ఐపీఎల్‌లో తొమ్మిదో జట్టు?

ABN , First Publish Date - 2020-11-12T09:49:16+05:30 IST

యూఏఈలో ఐపీఎల్‌ సూపర్‌ హిట్‌ కావడంతో.. మెగా వేలానికి సిద్ధంగా ఉండాలని ఫ్రాంచైజీలకు బోర్డు సమాచారమిచ్చిందనే

ఐపీఎల్‌లో తొమ్మిదో జట్టు?

కరోనా  కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌పై తీవ్ర అనిశ్చితి నెలకొంది. మెగా లీగ్‌ ఈ ఏడాదికి లేనట్టేనన్న ఊహాగానాలు బలంగా వినిపించాయి. కానీ, విపత్కర పరిస్థితుల నడుమ దుబాయ్‌ వేదికగా 13వ ఐపీఎల్‌ను నిర్వహించ డంలో బీసీసీఐ గ్రాండ్‌సక్సెస్‌ అయింది. లీగ్‌ ఆరంభానికి ముందు కరోనా కలవర పెట్టినా.. ఆ తర్వాత అంతా సాఫీగా సాగిపోయింది. ఢిల్లీతో జరిగిన తుది పోరులో నెగ్గిన ముంబై ఇండియన్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయోత్సాహంతో వచ్చే ఏడాది ఐపీఎల్‌ కోసం బీసీసీఐ సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే, 2021 లీగ్‌కు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. మెగా వేలాన్ని కూడా నిర్వహించాల్సి ఉంది. అయుతే ఆసక్తికరంగా.. లీగ్‌లో 9వ టీమ్‌ను చేర్చేందుకు బోర్డు ప్రణాళికలు రూపొందిస్తోందట.


మెగా వేలం సన్నాహకాల్లో బీసీసీఐ

అహ్మదాబాద్‌ కేంద్రంగా ఫ్రాంచైజీ


న్యూఢిల్లీ: యూఏఈలో ఐపీఎల్‌ సూపర్‌ హిట్‌ కావడంతో.. మెగా వేలానికి సిద్ధంగా ఉండాలని ఫ్రాంచైజీలకు బోర్డు సమాచారమిచ్చిందనే వార్తలు వెలువడుతున్నాయి. కరోనా కారణంగా బోర్డు ఆదాయం భారీగా పడిపోయింది. స్పాన్సరర్లు కూడా వెనక్కి తగ్గడంతో.. అప్పటికప్పుడు ఆసక్తి ప్రదర్శించిన కంపెనీలతో బోర్డు ఒప్పందాలు చేసుకొంది. కానీ, భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి దెబ్బ తినకూడదనే ఉద్దేశంతోనే వేలానికి బోర్డు తీవ్రంగా ప్రయత్నిస్తోందట..! 


 తొమ్మిదో టీమ్‌ ఎందుకు..?

లీగ్‌లో జట్ల సంఖ్య పెంచాలనే డిమాండ్‌ కొన్నేళ్లుగా ఉంది. కానీ, కోర్టుల జోక్యం, ఫిక్సింగ్‌ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైన బీసీసీఐ.. తాత్కాలికంగా ఆ ఆలోచనను విరమించుకుంది. బోర్డు అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహణ గాడిలో పడింది. దీంతోపాటు కరోనా కారణంగా చోటుచేసుకున్న ఆర్థిక నష్టాలను పూడ్చుకోవడం బీసీసీఐకి అవశ్యం. ప్రస్తుతం ఉన్న 8 జట్లకు అదనంగా మరో కొత్త టీమ్‌ను ఏర్పాటు చేస్తే భారీగా ఆదాయం లభిస్తుంది. అందుకే 9వ టీమ్‌ ఏర్పాటుపై దృష్టి పెట్టినట్టు సమాచారం. అది కూడా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ హోమ్‌ టీమ్‌గా. చెన్నైపై రెండేళ్ల నిషేధం విధించినప్పుడు గుజరాత్‌ లయన్స్‌ను తాత్కాలికంగా తెరపైకి తెచ్చారు. రెండేళ్ల తర్వాత ఆ టీమ్‌ కనుమరుగైంది. ఆ ప్రాంతానికి ప్రాతినిథ్యం కల్పించే ఉద్దేశంతోనే అహ్మదాబాద్‌ కేంద్రంగా మరో ఫ్రాంచైజీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారట..! 


ఆ టీమ్‌ యజమాని ఎవరు?

ఐపీఎల్‌ టీమ్‌ యజమానికి లభించే గుర్తింపు అంతా ఇంతా కాదు. దీంతో ఎంతో మంది బిజినెస్‌ టైకూన్లు, పారిశ్రామిక వేత్తలు ఫ్రాంచైజీ హక్కులు దక్కించుకోవడానికి తహతహలాడుతున్నారని తెలిసింది. అయితే, గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పూర్తి వివరాలు, బిడ్డింగ్‌ విధానం త్వరలో వెలువడే అవకాశం ఉంది. 


మెగా వేలం ఎప్పుడు?

అనుకున్నది అనుకున్నట్టు జరిగితే డిసెంబరు లేదా జనవరిలో మెగా వేలం జరిగే అవకాశం ఉంది. 9వ టీమ్‌పై ఓ స్పష్టత వచ్చిత తర్వాతే వేలానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించనుంది. కాగా, ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్లను అట్టిపెట్టుకొనే విధానంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, అందరినీ వేలానికి ఉంచడం సాధ్యం కాకపోవచ్చని ఓ ఫ్రాంచైజీ అధికారి అన్నాడు. స్టార్‌ ఆటగాళ్లను ఆయా జట్లు వదులుకొనేందుకు సిద్ధంగా లేవని తెలిపాడు. 

Updated Date - 2020-11-12T09:49:16+05:30 IST