కారులో 6 ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి : నితిన్ గడ్కరీ

ABN , First Publish Date - 2022-01-15T00:04:21+05:30 IST

ప్రయాణికుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం

కారులో 6 ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి : నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ : ప్రయాణికుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఎనిమిది మంది వరకు ప్రయాణించగలిగే అన్ని వాహనాల్లోనూ 6 ఎయిర్‌బ్యాగులు తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ట్విటర్ వేదికగా ఈ వివరాలను వెల్లడించారు. 


ఎనిమిది మంది వరకు ప్రయాణించగలిగే మోటారు వాహనాల్లో తప్పనిసరిగా కనీసం ఆరు ఎయిర్ బ్యాగులు ఉండాలని నిర్దేశించే ముసాయిదా నోటిఫికేషన్‌ను తాను ఆమోదించానని గడ్కరీ తెలిపారు. మోటారు వాహనాల్లో ప్రయాణించేవారికి భద్రతను పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డ్రైవర్ భద్రత కోసం ఎయిర్ బ్యాగ్‌ను 2019 జూలై 1 నుంచి తప్పనిసరి చేశామని, ముందు సీట్లో కూర్చునే ప్రయాణికుడి భద్రత కోసం ఎయిర్‌ బ్యాగును అమర్చడాన్ని 2022 జనవరి 1 నుంచి తప్పనిసరి చేశామని తెలిపారు. 


ఎం1 వెహికిల్ కేటగిరీలోని ప్రతి వాహనానికి అదనంగా 4 ఎయిర్ బ్యాగులను అమర్చాలని తెలిపే నిబంధనను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. వాహనంలో ముందు, వెనుక భాగాల్లో కూర్చుని ప్రయాణించేవారికి ముందు, వెనుకల నుంచి జరిగే ప్రమాదాల ప్రభావాన్ని కనిష్ట స్థాయికి తగ్గించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అందరు ఔట్‌బోర్డ్ ప్యాసింజర్లకు భద్రత లభించే విధంగా రెండు సైడ్ బై సైడ్ టోర్సో ఎయిర్ బ్యాగులు, రెండు సైడ్ కర్టెన్/ట్యూబ్ ఎయిర్ బ్యాగులు అమర్చాలని తెలిపారు. భారత దేశంలో మోటారు వాహనాలను సురక్షితమైనవిగా తీర్చిదిద్దడంలో ఇది చాలా ముఖ్యమైన చర్య అని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల వాహనం ఖరీదుతో సంబంధం లేకుండా అన్ని రకాల వాహనాలు సురక్షితమైనవిగా ఉంటాయని తెలిపారు. జనవరి 11 నుంచి 18 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 


Updated Date - 2022-01-15T00:04:21+05:30 IST