Abn logo
Sep 19 2021 @ 01:27AM

చరిత్రకు పుట్టినిల్లు నీలగిరి

హాలియా మండలం పేరూరులోని శిల్పాలను పరిశీలిస్తున్న శివనాగిరెడ్డి

నల్లగొండ జిల్లాలో రాతి యుగపు ఆనవాళ్లు 

పావురాల గుట్టలో ఆదిమానవుని గుర్తులు

కృష్ణానదీ తీరాన కొత్త రాతియుగపు అవశేషాలు

మోత్కూరులో కాకతీయుల కాలంనాటి నిర్మాణం 


నల్లగొండ,హాలియా,మోత్కూరు, సెప్టెంబరు 18: చరిత్రకు పుట్టినిల్లుగా ఉమ్మడి నల్లగొండజిల్లాకు ఎన్నో ఆధారాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నా యి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బౌద్ధక్షేత్రం నాగార్జునసాగర్‌ పరిసరాల్లో ఆదిమానవుడి అడుగుజాడలను పురావస్తు శాస్త్రవేత్తలు ఈనెల16న గుర్తించారు. అదేవిధంగా హాలియా మండలం పేరూరులో క్రీ.శ. 1100 నుంచి 1290 సంవత్సరాల మధ్యకాలానికి చెందిన కళ్యాణ చాళుక్య, కుందూరి చోళ, యా దవ, కాకతీయ శాసనాలు బయల్పడ్డాయి. యాదాద్రి భువనగిరి జిల్లా మో త్కూరులో  కాకతీయుల కాలం నాటి రాతి నిర్మాణాలు బయటపడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు మోత్కూరు పట్టణంలోని  బిక్కేరు వాగు పొంగిపొర్లడంతో పక్కనే ఓ రాయిపై పార్వతీ పరమేశ్వరుల పాదాలు, లింగాకారాలు, సూర్యచంద్రుల రూపాలతో చెక్కడాలు ఉన్నాయి.


అపురూప శిల్పాలకు ఆదరణ కరువు : శివనాగిరెడ్డి

అపరూప శిల్పాలకు ఆదరణ కరువైందని చరిత్ర పరిశోధకుడు డాక్టర్‌ శివనాగిరెడ్డి అన్నారు. హాలియా మండలం పేరూరులోని ఆలయాల వద్ద పడి ఉన్న శిల్పాలు, శాసనాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. పేరూరులో స్వయం భూసోమేశ్వరాలయం వింధ్య వాసిని, కేశవస్వామి దేవాలయం వద్ద 17 శాసనాల్లో 30 శిల్పాలు పేరూరు చరిత్రకు అద్దం పడుతున్నాయని, వాటిని కాపాడుకొని భావితరాలకు అందించాలన్నారు. అదేవిధంగా నాగార్జునసాగర్‌ ఎగువన నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పుట్టంగండి గ్రామ పంచాయతీ పరిధిలోని పావురాలగుట్ట గ్రామ సమీపంలో ఒక కిలోమీటరు దూరంలో కృష్ణానది ఒడ్డున ఉన్న ఒక పెద్ద పలుగుగుట్టపై రెండు బండలపైన మూడు చోట్ల ఐదు సెంటీమీటర్ల వ్యాసం, ఒక సెంటీమీటరు లోతుతో బడిసె రాళ్లను గుర్తించామని తెలిపారు. పావురాలగుట్ట కొత్త రాతియుగపు తయారీ కేంద్రమని పావురాల గుట్టలోని పెద్దపలుగు రాతిగుట్ట వద్ద గుర్తించిన గుంతలు దీనిని రుజువు చేస్తున్నాయని తెలిపారు. కృష్ణానదిప్రాంతంలో పశుపాలనతోపాటు వ్యవసాయం చేసిన కొత్త రాతియుగపు మానవులు పదునైన మొనతో ఉన్న నల్లశాసనపు రాతిగొడ్డళ్లు తయారు చేసుకునే వారని తెలిపారు.