నియో కోవ్‌ వైరస్‌!

ABN , First Publish Date - 2022-01-29T08:22:01+05:30 IST

గడిచిన రెండేళ్లుగా కరోనా(సార్స్‌ కోవ్‌-2) వైర్‌సతో కల్లోలానికి గురవుతున్న ప్రపంచం ముంగిట ఇప్పుడు మరో ముప్పు? గబ్బిలాల నుంచి వచ్చిన మరో వైర్‌స--నియో కోవ్‌ మానవాళి పాలిట ప్రమాదకరంగా మారవచ్చంటూ చైనాలోని వూహాన్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ...

నియో కోవ్‌ వైరస్‌!

ప్రపంచం ముంగిట మరో ముప్పు..?

సోకిన ప్రతి ముగ్గురిలో ఒక మరణానికి అవకాశం!

దక్షిణాఫ్రికాలో గబ్బిలాల్లో గుర్తింపు

ఇది మెర్స్‌కోవ్‌ వైరస్‌కు సంబంధించిన మ్యుటేషన్‌

ప్రస్తుత కొవిడ్‌ వ్యాక్సిన్లకు లొంగే రకం కాదు

హెచ్చరిస్తున్న వూహాన్‌ శాస్త్రవేత్తలు

ప్రస్తుతానికి మనుషులకు సోకిన దాఖలాల్లేవు

ఇప్పుడే అంచనాకు రాలేమన్న రష్యా శాస్త్రవేత్తలు

ఇది కొవిడ్‌ జాతికి చెందినది కాదు: శాస్త్రవేత్తలు


బీజింగ్‌/మాస్కో, జనవరి 28: గడిచిన రెండేళ్లుగా కరోనా(సార్స్‌ కోవ్‌-2) వైర్‌సతో కల్లోలానికి గురవుతున్న ప్రపంచం ముంగిట ఇప్పుడు మరో ముప్పు? గబ్బిలాల నుంచి వచ్చిన మరో వైర్‌స--నియో కోవ్‌ మానవాళి పాలిట ప్రమాదకరంగా మారవచ్చంటూ చైనాలోని వూహాన్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. నియోకోవ్‌ వైరస్‌ దక్షిణాఫ్రికాలో బయటపడినట్లు తెలిపారు. గబ్బిలాల ద్వారా ఇది జంతువులకు సోకుతోందని, ఈ వైర్‌సకు వేగంగా వ్యాప్తిచెందే లక్షణం ఉందని వివరించారు. దీని వల్ల మరణాల రేటు అధికంగా ఉండే ప్రమాదం ఉందని హెచ్చరికలు చేశారు. ఈ వైరస్‌ సోకిన ప్రతి ముగ్గురిలో ఒక మరణం సంభవించవచ్చన్నారు. ‘బయోఆర్‌ఎక్స్‌4’ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన వారి పరిశోధన పత్రాల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు రష్యా అధికారిక వార్తాసంస్థ స్పూత్నిక్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికైతే నియోకోవ్‌ను జంతువుల నుంచి జంతువులకు సోకే వైర్‌సగా గుర్తించినట్లు పేర్కొంది.


ఈ వైర్‌సలోని ఓ మ్యుటేషన్‌ జంతువుల నుంచి మనుషులకు సోకవచ్చనే అధ్యయనాలు ఉన్నట్లు తెలిపింది. గబ్బిల్లాల్లోని యాంజియోటెన్సిన్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్‌(ఏసీఈ2)ను నియోకోవ్‌ వినియోగించుకుంటుందని.. అయితే, మనుషుల్లోని ఏసీఈ2ను ప్రభావితం చేసి, శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యం నియోకోవ్‌కు కొంత తక్కువేనని వూహాన్‌ వర్సిటీ, బయోఫిజిక్స్‌ ఆఫ్‌ ద చైనీస్‌ అకాడమీ శాస్త్రవేత్తల సంయుక్త అధ్యయనంలో తేలినట్లు స్పూత్నిక్‌ కథనం స్పష్టం చేసింది. కరోనాతో పోలిస్తే.. వ్యాప్తి, మరణాల రేటులో నియోకోవ్‌ మరింత ప్రమాదకరమైనదని వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్‌ వ్యాక్సిన్లకు, యాంటీబాడీలకు ఇది లొంగేరకం కాదని చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు.


కాగా.. ఈ వైరస్‌ ప్రస్తుతం జంతువుల్లోనే ఉందని, అందుకే వెంటనే ఒక అంచనాకు రాలేమని రష్యాకు చెందిన వెక్టార్‌ వైరస్‌ స్టేట్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆఫ్‌ వైరాలజీ అండ్‌ బయోటెక్నాలజీ నిపుణులు తెలిపారు.ఇది ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదని చెబుతున్నారు. నియోకోవ్‌పై వూహాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనం వివరాలు తమకు తెలుసునని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసినట్లు రాయిటర్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై చైనా శాస్త్రవేత్తలతో డబ్ల్యూహెచ్‌వో మాట్లాడుతోందని వెల్లడించింది.

Updated Date - 2022-01-29T08:22:01+05:30 IST