Abn logo
Nov 28 2020 @ 00:33AM

బుగ్గవంక తీరంలో.. వీడని భయం

కట్టుబట్టలతో వీధిన పడ్డ అభాగ్యులు

కడప, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): వరద ఉధృతి తగ్గినా బుగ్గవంక పరివాహక ప్రాంతాల ప్రజలకు భయం వీడలేదు. చిరుజల్లులు కురుస్తుండడంతో ఏ క్షణాన నీరు వచ్చి ముంచేస్తుందోనన్న భయం నెలకొంది. గురువారం అర్ధరాత్రి నుంచి క్రమేపీ బుగ్గవంక నీరు పెరుగుతూ వచ్చింది. అర్ధరాత్రి దాటిన తరువాత పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో వందలాదిమంది కట్టుబట్టలతో బయటపడ్డారు. పరివాహక ప్రాంతంలో ఎక్కువగా పేదలు ఉన్నారు. ఇంట్లోని సామగ్రి అంతా నీళ్లపాలు కావడంతో వీరు గొల్లుమంటున్నారు. బుగ్గవంక ధాటికి ఎర్రముక్కపల్లె, బాలాజీనగర్‌, రాజీవ్‌నగర్‌, నాగరాజుపేట, రవీంద్రనగర్‌, అంబాభవానీనగర్‌, అల్మా్‌సపేట, గుర్రాలగడ్డ, లోహియానగర్‌, మురాదియానగర్‌ లోతట్టు ప్రాంతాలు, సెవెనరోడ్స్‌, పాతబస్టాండు, వైవీ స్ర్టీట్‌ జలమయమయ్యాయి. వైవీ స్ర్టీట్‌లో వాణిజ్య సముదాయాల్లోకి నీళ్లు వెళ్లడంతో సరుకంతా పాడైంది. అలాగే నగరంలోని సెవెనరోడ్స్‌లో స్టేట్‌బ్యాంకు మెయిన కార్యాలయంలోకి వరద నీరు వచ్చి చేరింది. బుగ్గవంక వరద నీరు ఆఫీసర్స్‌ క్లబ్‌లోకి 5 అడుగుల పైన చేరింది. దీంతో కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు, పరికరాలు, మోటర్లు, జనరేటర్లు, షటిల్‌ కోర్టు పూర్తిగా దెబ్బతిని రూ.12లక్షలు నష్టం సంభవించినట్లు స్టెప్‌ సీఈవో, ఆఫీసర్స్‌ క్లబ్‌ కార్యదర్శి రామచంద్రారెడ్డి వెల్లడించారు. బుగ్గవంక ప్రవాహం తగ్గినప్పటికీ పరివాహక ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం నాటికి 6వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టులో 0.45 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 

సమన్వయ లోపం

నివర్‌ తుఫాను తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వచ్చింది. ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. అయితే బుగ్గవంక ప్రాజెక్టులోని నీటిని వదిలేప్పుడు సరైన సమాచారాన్ని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు తెలియజేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముందస్తుగా అధికారులు వలంటీర్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేసి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదని అంటున్నారు. అధికారులు పునరావాస కేంద్రాల్లో భోజనాలు అందిస్తున్నారని, అయితే ఇంట్లో దెబ్బతిన్న సామగ్రి పరిస్థితి ఏంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పునరావాస కేంద్రాల్లో 1500 కుటుంబాలు

బుగ్గవంక పరిధిలోని పరివాహక ప్రాంతాలు జలమయం కావడం, ఇళ్లల్లోకి నీరు రావడంతో ఏడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 1500 కుటుంబాలకు చెందిన 5వేల మందికి ఆశ్రయం కల్పించినట్లు కార్పొరేషన డీఈ ధనలక్ష్మి ఆంధ్రజ్యోతికి వెల్లడించారు. వరదలకారణంగా రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం దెబ్బతింది. శుక్రవారం సాయంత్రం నాటికి రూ.6 కోట్లు దాకా నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా వేశారు. కొన్ని చోట్ల విద్యుత స్తంభాలు దెబ్బతినగా మరికొన్ని చోట్ల ట్రాన్సఫార్మర్లు కూలిపోయాయి. దీంతో ఎర్రముక్కపల్లె, రవీంద్రనగర్‌, నాగరాజుపేట, అల్మా్‌సపేట, అంబాభవాని ప్రాంతాల్లో కొన్ని చోట్ల విద్యుత సరఫరా నిలిచిపోయింది. యుద్దప్రాతిపదికన పునరుద్ధరించేందుకు పనులను చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీనివాసులు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement