ఫేస్ మాస్క్ విషయంలో... 90 శాతం మంది విఫలం

ABN , First Publish Date - 2020-08-09T22:11:36+05:30 IST

కరోనా వ్యాప్తి నిరోధానికి నిర్దుష్టమైన జాగ్రత్తలతో మాస్కులను ధరించాలని ఎవరెంతగా మొత్తుకుంటున్నా... శాస్త్రీయ పద్ధతిలో మాస్క్‌లు వాడుతున్న వారు మాత్రం పది శాతం లోపేనని వైద్య, ఆరోగ్యశాఖ పరిశీలనలో తేలింది. ప్రజలు మాస్కులు ధరిస్తున్న తీరుపై వైద్య, ఆరోగ్యశాఖ ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కిందటి నెలలో ఇరవై రోజులపాటు 20 వేల మందిని పరిశీలించింది. ఇందులో 90 % మంది నిబంధనలు పాటించడంలేదని తేలింది.

ఫేస్ మాస్క్ విషయంలో... 90 శాతం మంది విఫలం

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నిరోధానికి నిర్దుష్టమైన జాగ్రత్తలతో మాస్కులను ధరించాలని ఎవరెంతగా మొత్తుకుంటున్నా... శాస్త్రీయ పద్ధతిలో మాస్క్‌లు వాడుతున్న వారు మాత్రం పది శాతం లోపేనని వైద్య, ఆరోగ్యశాఖ పరిశీలనలో తేలింది. ప్రజలు మాస్కులు ధరిస్తున్న తీరుపై వైద్య, ఆరోగ్యశాఖ ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కిందటి నెలలో ఇరవై రోజులపాటు 20 వేల మందిని పరిశీలించింది. ఇందులో 90 % మంది నిబంధనలు పాటించడంలేదని తేలింది.


చాలామంది... ముక్కును వదిలేస్తూ, నోరు కవరయ్యేలా మాస్కు ధరిస్తున్నారు. ఇంకొందరు పేరుకు మాస్క్‌ ధరించినా... గెడ్డం కిందకు లాగేస్తున్నారు. ఇరవై వేల మందిలో 90 శాతం మంది ఇదే తరహాలో మాస్కులు పెట్టుకుంటున్నారు. ఇందులో 65 % మంది మాస్కు ముందు భాగాన్ని తరచూ తాకుతున్నారు. వైరస్‌ సోకిన వ్యక్తులతో మనం మాట్లాడితే ఆ వైరస్‌...  మనం ధరించే మాస్క్‌ ముందుభాగానికి చేరుతుంది. ఈ క్రమంలో మాస్క్ ముందుభాగాన్ని తాకినా, తిరిగి అదే చేతితో ముక్కు, నోటి భాగాన్ని తాకినా ఆ వైరస్‌ మనలోకి చేరుతుంది.


ప్రస్తుతం నమోదవుతోన్న పాజిటివ్‌ కేసుల్లో జాగ్రత్తలు పాటించని వాళ్లే 85 శాతం వరకూ ఉన్నట్లు వైద్యశాఖ పరిశీలన చెబుతోంది. ఇక... బాధితుల్లో ఎక్కువమంది... రద్దీ ప్రాంతాల్లో తిరిగి వైరస్‌ బారిన పడినవారేనని ఈ విశ్లేషణలో తేలింది. కరోనా వైరస్ నుంచి రక్షించే ప్రధాన ఆయుధం ఫేస్‌ మాస్కు. దీనిని శాస్త్రీయ పద్ధతిలో ధరించి, జాగ్రత్తలు పాటిస్తే దాదాపు సురక్షితంగా ఉన్నట్లే. బయటకు వెళ్లేటపుడు, ఇతరులతో మాట్లాడే సందర్భాల్లో... ట్రిపుల్‌ లేయర్‌ మాస్కుతను.. ముక్కు, నోరు పూర్తిగా కవరయ్యేలా ధరించలన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


ఒకసారి మాస్కు పెట్టుకున్నాక ముందువైపు తాకవద్దు. మాస్కును... చెవివైపు నాడెలను పట్టుకుని తొలగించి నేరుగా వేడినీటిలో వేసి ఉతికేయాలి. సబ్బు లేదా ఇతర డిటర్జెంట్‌ పౌడర్‌తో ఉతికి, నాలుగు గంటల పాటు ఆరబెట్టాక వినియోగించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ 90 శాతం మంది దీనిని అసలు పాటించడం లేదని వెల్లడైంది. అందుకే... మాస్కును... ఎలా వాడుతున్నామన్నదే ముఖ్యమైన విషయమని గ్రహించాలని వైద్యులు చెబుతున్నారు. 


ఇక... వ్యాక్సిన్‌ వచ్చినా.. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరని అమెరికాలోని బేలార్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌‌కు చెందిన నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ అసొసియేట్‌ డీన్‌,వ్యాక్సిన్‌ తయారీలో ప్రముఖ శాస్త్రవేత్త మరియా ఎలెనా  స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ అనేది... కరోనా బారిన పడే అవకాశాన్ని తగ్గిస్తుందే తప్ప... వైరస్‌ను పూర్తిగా నిర్మూలించదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-08-09T22:11:36+05:30 IST