బిహార్‌కు ప్రత్యేక హోదాపై త్వరలో పరిశీలిస్తాం : నీతీ ఆయోగ్

ABN , First Publish Date - 2021-12-16T18:25:49+05:30 IST

బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను

బిహార్‌కు ప్రత్యేక హోదాపై త్వరలో పరిశీలిస్తాం : నీతీ ఆయోగ్

న్యూఢిల్లీ : బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను నిశితంగా పరిశీలిస్తామని, ఆ రాష్ట్రానికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందజేస్తామని నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. గడచిన దశాబ్దంలో బిహార్ వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందని, అయితే గతంలో పునాదులు బలహీనంగా ఉండటం వల్ల ఇతర రాష్ట్రాలను అందుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్చునని అన్నారు. 


రాజీవ్ కుమార్ ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ, బిహార్‌కు సాధ్యమైనంత ఎక్కువగా సహాయపడేందుకు, సహకరించేందుకు నీతీ ఆయోగ్ సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే ప్రత్యేక హోదాకు సంబంధించినంత వరకు ఆ రాష్ట్రం చెప్తున్న వివరణను నిశితంగా పరిశీలిస్తామని, తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ అంశాన్ని త్వరలోనే పరిశీలిస్తామన్నారు. 


నీతీ ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో బిహార్‌ను దేశంలోని నిరుపేద రాష్ట్రాల జాబితాలో పెట్టింది. అనేక మానవాభివృద్ధి సూచీలలో ఈ రాష్ట్రం వెనుకబడి ఉందని తెలిపింది. బిహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ మన దేశంలో నిరుపేద రాష్ట్రాలని ఈ జాబితా పేర్కొంది. బిహార్ జనాభాలో 51.91 శాతం మంది పేదలు ఉన్నారు. జార్ఖండ్‌లో 42.16 శాతం మంది, ఉత్తర ప్రదేశ్‌లో 37.79 శాతం మంది పేదలు ఉన్నారు. 


బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ 15 ఏళ్ళ నుంచి ఉంది. నీతీ ఆయోగ్ తాజా నివేదిక నేపథ్యంలో ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మరోసారి ఈ డిమాండ్‌ను లేవనెత్తారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కూడా రాజ్యసభ కార్యకలాపాలను నిలిపివేయాలని, బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంపై చర్చించాలని గురువారం ఓ నోటీసు ఇచ్చారు. 


Updated Date - 2021-12-16T18:25:49+05:30 IST