నివర్‌... ‘అల’ర్ట్‌

ABN , First Publish Date - 2020-11-26T06:46:34+05:30 IST

నివర్‌ ప్రభావంతో తీరం వెంట పెనుగాలులు వీస్తున్నాయి. చలి తీవ్రత కూడా పెరిగింది. దీంతో మత్స్యకార గ్రామాల్లో జనం బయటకు రాలే దు.

నివర్‌... ‘అల’ర్ట్‌
కొత్తపట్నం తీరంలో అల్లకల్లోలంగా ఉన్న సముద్రం

తుపానుపై అంతా అప్రమత్తం

జిల్లాలో ప్రారంభమైన ప్రభావం 

తీరంలో పెనుగాలులు  

ముందస్తు జాగ్రత్తల్లో యంత్రాంగం  

నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం

తీరప్రాంత గ్రామాలకు అదనపు పోలీసు బలగాలు

రేషన్‌ దుకాణాలకు చేరిన నిత్యావసర సరుకులు

తీరం వెంట మెరైన్‌ పోలీసుల గస్తీ

ఒంగోలు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : నివర్‌ ప్రభావంతో తీరం వెంట పెనుగాలులు వీస్తున్నాయి. చలి తీవ్రత కూడా పెరిగింది. దీంతో మత్స్యకార గ్రామాల్లో జనం బయటకు రాలే దు. బుఽధవారం రాత్రి నుంచి వర్షం ప్రారంభమైంది. గాలుల వేగం పెరిగింది. తుఫాన్‌ ముందస్తు చర్యలపై అటు యంత్రాం గం, ఇటు ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తమయ్యారు. తీరప్రాంతంలోని 11 మండలాలకు చెందిన  అధికారులు, ఆయా మండలాలకు నియమితులైన జిల్లాస్థాయి అధికారులు బుధవారం మండలాల్లో దృష్టి కేంద్రీకరించారు. కలెక్టర్‌ పోలా భాస్క ర్‌, జేసీలు వెంకటమురళి, టీఎస్‌ చేతన్‌, కందుకూరు సబ్‌కలెక్టర్‌ భార్గవ్‌తేజ, ఇతర ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ముందస్తు చర్యలను పర్యవేక్షించారు. ప్రత్యేకించి తుఫాన్‌ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్న ఉలవపాడు, గు డ్లూరు, లింగసముద్రం మండలాల్లో వారు పర్యటించారు. మత్స్యకారులు వేట నిలిపి బోట్లు, వలలను సురక్షిత ప్రాంతానికి చేర్చుకోగా రైతులు, చేనేతలు, ఇతర వర్గాల వారు కూడా వర్షా లు పడితే ఎక్కువ నష్టం జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు తుఫాన్‌ తీవ్రత జిల్లాపై ఉంటే తక్షణం ఎదుర్కోవడానికి సర్వం సిద్ధమైంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేలా కీలకశాఖల యంత్రాంగం అప్రమత్తమైంది. కాగా నివర్‌ తుఫాన్‌ తీరం దాటిన అనంతరం 24గంటలపాటు వర్షాల జోరు ఉండే అవకాశం ఉంది. ఆ ప్రకారం జిల్లాలో గురువారం విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. 


తీరంలో పెనుగాలులు..

ఒంగోలు నగరం : నివర్‌ తుఫాన్‌ కారణంగా తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు సాధారణ ఎత్తుకంటే పెరిగి పలుచోట్ల తీరానికి దగ్గరగా వస్తున్నాయి. ఒడ్డుకు చేర్చుకున్న పడవలను అనేక గ్రామాల్లో మత్స్యకారులు ఇంకాస్త మెరక ప్రాంతానికి తరలించుకున్నారు. అవి దెబ్బతినకుండా కాపాడుకునే పనిలో ఉన్నారు. మత్స్యశాఖ అధికారులు వాతావరణ శాఖ నుంచి వస్తున్న తుఫాన్‌ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మత్స్యకార గ్రామాల్లోని దేవాలయాల్లో ఉన్న మైకుల ద్వారా తెలియజేస్తున్నారు. భారీ వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు వాహనాలను సిద్ధంగా ఉంచారు. తీరప్రాంత మండలాల్లో రెవెన్యూ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ప్రతి గ్రామానికి ఒక అధికారిని నియమించారు. తీరప్రాంత మండలాలకు నియమించిన ప్రత్యేక అధికారులు బుధవారమే ఆయా మండలాలకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఇక్కడి పోలీసు స్టేషన్‌లకు అదనపు సిబ్బందిని కేటాయించారు. తీరంలోని ప్రతి గ్రామానికి ఒక పోలీసును పంపించారు. ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌ బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ కొత్తపట్నం పల్లెపాలెంలో ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఆయనతోపాటు ఒంగోలు సీఐ రాజేష్‌ ఇతర పోలీసు అధికారులు కూడా తీరప్రాంత గ్రామాల్లో పర్యటించారు. మెరైన పోలీసులు అన్ని గ్రామాల్లో టాంటాం వేసి తుఫాన్‌ ముప్పును వివరిస్తూ ప్రచారం చేశారు. మెరైన్‌ సీఐ శ్రీనివాసరావు తీరంలోని అన్ని గ్రామాలకు ప్రత్యేక మొబైల్‌ టీంలను ఏర్పాటు చేశారు. వీరు గ్రామాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నారు. 

నేడు పలు రైళ్లు రద్దు

ఒంగోలు (కార్పొరేషన్‌): నివర్‌ తుఫాన్‌ నేపథ్యంలో ఒంగోలు మీదుగా చెన్నై నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ - తాంబరం, మధురై - బికనీర్‌ రైళ్లను ఈనెల 26న, బికనీర్‌-మధురై రైలును ఈనెల 29న రద్దుచేసినట్లు తెలిపారు. అలాగే, చెన్నై - తిరుపతి రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో పలు రైళ్లను దారిమళ్లింపు చేయడంతోపాటు, పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు సహకరించాలని, ఇతర రైళ్ల సమాచారాన్ని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌ల వద్ద   తెలుసుకోవచ్చని  వారు తెలిపారు. 


తీర ప్రాంత పోలీసు స్టేషన్‌లకు అదనపు సిబ్బంది

డీఎస్పీ కార్యాలయాల్లో కంట్రోల్‌రూంలు

ఎస్పీ సిధ్థార్దకౌశల్‌

ఒంగోలు (క్రైం), నవంబరు 25 : నివర్‌ తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు. తీరం వెంట ఉన్న 11 పోలీసు స్టేషన్‌లకు అదనపు సిబ్బందిని పంపించామని చెప్పారు. వర్షాలకు వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్న దృష్ట్యా  వాటి వద్ద పోలీసు సిబ్బందితో పహారా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. జాతీయ రహదారిపై నాలుగు మొబైల్‌ వాహనాలతో గస్తీ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ డీఎస్పీని  ఇన్‌చార్జ్‌గా నియమించినట్లు తెలిపారు. తుఫాన్‌ సహాయక చర్యల పర్యవేక్షణ బాధ్యతను అదనపు ఎస్పీ బి. రవిచద్రకు అప్పగించామని చెప్పారు. 10 మంది డీఎస్పీలు, 16మంది సీఐలు, 48మంది ఎస్సైలు, 430మంది సిబ్బందిని నియమించామన్నారు.  అత్యసర చర్యలకు ఒక క్రేను, రెండు ఎక్స్‌కవేటర్లు సిద్ధంగా ఉంచామన్నారు. అన్ని సబ్‌డివిజన్‌  కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. 







Updated Date - 2020-11-26T06:46:34+05:30 IST