Eighth Time: సీఎంగా నితీష్ సంచలన రికార్డు..

ABN , First Publish Date - 2022-08-10T01:35:23+05:30 IST

రాజీనామా చేసిన ప్రతిసారి మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడంలో జేడీయూ చీఫ్ తన ప్రత్యేకతను ..

Eighth Time: సీఎంగా నితీష్ సంచలన రికార్డు..

న్యూఢిల్లీ: రాజీనామా చేసిన ప్రతిసారి మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడంలో జేడీయూ చీఫ్  నితీష్ కుమార్ (Nitish kumar) తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నారు. తాజాగా ఆయన మంగళవారంనాడు తన పదవికి రాజీనామా చేసి, మరి కొద్ది గంటల్లోనే తిరిగి సీఎం పగ్గాలు  అందుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి సీఎం పదవిని ఆయన చేపట్టనుండటం 22 ఏళ్లలో ఎనిమిదో సారి (Eighth time) కానుంది. తద్వారా వరుసగా ఎనిమిదోసారి బీహార్ సీఎం పగ్గాలు పట్టిన రికార్డు ఆయన సొంతం అవుతుంది.


సీఎం పదవికి మరోసారి మంగళవారం రాజీనామా చేసిన నితీష్... బీజేపీతో పొత్తుకు ఉద్వాసన చెప్పడానికి చాలానే కారణాలున్నాయని, ఆ వివరాలు తర్వాత తెలియజేస్తానని చెప్పారు. 164 మంది ఎమ్మెల్యేల మద్దతుతో మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు  గవర్నర్‌ను కలిసి లేఖను సమర్పించినట్టు చెప్పారు. అయితే, ప్రధాని కావాలనే ఆకాంక్షే నితీష్ నిర్ణయానికి కారణమని, తాము మాత్రం పొత్తుల ధర్మానికి కట్టుబడ్డామని, బీహార్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ-జేడీయూ కూటమికి పట్టం కట్టారని, జేడీయూ తీసుకున్న నిర్ణయం ప్రజాతీర్పునకు తూట్ల పొడవడమేనని బీజేపీ నేతలు ఆరోపించారు.


నితీష్ కెరీర్‌లో ఉత్థాన పతనాలు ఎలా ఉన్నప్పటికీ, 8వ సారి సీఎం పగ్గాలు చేపట్టనుండటం ద్వారా ఆయన సరికొత్త రికార్డును సృష్టించనున్నారు. ఆయన సీఎం పదవిని ఎప్పుడెప్పుడు చేపట్టారనే వివరాల్లోకి వెళ్తే...

- మొదటిసారి: మార్చి, 2000

- రెండోసారి: నవంబర్, 2005

-మూడోసారి: నవంబర్ 2010

-నాలుగోసారి: ఫిబ్రవరి 2015

-ఐదోసారి : నవంబర్, 2015

-ఆరోసారి: జూలై, 2017

-ఏడోసారి : నవంబర్ 2020

-ఎనిమదో సారి: 10, ఆగస్టు, 2022 (Likely)


ఆసక్తికరంగా, ఈసారి ఆర్జేడీ, వామపక్షాలతో సహా విపక్షాలన్నింటినీ  కలుపుకొని నితీష్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాట చేయబోతున్నారు. బీహార్‌ తర్వాత ఢిల్లీలో అధికార మార్పే తమ లక్ష్యమని మహాకూటమి ప్రభుత్వంలో చేరుతున్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటించడం కొసమెరుపు.

Updated Date - 2022-08-10T01:35:23+05:30 IST