Bihar: గవర్నర్‌ను కలిసిన నితీష్, తేజస్వి... రేపే కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2022-08-10T00:11:09+05:30 IST

హార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నితీష్ కుమార్ సారథ్యంలోని మహాకూటమి నేతలు..

Bihar: గవర్నర్‌ను కలిసిన నితీష్, తేజస్వి... రేపే కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం

పాట్నా: బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నితీష్ కుమార్ సారథ్యంలోని మహాకూటమి నేతలు గవర్నర్‌ ఫాగు చౌహాన్‌ను మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కలుసుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమ కూటమికి తగినంత బలం ఉందని, ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని నితిష్‌ కుమార్ కోరారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సైతం నితీష్ వెంటే అన్నారు. అనంతరం మీడియాతో సంయుక్త సమావేశంలో వీరు పాల్గొన్నారు. ఏడు పార్టీలకు చెందిన 164 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని మీడియకు నితీష్ తెలిపారు. ఇందుకు సంబంధించిన లేఖను గవర్నర్‌‌కు సమర్పించినట్టు చెప్పారు. కాగా, గవర్నర్ ఆదేశం అందగానే బుధవారమే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు  అవకాశాలు ఉన్నాయని జేడీయూ, ఆర్జేడీ వర్గాలు చెబుతున్నారు.


కాగా, మంగళవారం ఉదయం నుంచి జరిగిన వరుస పరిణామాల క్రమంలో గవర్నర్‌ను నితిష్ రెండుసార్లు కలుసుకున్నారు. తొలుత ఒంటరిగానే నితీష్ గవర్నర్‌ను కలుసుకుని రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జేడూయూ ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇదే సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన తేజస్వి సైతం, నితీష్‌కు మద్దతుగా నిలిచేందుకు, కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు తమ ఎమ్మెల్యేలు నిర్ణయించినట్టు చెప్పారు. 2017లో ఏమి జరిగిందో మరిచిపోయి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. అనంతరం పాట్నాలోని రబ్రీదేవి నివాసానికి నితీష్ చేరుకుని రబ్రీదేవి, తేజస్విని కలుసుకుని చర్చించారు. ఆ కొద్ది సేపటికే నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ కలిసి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమకున్న ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను ఆయన అందజేశారు. కాగా, బలాబలాల పరంగా,,, 243 మంది సభ్యులున్న బీహార్ శాసనసభలో ఆర్జేడీకి 80, బీజేపీకి 77, జేడియూకు 45, కాంగ్రెస్‌కు 19, వామపక్షాలకు 16 మంది ఎమ్మెల్యేలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు.

Updated Date - 2022-08-10T00:11:09+05:30 IST