వలస కూలీలపై ఇంత నిర్దయా? నితీష్ తప్పుకో: పీకే

ABN , First Publish Date - 2020-03-30T21:24:54+05:30 IST

వివిధ రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రమైన బీహార్‌కు వస్తున్న వసల కూలీల పట్ల బీహార్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ..

వలస కూలీలపై ఇంత నిర్దయా? నితీష్ తప్పుకో: పీకే

పాట్నా: వివిధ రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రమైన బీహార్‌కు వస్తున్న వసల కూలీల పట్ల నితీష్ కుమార్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. వలస కూలీలకు సొంత రాష్ట్రంలోనే ఎదురవుతున్న అనుభవాలు అత్యంత దయనీయంగా ఉన్నాయని చూపించే ఓ వీడియోను ఆయన సోమవారంనాడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తక్షణం ముఖ్యమంత్రి పదవికి నితీష్ రాజీనామా చేయాలని ఆయన ఆ ట్వీట్‌లో డిమాండ్ చేశారు.


'కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్ నుంచి ప్రజలను కాపాడే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఎంత భయానకంగా ఉన్నాయో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. పేద ప్రజలు, ముఖ్యంగా బీహార్‌కు తిరిగి వస్తున్న వలస కూలీల విషయంలో  క్వారంటైన్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని సొంత రాష్ట్రానికి వచ్చిన తర్వాత కూడా వారికి ఇలాంటి దయనీయ పరిస్థతి తప్పడం లేదు' అని ప్రశాంత్ కిషోర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 'నితీష్ గద్దె దిగాలి' అని హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు.


ప్రశాంత్ కిషోర్ తన ట్వీట్‌కు జోడించిన వీడియోలో, పలువురు వలస కార్మికులు కంటతడి పెడుతూ జైలులాంటి గదుల వెనుక కనిపిస్తున్నారు. 'మేము ఏమీ కోరడం లేదు. మమల్ని విడిచిపెట్టండి చాలు' అని వారు వాపోతున్నారు. పాట్నాకు 130 కిలోమీటర్ల దూరంలోని శివాన్‌లో తీసిన వీడియోగా దీనిని చెబుతున్నారు.


కాగా, దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని మోదీ ఈనెల 24న ప్రకటించినప్పటి నుంచి అనేక మంది వలస కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రాలకు చేరుకుంటూనే ఉన్నారు. లాక్‌డౌన్‌లో భాగంగా రవాణా సౌకర్యాలు స్తంభించిపోవడంతో కాలినడకనే వలస కూలీలు సొంత రాష్ట్రాలకు తరలిపోతున్నారు.

Updated Date - 2020-03-30T21:24:54+05:30 IST