర్టులపై ఇప్పటికే నిషేదం ఉంది. ఇక సినిమాహాల్స్‌.. ఫస్ట్‌ షో 9 గంటలకల్లా అయిపోతుంది. సెకండ్‌ షోకు ఎవరైనా రాత్రిళ్లు బయటకు రావాల్సి వస్తే షో అయిపోయాక ఉంటుంది. ప్రస్తుతం కొత్త చిత్రాలేవీ విడుదల కాకపోవటంతో అత్యధిక శాతం హాళ్లు మూతబడ్డాయి. 


ప్రయాణికులకు అనుమతి

రాత్రి సమయాల్లో కర్ఫ్యూ ఉన్నా ఇంటర్‌స్టేట్‌ బస్సు ప్రయాణికులను అడ్డుకోవద్దని కేంద్రం చెప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైకి వెళ్లేవారిని నియంత్రించటానికి వీల్లేదు. ఇదే నిబంధన రైలు ప్రయాణికులకు కూడా వర్తిస్తుంది. అంటే వీరికి నైట్‌ కర్ఫ్యూ వర్తించదు.


ఆ సమయాలే ఆక్షేపణీయం

నైట్‌ కర్ఫ్యూ సమయాలు ఆక్షేపణీయంగా ఉన్నాయి. రాత్రి 10 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా రోడ్లపై ట్రాఫిక్‌ తగ్గిపోతుంది. సాయంత్రం 6 నుంచి 9గంటల వరకు జనాల రాకపోకలు, జనసమూహాలకు అవకాశం. ఈపరిస్థితులను నివారించటానికి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ విధించినా కొంత బెటర్‌ అన్న అభిప్రాయం వినవస్తోంది. 


ఉదయం, సాయంత్రం కర్ఫ్యూతో ప్రయోజనం: టీ మురళీకృష్ణ 

ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో నైట్‌ కర్ఫ్యూ అనేది అంతగా ఉపయోగం లేదు. ప్రజలు ఎక్కువగా ఉదయం, సాయంత్రం బయటకు వస్తుంటారు. ఈ సమయంలోనే జన సమూహాలను నియంత్రించాలి. ఉదయం, సాయంత్రం కనీసం 3గంటల పాటు కర్ఫ్యూ అమలు చేస్తే మంచింది.


నైట్‌ కర్ఫ్యూ వేస్ట్‌.. సాయంత్రం బెస్ట్‌: ఎం. పవన్‌ కుమార్‌ 

రాత్రిపూట కర్ఫ్యూ అనవసరం. ఆ సమయంలో బయటకు ఎవరూ పెద్దగా తిరగరు. చాలామంది ఇంట్లో ఉంటారు. ఈవెనింగ్‌ కర్ఫ్యూ అయితే కొంత బెస్ట్‌. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఈవెనింగ్‌ కర్ఫ్యూ అమలు చేయాలి. 


మధ్యాహ్నం 2 గంటల వరకే..

వన్‌టౌన్‌: కరోనా ఉధృతి కారణంలో విజయవాడ నగరంలో ఈ నెల 28 నుంచి వ్యాపార సంస్థలన్నీ మధ్యాహ్నం 2 గంటల వరకే నిర్వహిం చాలని విజయవాడ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు తెలిపారు. సోమ వారం గాంధీనగర్‌లోని విజయవాడ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్‌ విస్తృత వ్యాప్తి నేపథ్యంలో వ్యాపార సంస్థలు (షాపులు) పూర్తిగా తెరచి ఉంచటం శ్రేయస్కరం కాదన్నారు. ప్రజలు, వ్యాపారులు, వివిధ సంఘాలు, ముఠా కార్మికుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వ్యాపారులు ఖచ్చితంగా 2 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు నిర్వహించుకోవాలని కోరారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రి ప్రధాన కార్యదర్శి పి.ఎస్‌.ఎల్‌.ఎన్‌.వరప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-27T06:29:32+05:30 IST