Abn logo
Sep 24 2021 @ 14:13PM

గుజరాత్ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్ కాబోతున్న నిమాబెన్

అహ్మదాబాద్ : గుజరాత్ శాసన సభ తొలి మహిళా స్పీకర్‌గా నిమాబెన్ ఆచార్య ఎన్నిక కాబోతున్నారు. బీజేపీ అభ్యర్థిని అయిన నిమాబెన్‌కు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మద్దతివ్వడంతో ఆమె ఎన్నిక ఇక లాంఛనమేనని తెలుస్తోంది. ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే శాసన సభ సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 


రాజేంద్ర త్రివేది సెప్టెంబరు 16న అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో స్పీకర్ పదవికి ఎన్నిక అవసరమైంది. స్పీకర్‌ పదవికి అభ్యర్థిగా నిమాబెన్‌ ఆచార్యను బీజేపీ ఎంపిక చేసింది. ఆమె అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు నామినేషన్లను అసెంబ్లీ సెక్రటేరియట్ ఆహ్వానించింది. నిమాబెన్ ఆచార్య నామినేషన్ పత్రాలను త్రివేది, బీజేపీ చీఫ్ విప్ పంకజ్ దేశాయ్ కలిసి సమర్పించారు. డిప్యూటీ స్పీకర్ పదవికి జెఠా భర్వాడ్ తరపున నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ సెక్రటేరియట్ ఆమోదించింది. 


త్రివేది మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత పరేష్ ధనానీ కూడా నిమాబెన్ నామినేషన్‌ను సమర్థించారని తెలిపారు. అయితే డిప్యూటీ స్పీకర్ పదవికి మాత్రం కాంగ్రెస్ తమ అభ్యర్థిని నిలుపుతోందని ధనానీ విలేకర్లకు చెప్పారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వడం సంప్రదాయమని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఈ సంప్రదాయాన్ని పాటించిందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ సంప్రదాయాన్ని పాటించడం లేదన్నారు. సీనియర్ ఎమ్మెల్యే అనిల్ జోషియారాను డిప్యూటీ స్పీకర్ పదవికి అభ్యర్థిగా నిలుపుతామని చెప్పారు.


ఇవి కూడా చదవండిImage Caption