గ్రీన్ హైడ్రోజన్ కారును ఢిల్లీలో నడుపుతా : నితిన్ గడ్కరీ

ABN , First Publish Date - 2021-12-04T19:45:12+05:30 IST

హరిత (గ్రీన్) హైడ్రోజన్‌ను వినియోగించే కారును తాను

గ్రీన్ హైడ్రోజన్ కారును ఢిల్లీలో నడుపుతా : నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ : హరిత (గ్రీన్) హైడ్రోజన్‌ను వినియోగించే కారును తాను ఢిల్లీలో నడిపి, నీటి నుంచి ఈ ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుందని ప్రజలకు నమ్మకం కలిగిస్తానని  కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫరీదాబాద్‌లోని చమురు పరిశోధన సంస్థలో ఉత్పత్తి అయిన హరిత హైడ్రోజన్‌ను వినియోగించే కారును తాను కొన్నానని చెప్పారు. ఆర్థిక సమ్మిళితత్వంపై జరిగిన జాతీయ సదస్సులో గురువారం ఆయన మాట్లాడారు. 


రవాణా వాహనాలకు ఇంధనంగా గ్రీన్ హైడ్రోజన్‌ను ఉపయోగించడం సాధ్యమవుతుందని నితిన్ గడ్కరీ చెప్తున్నారు. మురుగు నీరు, ఘన వ్యర్థాల నుంచి గ్రీన్ హైడ్రోజన్‌‌ను ఉత్పత్తి చేయవచ్చునని, ఈ ఇంధనాన్ని వినియోగించి కార్లు, బస్సులు, లారీలను నడపాలని తాను ఆలోచిస్తున్నానని తెలిపారు. నాగపూర్‌లో ఏడేళ్ళ క్రితం ప్రారంభించిన ప్రాజెక్టులో మురుగు నీటిని రీసైకిలింగ్ చేస్తున్నారని, ఈ ప్లాంటు ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వ విద్యుత్తు ప్లాంటుకు మురుగు నీటిని విక్రయించి, సంవత్సరానికి దాదాపు 325 కోట్లు సంపాదిస్తోందని అన్నారు. వ్యర్థం అనేది ఏదీ ఉండదని చెప్పారు. నాయకత్వానికి ఉండే దార్శనికత, టెక్నాలజీలపై ఇది ఆధారపడుతుందని, వ్యర్థాల నుంచి సంపదను సృష్టించవచ్చునని వివరించారు. వ్యర్థ జలాలకు విలువను సృష్టించేందుకు తాను ప్రయత్నిస్తున్నానని చెప్పారు. 


వ్యర్థ జలాల నుంచి గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడంలో ప్రజలకు శిక్షణనివ్వాలన్నారు. ఘన వ్యర్థాలను వినియోగించి విద్యుత్తును చౌక ధరలకు ఇవ్వవచ్చునని చెప్పారు. మన దగ్గర నీరు ఉందని, ఎలక్ట్రోలైజర్లను ఇప్పుడు మన దేశంలోనే తయారు చేస్తున్నారని తెలిపారు. మనం గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయవచ్చునని, ఇది ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగపడుతుందని అన్నారు. బస్సులు, కార్లు, లారీలు ఈ ఇంధనంతో నడుస్తాయన్నారు. ఇది కష్టం కాదని, తాను ఓ హైడ్రోజన్ కారును కొన్నానని తెలిపారు. ఈ కారును తాను ఢిల్లీలో నడుపుతానని, మూస పద్ధతికి విరుద్ధంగా వచ్చే ఆలోచనలను ప్రజలు స్వీకరించడానికి సమయం అవసరమవుతుందని చెప్పారు.


ఆవు పేడ నుంచి తయారు చేసిన పెయింట్‌ను తన గదిలో ఓ గోడకు వేయించానని చెప్పారు. ఆవు మూత్రంతో ఫినాయిల్ తయారు చేయవచ్చునని తెలిపారు. 



Updated Date - 2021-12-04T19:45:12+05:30 IST