Abn logo
Oct 28 2020 @ 00:19AM

నితీశ్ ఆఖరి ఆరాటం!

ఒకప్పుడు నితీశ్ కుమార్ భుజాలపై ఎక్కి బిహార్‌లో బలం పెంచుకున్న భారతీయ జనతా పార్టీకి క్రమక్రమంగా ఆయన అవసరం తగ్గిపోతూ వచ్చింది. తనకు అవసరమైనప్పుడే ప్రాంతీయ పార్టీలతో స్నేహం పెంచుకుని ఆ తర్వాత వదిలివేయడం జాతీయ పార్టీల నైజం. ఈ నేపథ్యంలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి నితీశ్ అవసరం ఎంత మేరకు ఉంటుందో చెప్పడం కష్టం.


దేశ రాజకీయాల్లో అనేక పరిణామాలు పునరావృతమవుతూనే ఉంటాయి. 1960వ దశకం నుంచీ బిహార్‌లో కొన్ని పరిణామాలు ఏదో రకంగా పునరావృతమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత, ఉనికిని దెబ్బతీసేందుకు జాతీయ పార్టీలు ప్రయత్నించడం, జాతీయ పార్టీల ప్రయత్నాలు తెలిసినప్పటికీ ప్రాంతీయ పక్షాలకు వాటితో చేతులు కలపకుండా ఉండలేని అనివార్యత గురించి అర్థం చేసుకోవడం అవసరం.


బిహార్ ఇప్పుడు ఒక సంధి దశలో ఉన్నది. గత మూడేళ్లుగా బిజెపితో చేతులు కలిపి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిన జనతాదళ్ (యునైటెడ్‌) అధినేత నితీశ్ కుమార్ తన జీవితంలో అత్యంత కీలకమైన ఎన్నికల ఘట్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ఎన్నికల తర్వాత తన భవిష్యత్ ఏమిటి అన్న విషయంలో ఆయనకే స్పష్టత లేదు. బహుశా ఇవి నితీశ్ కుమార్ ఆఖరి ఎన్నికలని, బిహార్ అసెంబ్లీలో ఆయన పార్టీ బలం బాగా కుంచించుకుపోయి బిజెపి మద్దతుతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు చాలా తక్కువ అని బిహార్ రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న అనేకమంది పరిశీలకులు భావిస్తున్నారు. విచిత్రమేమంటే నితీశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన భారతీయ జనతా పార్టీ పెద్దలకు కూడా నితీష్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారన్న నమ్మకం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అసలు మరోసారి నితీశ్ ముఖ్యమంత్రి కావాలని బిజెపికి మనస్ఫూర్తిగా ఉన్నదా అన్న విషయం కూడా చెప్పడం కష్టం. ఎన్డీఏలో జనతాదళ్ (యు) కన్నా బిజెపికే ఎక్కువ సీట్లు వస్తాయని, ఎన్నికల తర్వాత జరిగే విన్యాసాల్లో బిజెపి ఏదో రకంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఒక వర్గం భావిస్తుండగా, త్రిశంకు అసెంబ్లీ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని మరికొందరు భావిస్తున్నారు. ఏ పరిణామం సంభవించినా బిహార్ రాజకీయాల్లో బిజెపి ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగే క్రమాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆ పార్టీ నేతలే అంటున్నారు.


నెహ్రూ విధానాల పట్ల భ్రమలు తొలగిపోయే క్రమం బిహార్‌లో 1960వ దశకంలోనే ప్రారంభమైంది. 1967లోనే సంయుక్త సోషలిస్టు పార్టీ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించింది. 1967-–72ల మధ్య నెహ్రూ ఆర్థిక విధానాల్లోని సోషలిజం బోగస్ అని ప్రకటించిన సోషలిస్టు నేత రాంమనోహర్ లోహియా కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం నిర్మించడంలో విఫలమయ్యారు. మళ్లీ ఎమర్జెన్సీలో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమానికి కూడా బిహార్ బలమైన పునాది వేసింది. ఈ చరిత్ర గమనంలో నితీశ్ కుమార్, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బిజెపి నేత సుశీల్ మోదీ గత అయిదున్నర దశాబ్దాలుగా పోషించిన పాత్ర విస్మరించలేం.


నిజానికి నితీశ్ కుమార్ ది రాజకీయ కుటుంబమే. ఆయన తండ్రి రాంలఖన్ స్వాతంత్ర్య సమరయోధుడు, సీనియర్ కాంగ్రెస్ నేత. పేరుమోసిన ఆయుర్వేద వైద్యుడైన రాంలఖన్ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో వైద్య వృత్తిని వదిలిపెట్టి స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. అయితే స్వాతంత్ర్యం తర్వాత జహహర్ లాల్ నెహ్రూ ఆయనకు రెండుసార్లు టికెట్ ఇవ్వకపోవడం, అగ్రవర్ణాలకు చెందిన తారకేశ్వరి సిన్హా వంటి యువతిని ప్రోత్సహించడంతో వెనుకబడిన వర్గాలకు చెందిన రాంలఖన్ తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. అప్పుడే నితీశ్ కుటుంబంలో కాంగ్రెస్ వ్యతిరేకత తీవ్రతరం కావడం, విద్యార్థిగానే నితీశ్ లోహియా భావాలకు ఆకర్షితుడు కావడం,ఆ తర్వాత విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. 1968లో ఫ్రాన్స్ లో వచ్చిన విద్యార్థి ఉద్యమం లాంటిది మన దేశంలో కూడా రావాలని, లోహియా కలలు కన్న కులరహిత సమాజం రావాలని నితీశ్ చెప్పేవారు.


కాంగ్రెస్‌ను స్వంతంగా ఎదుర్కోవడం కష్టమని రాంమనోహర్ లోహియాకు 1962లోనే అర్థమైంది. 1962లో జరిగిన ఎన్నికల్లో ఫూల్ పూర్ నుంచి పోటీ చేసి తానే స్వయంగా ఓడిపోవడంతో లోహియా ఇతర శక్తులతో చేతులు కలపక తప్పదని గ్రహించారు. జనసంఘ్, వామపక్షాలతో సహా కాంగ్రెస్‌ను వ్యతిరేకించే అన్ని శక్తులను కలపాలన్న ఆలోచన ఆయనకే తొలిసారి వచ్చింది. ఈ ప్రయోగం విజయవంతమై బిహార్‌లో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఒక బీసీ నేత బిందేశ్వర ప్రసాద్ మండల్ (మండల్ కమిషన్ చైర్మన్) నేతృత్వంలో ఏర్పడినప్పటికీ దాన్ని కాంగ్రెస్ నెల రోజులు కూడా సాగనివ్వలేదు. ఆయనకు వ్యతిరేకంగా ఒక దళిత నేతను ప్రోత్సహించిన కాంగ్రెస్ ఆ తర్వాత ఏకంగా రాష్ట్రపతి పాలనే విధించింది. పాకిస్థాన్ తో యుద్ధం, బంగ్లాదేశ్ అవతరణ నేపథ్యంలో ఆ తర్వాత బిహార్‌లో ఇందిరాగాంధీ ప్రభంజనం వీచింది.


కాంగ్రెసేతర ప్రత్యామ్నాయం కోసం బిహార్‌లో జరిగిన ప్రయత్నాలు విద్యార్థి ఉద్యమంలో కూడా ప్రతిఫలించాయి. సోషలిస్టు పార్టీ విద్యార్థి విభాగమైన సమాజ్ ‌వాది యువజన సభలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన నితీశ్ కుమార్ పాట్నా విద్యార్థి సంఘం ఎన్నికల్లో లాలూప్రసాద్ యాదవ్ అధ్యక్షుడుగా విజయం సాధించేందుకు కృషి చేశారు. విద్యార్థి సంఘం ఎన్నికల్లో విజయం సాధించేందుకు కలిసికట్టుగా ఏర్పడిన ఐక్య విద్యార్థి వేదికలో జనసంఘ్ విద్యార్థి విభాగం ఏబీవీపీ కూడా ఉండేది. లాలూ రెండు సార్లు విద్యార్థి సంఘానికి గెలిచేందుకు ఏబీవీపీ కూడా కారణమన్న విషయం చరిత్ర పుటల్లో నమోదైంది. నిజానికి సోషలిస్టులు బిజెపితో చేతులు కలపడం నితీశ్ కుమార్ 1998లో వాజపేయితో చేతులు కలపడంతో ప్రారంభం కాలేదు. అందుకు పునాది 1960వ దశకంలోనే ఏర్పడింది. ఆ తర్వాత 1974లో జెపి నేతృత్వంలో జరిగిన విద్యార్థి ఉద్యమమే బిహార్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించింది. అప్పుడు కూడా సంయుక్త సోషలిస్టు పార్టీ, జనసంఘ్ కలిసికట్టుగా పనిచేశాయి. విద్యార్థి ఉద్యమాన్ని నిర్వహించిన ఛాత్రసంఘర్ష్ సమితిలో ఏబీవీపీ కీలక పాత్ర పోషించింది. బిహార్‌లో జెపి ప్రారంభించిన సంపూర్ణ క్రాంతి ఉద్యమం దేశ వ్యాప్తంగా వ్యాపించి జాతీయ స్థాయిలో ఇందిర ప్రభుత్వాన్నే గద్దె దించింది. అప్పుడు జనతా పార్టీలో జనసంఘ్‌తో పాటు రకరకాల సోషలిస్టు శక్తులు పాల్గొన్నాయి. నాడు ఛాత్రసంఘర్ష్ సమితిలో స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఉన్న లాలూ, నితీశ్, సుశీల్ మోడీ తర్వాతి కాలంలో బిహార్ రాజకీ యాల్లో ప్రధాన పాత్ర పోషించారు. ఇదే సుశీల్ మోడీ, నితీష్, లాలూతో సంబంధాలు తెంచుకుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వ్యూహ రచన చేశారు.


బిహార్‌లో లాలూకు ఎన్నో సంవత్సరాలు కుడిభుజంగా ఉన్న నితీశ్ కుమార్ 1996లో గుడ్ బై చెప్పి బిజెపితో చేతులు కలపడానికి ఈ పూర్వరంగం కారణం కావచ్చు. ఒక బలమైన ప్రాంతీయ పార్టీకి బిహార్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోలేక. అరాచక, అవినీతి పాలన అందించిన లాలూ ప్రసాద్, నితీశ్ కుమార్ వంటి స్నేహితులను వదులుకోవడం కారణం కావచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడుతూ బిహార్‌లో కూడా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీకి భవిష్యత్ ఉన్నదని నితీశ్ భావించి ఉండవచ్చు.


నిజానికి మిగతా హిందీ రాష్ట్రాల్లో క్రమంగా ఎదిగిన బిజెపి బిహార్‌లో మాత్రం చాలా కాలం వరకు పాగా వేయలేకపోవడానికి కారణం వెనుకబడిన వర్గాలు సంఘటితం కావడం. హిందూత్వ రాజకీయాలు ప్రబలంగా ఉన్న1980-–1995లలో కూడా బిజెపి బిహార్‌లో తనంతట తాను పోటీ చేసినా పెద్దగా సీట్లు రాకపోగా ఎన్నికకూ ఎన్నికకూ మధ్య ఓట్ల శాతాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. మండల్ రాజకీయాల వల్లే బిజెపి బిహార్‌లో నితీశ్, జార్జి ఫెర్నాండెజ్‌లతో చేతులు కలపక తప్పలేదు. ఆ తర్వాతే దాని ఓటు శాతం 1995లో 11 శాతం నుంచి 2000లో 28 శాతానికి పెరిగింది. ఆర్జేడీ తర్వాత రెండవ అతి పెద్ద పార్టీగా అవతరించింది. 2005 నుంచి బిజెపి వరుసగా తాను పోటీచేసే సీట్ల సంఖ్యను పెంచుకుంటూ వచ్చింది. తదనుగుణంగా ఓట్ల శాతం కూడా పెరిగింది. 


గతంలో కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం అవసరమైన దశలో జరిగిన పరిణామాల్లో నితీశ్ వివిధ సందర్భాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో నితీశ్ బిజెపికి ఒక బలహీనమైన భాగస్వామిగా మిగిలిపోయారు. ఒకప్పుడు నితీశ్ భుజాలపై ఎక్కి బిహార్‌లో బలం పెంచుకున్న బిజెపికి క్రమక్రమంగా ఆయన అవసరం తగ్గిపోతూ వచ్చింది. తనకు అవసరమైనప్పుడే ప్రాంతీయ పార్టీలతో స్నేహం పెంచుకుని ఆ తర్వాత వదిలివేయడం జాతీయ పార్టీల నైజం. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల తర్వాత బిజెపికి నితీశ్ అవసరం ఎంత మేరకు ఉంటుందో చెప్పడం కష్టం. రాజకీయాల్లో పరస్పర ప్రయోజనాలపైనే స్నేహం ఆధారపడి ఉంటుంది. నితీశ్ హయాంలో బిహార్ ఘోరంగా వెనుకబడిందని అయిదేళ్ల క్రితం విమర్శించిన మోదీ ఇప్పుడు నితీశ్ నేతృత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందిందని పొగుడుతున్నారు. పోలింగ్ తేదీలు సమీపిస్తున్న కొద్దీ నితీశ్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం స్పష్టంగా కనపడుతుండడంతో బిజెపి నేతలు కొన్ని చోట్ల పోస్టర్లలో ఆయన చిత్రాలు లేకుండా చేస్తున్నారని సమాచారం. తమ ప్రయోజనాలు నెరవేరినంతవరకే బిజెపికి ఏ ప్రాంతీయ పార్టీ అయినా తెప్పలాంటిదే. ఒడ్డు దాటిన తర్వాత ఆ తెప్పను తగిలేసేందుకు అది పెద్దగా వెనుకాడకపోవచ్చు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)