గడగడలాడించిన ‘నిఫా’

ABN , First Publish Date - 2020-12-13T06:57:02+05:30 IST

గతంలో ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను గడగడలాడించిన వైర్‌సలు ఎన్నో ఉన్నాయి. కొన్నింటి బారి నుంచి జనాలు సురక్షితంగా బయటపడ్డారు. మరికొన్ని అంటువ్యాధుల తాకిడికి ప్రాణాల్ని వదిలిన వారెందరో ఉన్నారు. అలాంటి ఓ వైరస్‌ 2018లో దేవభూమిగా పిలవబడే కేరళ రాష్ట్రాన్ని గడగడలాడించింది...

గడగడలాడించిన ‘నిఫా’

గతంలో ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను గడగడలాడించిన వైర్‌సలు ఎన్నో ఉన్నాయి. కొన్నింటి బారి నుంచి జనాలు సురక్షితంగా బయటపడ్డారు. మరికొన్ని అంటువ్యాధుల తాకిడికి ప్రాణాల్ని వదిలిన వారెందరో ఉన్నారు. అలాంటి ఓ వైరస్‌ 2018లో దేవభూమిగా పిలవబడే కేరళ రాష్ట్రాన్ని గడగడలాడించింది. అదే నిఫా వైరస్‌. ఈ యధార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు  ఆషిక్‌ అబు ‘నిఫా’ సినిమా తెరకెక్కించారు. రేవతి, కుంచక్‌ బోబన్‌, టివోన్‌ థామస్‌, రెహమాన్‌ తదితరులు నటించిన ఈ చిత్రం 2018లో మలయాళంలో విడుదలై విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రం ‘ఆహా’ ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ కథేంటో చూద్దాం...


జక్రియా మహ్మద్‌ అనే వ్యక్తి తీవ్రమైన దగ్గు, వాంతులతో బాధపడతూ కేరళలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్‌ అవుతాడు. అతనికి ఏమైందో తెలుసుకునేలోపే జక్రియా మరణిస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయనకు చికిత్స అందించిన నర్స్‌ అఖిల కూడా అదే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తిస్తారు. రోజూ అవే లక్షణాలతో బాధపడుతూ చాలామంది ఆస్పత్రికి వస్తారు. కొద్ది రోజులకీ ఆ వ్యాధితో మరణాల సంఖ్య పెరగడం ప్రారంభమవుతుంది. దాంతో వైద్య నిపుణులు అది నిఫా వైరస్‌ అని నిర్ధారిస్తారు. ఆ వైరస్‌ క్రమేణా కోజికోడ్‌ పొరుగు జిల్లాలకు కూడా వ్యాపిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో, అక్కడి ఆరోగ్య మంత్రి సి కె ప్రమీలా, జిల్లా కలెక్టర్‌ పాల్‌ వి అబ్రహం ఐఎఎస్‌ నేతృత్వంలోని వైద్య నిపుణులు, ఆరోగ్య నిపుణుల బృందం సంక్షోభాన్ని పరిష్కరించడానికి కోజికోడ్‌లో శిబిరం ఏర్పాటు చేస్తుంది. వైరస్‌ తాకిడిని తగ్గించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? కేరళ ఈ వైర్‌సను ఎలా ఎదుర్కొంది? నిఫా బారిన పడ్డ వారి కుటుంబాలు సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి తెలియాలంటే సినిమా చూడాల్సిందే! 

Updated Date - 2020-12-13T06:57:02+05:30 IST