Abn logo
Sep 17 2021 @ 00:26AM

నిలువెత్తు నిరసన

అత్తలూరి గురించి రాద్దామని మొదలు పెట్టేసరికి చెయ్యి వణికింది. కళ్లు కన్నీళ్లతో మసకలు కమ్మాయి. ఈ వాక్యం బాగుందో లేదో చెప్పడానికి అత్తలూరి లేడు. చివరికి పరుచూరి శ్రీనివాస్ నేను మాటలు చెప్తూ ఉంటే టైప్ చేశాడు.


అత్తలూరికి వాక్యనిర్మాణం మీద శ్రద్ధ ఎలా అబ్బిందో నాకు ఆశ్చర్యం. అతను బాలవ్యాకరణాన్ని మెచ్చుకునేవాడు. చిన్నయసూరి తెలుగువాక్యం స్పష్టంగా బలంగా అందంగా రాయడం అత్తలూరికి గొప్పగా నచ్చింది. ఆ రోజుల్లో బాలవ్యాకరణం బాగుందనుకునే ఆధునికులు ఎవరూ లేరు. తనకి చాలా ఇష్టులైన వాళ్లు రాసిన వాక్యాలు కూడా - ఉదాహరణకి నా వాక్యాలు కూడా బాగులేకపోతే బాగులేవని నిక్కచ్చిగా చెప్పేవాడు అత్తలూరి. విప్లవాన్ని గురించి తప్ప కవులెవ్వరూ కవిత్వం రాయకూడదని విరసం నిర్బంధించే రోజుల్లో విరసం నుంచి బయటికొచ్చేసి ‘నిరసన కవులు’ అనే చిన్న పుస్తకాన్ని ప్రచురించాడు అత్తలూరి. ఈ నిరసన కవుల్లో అత్తలూరి తప్ప ఎవరూ నిరసన కవులుగా మిగల్లేదు. ఒక్క కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ మాత్రం ‘వెలుతురు పిట్టలు’ అన్న పుస్తకం ప్రచురించిన తరవాత కేవలం తన ఉద్యోగంలో ఇంజనీరుగా నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. మిగతావాళ్లు రకరకాలుగా నిరసనని వదిలేశారు. ఆ నిరసన కవులు నలుగురు. పుస్తకంలో పేరు చెప్పకుండా నలుగురి గొంతుకలు కలిసిపోయి ఉంటాయని మనం అనుకోవాలి. కాని ఈవాళ కూడా ఆ పుస్తకం చదివితే అత్తలూరి గొంతుక మనం తేలిగ్గా గుర్తు పట్టగలం. ‘నేను’ అన్నది పద్యం పేరు. ఆ పద్యమంతా నేనిక్కడ ఇస్తున్నాను.


‘చిన్నప్పుడు/ మా నాన్న కూతుర్నండి/ మా తమ్ముడి అక్కయ్యనండి/ పెద్దయ్యాక, పెద్దదాన్నయ్యాక/ మా మావగారి కోడల్నండి/ వారి కొడుగ్గారి భార్యనండి/ మా అబ్బాయికి అమ్మనండి/ ముసిల్దాన్నయ్యాక, ముట్లుడిగాక/ వాడి కూతురికి నాయనమ్మనండి/ నేను నేను కానండి/ ఈ దేశంలో/ నేనో ఆడ వస్తువునండి/ ఎన్నికల ప్రణాలికల్లో/ ఐదు సంవత్సరాల కొకసారి/ ఫాషనబుల్ నినాదాన్నండి.’


చాలా చిన్న మాటలతో సమాజంలో ఆడదానికి తానుగా అస్తిత్వం లేదు అని నెమ్మదిగా చెప్తుందీ పద్యం. అది అత్తలూరి గొంతుక. ఎప్పుడూ ఎవరికో ఒకరికి ఏదో ఒకటి అవడమే. తల్లో, కూతురో, కోడలో, అమ్మో, అమ్మమ్మో. ఇది అంతా అయిన తరవాత అయిదేళ్లకొకసారి ఎన్నికలొచ్చినప్పుడు ఆడది ఒక నినాదం. ఈ గొంతుకతో అత్తలూరే రాయగలడు. 


ఈ పుస్తకం నిండా రకరకాల పెద్ద మాటలతో రాసిన కవిత్వం చాలా ఉంది. దాంతో పాటు కొన్ని హాస్యంలాంటి మాటలు కూడా ఉన్నాయి. అవి అత్తలూరి మాటలని నేననుకోను. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే అత్తలూరి తన నిరసనని నిశ్శబ్దంగా నిరాఘాటంగా కొనసాగించాడు. ఎక్కడా రాజీ పడలేదు.


పేరొచ్చిన వాళ్లు కూడా ప్రచారం కోసం జారిపోవడం చూసి అత్తలూరి చిరాకు పడేవాడు. కాళీపట్నం రామారావుగారు ‘యజ్ఞం’ తరవాత కేవలం తన అభిమానుల్ని పోగు చేసుకోవడంలోనే పట్టుదల చూపించాడని అత్తలూరి గుర్తించాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవగీతాలు రాసి పేరు తెచ్చుకున్న వంగపండు ప్రసాద్ మరణించినప్పుడు ప్రభుత్వం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపడం ఎలా జరిగిందో అత్తలూరికి తెలుసు. కీర్తికీ, డబ్బుకీ ఎవరూ అతీతులు కారు, ప్రభుత్వాలు ప్రతి కవిని కొనుక్కుంటాయి, చివరికి ఎవరూ స్వతంత్రంగా మిగలరు. తనకి పేరక్కరలేదని పేరున్నవాడు కూడా అనుకుంటే తప్ప ఎవరూ స్వతంత్రంగా ఉండరు.


తుపాకి గుండు తగిలి చచ్చిపోయిన ఒక బాలుడితో మొదలుపెట్టి యధాలాపంగా అడుగుతున్న ప్రశ్నలతో నిండిపోయిన ‘ఎక్కడెక్కడ తగిలింది తుపాకి గుండు’ అన్న ఒక పద్యాన్ని (ర: సోమ దత్త) మరీమరీ మెచ్చుకుంటూ చదివేవాడు. అతని గొంతుక సరిగా రాని చివరి రోజుల్లో కూడా ఆ పద్యాన్ని చదివి నాకు వినిపించమని చెప్పాడట. దురదృష్టవశాత్తు నా పల్లెటూళ్లో ఇంటర్నెట్ పనిచేయక నేను వెంటనే వినలేకపోయాను. కానీ ఆ తరవాత విన్నాను. బలహీనమైన గొంతుకతో కూడా బలంగా వినిపించాడు అత్తలూరి. శరీరం క్యాన్సర్‌తో నిండిపోయినప్పుడు వైద్యులు ఇది ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం, ఆ తరవాత నివారణోపాయం ఎలా ఉండాలో నిర్ణయించవచ్చు అని చెప్పినప్పుడు నాకివేవి అక్కర్లేదు, నేను సిగరెట్లు కాల్చాను, అది నేను చేసిన తప్పు. ఈ క్యాన్సర్ని నేను అనుభవిస్తాను, నేను నిశ్శబ్దంగా వెళ్లిపోతాను అని చెప్పగలిగిన ధీశాలి అత్తలూరి.


ఆఫ్రికాలో అక్షరాలు రాని వాడు అక్షరాలు నేర్చుకుని వెంటనే రాసిన ఆత్మకథ లాంటి కథ చదివి ఉబ్బితబ్బిబ్బయిపోయి నాకు పంపించాడు అత్తలూరి. సన్మానాలు, సత్కారాలు వీటికి లొంగిపోయిన కవులని చూచి నవ్వి ఊరుకునేవాడు అత్తలూరి. తెలుగు సాహిత్యంలో ఇంత నిక్కచ్చిగా మంచిచెడ్డల్ని వివరించి ఎంత పెద్దవాళ్లయినా వాళ్లని పక్కన పెట్టి ఎంత చిన్నవాళ్లయినా వాళ్లని గురించి నిజాయితీగా, ధైర్యంగా మాట్లాడేవాడు అత్తలూరి. తెలుగు సాహిత్యంలో అలాంటివాడు ఇంకొకడు లేడు. ఉంటాడని నమ్మకం కూడా లేదు. మాట పోతుంటే ప్రశాంతంగా వెళ్లిపోయిన మహామానవుడు అత్తలూరి.

వెల్చేరు నారాయణరావు

ప్రత్యేకంమరిన్ని...