Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిమ్మరైతు కంట చెమ్మ

ధరలేక మగ్గుతున్న వైనం


పొదలకూరురూరల్‌, డిసెంబరు 7 : వరుస తుఫాన్లతో నిమ్మ రైతుల కష్టం నేల పాలవుతుంది. ధరలు లేక కాయలు చెట్లకే మగ్గుతున్నాయి. పొదలకూరు వ్యవసాయ సబ్‌ డివిజన్‌ ప్రాంతాల్లో 24వేల ఎకరాల్లో నిమ్మతోటలు సాగవుతున్నాయి. గత వారం లూజు బస్తా ధర రూ.1500 పలికిన నేపథ్యంలో మంగళవారం రూ.450కి దిగజారింది. నిమ్మ రైతులకు ఏడాదంతా ఒక ఎత్తయితే మార్చి, ఏప్రిల్‌, మే మాసాలు ఒక ఎత్తు. ఈ మూడు నెలల్లోనే ఆశించిన ధర పలుకుతుంది. ఈ క్రమంలో నవంబరు, డిసెంబరులో చెట్లు పూతకు రావాలి. కానీ ఈ ఏడాది కురుస్తున్న ఎడతెరపిలేని వర్షాల కారణంగా తోటల్లో నీరుచేరి చెట్లు పూతకు రావడం లేదు. పాదులు ఆరాలంటే మరో నెల రోజులు పడుతుంది. ఈ ఏడాది కూడా రైతులకు నష్టాలే మిగిలేట్టున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కరోనా కారణంగా గడిచిన రెండేళ్ల నుంచి మార్కెట్‌, రవాణా సౌకర్యం లేక రైతులు పండించిన దిగుబడిని అమ్ముకోలేకపోతున్నారు. నిమ్మకాయలకు మంచి ధరలు పలకాలంటే ఉత్తరాది రాష్ట్రాల్లో వేడి వాతావరణం ఉండాలి. ప్రస్తుతం ఉన్న కాయలను అమ్ముకోవాలంటే కోత, రవాణా ఖర్చులకు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో కాయలు చెట్లపైనే మగ్గిపోతున్నాయి. గడచిన నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెట్లు తెగుళ్ల బారినపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాగా కష్టమైనా, నష్టమైనా సస్యరక్షణ చర్యలు పాటించి, తోటలను కాపాడుకోవాలని వారు సూచిస్తున్నారు.  

Advertisement
Advertisement