నీతి ఆయోగ్ బాధ్యతారాహిత్యం

ABN , First Publish Date - 2021-03-04T06:02:26+05:30 IST

జాతీయ ఆహార భద్రత చట్టం కింద రేషన్ సరుకులు పొందుతున్నవారి సంఖ్యను తగ్గించాలని నీతి ఆయోగ్ కేంద్రప్రభుత్వానికి చేసిన సూచన...

నీతి ఆయోగ్ బాధ్యతారాహిత్యం

జాతీయ ఆహార భద్రత చట్టం కింద రేషన్ సరుకులు పొందుతున్నవారి సంఖ్యను తగ్గించాలని నీతి ఆయోగ్ కేంద్రప్రభుత్వానికి చేసిన సూచన క్షేత్రస్థాయిలో పరిస్థితులను సరిగా అంచనా వేయకుండా ఇచ్చినట్లుంది. వాస్తవానికి రేషన్ కార్డులతో కేవలం నిత్యావసర సరుకులేకాక ఇతర సంక్షేమ పథకాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఈ కార్డుల తొలగింపుతో ఆ పథకాలు కూడా సంబంధిత లబ్ధిదారులకు అందకుండా పోతాయి. కరోనా వైరస్ కారణంగా బాగా దెబ్బతిన్నది మధ్యతరగతి అల్పాదాయ వర్గాలే. ఈ వర్గాలు కరోనా గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో నీతీ ఆయోగ్ ఇటువంటి సూచన చేయడం బాధ్యతారాహిత్యం. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం మంది ప్రజలు అందుకుంటున్న రేషన్‌ను 60 శాతానికి, పట్టణాల్లో 50 శాతం మంది ప్రజలు అందుకుంటున్న రేషన్‌ను 40 శాతానికి కుదించడం ద్వారా ఆదా అయ్యే రూ.48వేల కోట్లను విద్య, ఆరోగ్యానికి ఖర్చు చేయవచ్చన్న నీతిఆయోగ్, ముందుగా విద్య,ఆరోగ్యం పై ప్రస్తుతం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు సక్రమంగా వినియోగం అవుతోందా లేదా అన్నది పరిశీలించడం ఆవశ్యకం. 


నాలుగైదు కీలకరంగాలు మినహా మొత్తం ఆర్థిక వ్యవస్థనంతా ప్రైవేటుపరం చేయడానికి సమాయత్తమవుతున్న కేంద్రసర్కారుకు దేశంలో విద్యావైద్య రంగాలు కార్పోరేటీకరణ చెంది మధ్యతరగతికి పెనుభారంగా మారాయన్న సంగతి తెలియంది కాదు. రేషన్‌ కార్డులను తొలగించడం ద్వారా ఆదా అయిన సొమ్ముతో విద్యావైద్య రంగాలను కార్పోరేట్ కబంధహస్తాల నుంచి విడిపించడం నీతిఆయోగ్ అభిమతమా?


ఇప్పటికే నిత్యావసర వస్తువులు, పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుతో మధ్యతరగతి అల్పాదాయ వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి లభిస్తున్న కొద్దిపాటి తోడ్పాటును కూడా తగ్గించాలని సూచించడం నీతి ఆయోగ్ అవగాహనారాహిత్యానికి నిదర్శనం.

గౌరాబత్తిన కుమార్ బాబు

Updated Date - 2021-03-04T06:02:26+05:30 IST