Abn logo
Nov 28 2020 @ 00:38AM

పింఛా ప్రాజెక్టుకు గండి

120-150 మీటర్లు కోసుకుపోయిన మట్టిఆనకట్ట

రూ.17-20 కోట్లకుపైగా నష్టం

బీభత్సం సృష్టించిన నివర్‌ తుఫాన

72,755.5 హెక్టార్లలో నీటి మునిగిన పంటలు

రూ.82.05 కోట్ల నష్టం

దెబ్బతిన్న 50 చెరువులు.. రూ.100 కోట్లకుపైగా నష్టం

వేయికిపైగా మృత్యువాత పడిన మూగజీవాలు


నివర్‌ కల్లోలం సృష్టించింది. ఊళ్లు.. చేళ్లు ఏరులయ్యాయి. సాగునీటి ప్రాజెక్టులకు ముప్పు ఏర్పడింది. పింఛా ప్రాజెక్టు మట్టిఆనకట్ట అడ్డంగా కోసుకుపోయింది. పల్లెసీమలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. కడప నగరంతో పాటు పట్టణాలు జలదిగ్బంధమయ్యాయి. నీటి ఉధృతికి రోడ్లు తెగిపోయాయి. గుంజనేరు, చెయ్యేరు, మాండవ్య నదులు ఉప్పొంగాయి. ఎటుచూసినా జలవిలయం.. జనజీవనం స్తంభించింది. జిల్లా అంతటా ‘నివర్‌’ తీవ్ర ప్రభావం చూపింది.


(కడప-ఆంధ్రజ్యోతి): రెండురోజుల పాటు కురిసిన వానలకు జిల్లాలో వాగులు వంకలు ఉప్పొంగాయి. వేలాది ఎకరాల్లో పంటలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. చాలా ఊర్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లాలో దాదాపు వేయికి పైగా మూగజీవాలు మృత్యువాతపడ్డాయి.

అరవైయేళ్ల ప్రాజెక్టు పింఛాకు గండి

కడప-చిత్తూరు జిల్లా సరిహద్దు టి.సుండుపల్లె మండలం బాహుదా నదిపై అరవై ఏళ్ల క్రితం నిర్మించిన పింఛా ప్రాజెక్టు మట్టిఆనకట్ట వరద ఉధృతికి తెగిపోయింది. 120-150 మీటర్లకు పైగా మట్టికట్ట తెగిపోవడంతో రూ.17-20 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. 1960లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. సామర్థ్యం 0.30 టీఎంసీలు. డ్యాం క్రస్ట్‌గేట్లు వరద ప్రవాహ సామర్థ్యం 58 వేల క్యూసెక్కులు. ఈ ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి అంతకు మించి వరద రాలేదు. నివర్‌ తుఫాన ప్రభావంతో చిత్తూరు జిల్లాలో గురువారం అతిభారీ వర్షాలు పడ్డాయి. శుక్రవారం తెల్లవారుజామున 1.50 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తింది. అంటే.. డ్యాం క్రస్ట్‌గేట్ల సామర్థ్యం కంటే మూడింతల వరద వచ్చింది. అంతేకాదు.. పెద్దపెద్ద చెట్లు వరదకు కొట్టుకొచ్చి గేట్లకు అడ్డంగా చేరాయి. దీంతో ఆనకట్టపై 7.5 అడుగుల వరద ప్రవహించింది. ఆ ఉధృతికి కుడివైపున కొండ అంచున 120-150 మీటర్లకు పైగా మట్టిఆనకట్ట కోసుకుపోయింది. మైనర్‌ ఇరిగేషన ఎస్‌ఈ వెంకట్రామయ్య, డ్యాం ఇంజనీర్లు గండి పడిన కట్టను, డ్యాంను పరిశీలించారు. శాశ్విత మరమ్మతులకు సుమారుగా రూ.17 - 20 కోట్లు అవసరమని అంచనా వేశారు. జిల్లాలో 50 చెరువులు దెబ్బతిన్నాయి. సీకేదిన్నె, కమలాపురం, పసుపులకుంట చెరువులకు గండ్లు పడ్డాయి. మరమ్మతులకు దాదాపు రూ.100 కోట్లు అవసరమని ప్రాథమిక అంచనా వేశారు.

72,755.5 హెక్టార్లలో పంట నష్టం

జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న నివర్‌ తుఫాన కల్లోలానికి రైతులు భారీ నష్టాన్ని చవిచూశారు. వరి పైరు చేతికొచ్చే సమయంలో వర్షార్పణం అయింది. 72,755.5 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం రూ.82.05 కోట్ల నష్టం జరిగింది. అత్యధికంగా వరి 15,951 హెక్టార్లలో నీటిపాలై రూ.23.93 కోట్లు, బుడ్డ శనగ 45,113 హెక్టార్లలో దెబ్బతిని రూ.45.11 కోట్ల నష్టం జరిగిందని అంచనా వేశారు. అయితే.. పెట్టుబడి, దిగుబడి రూపంలో ఎకరాకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు నష్టపోయామని రైతులు అంటున్నారు. ఈ లెక్కన సరాసరి రూ.1,455 కోట్లకుపైగా రైతు కష్టాన్ని నివర్‌ తుఫాన నీటిపాలు చేసింది.

సంబేపల్లె, రైల్వేకోడూరులో అత్యధిక వర్షం

మూడు రోజులు జిల్లాలో 8560.95 మి.మీల వర్షం పడిందని రెవిన్యూ అధికారులు తెలిపారు. సగటు వర్షపాతం 175.7 మి.మీలుగా నమోదైంది. అధికంగా సంబేపల్లెలో 348.6 మి.మీలు, రైల్వేకోడూరులో 350.4 మి.మీలు, పుల్లంపేటలో 254.8, గాలివీడులో 256.6,చిన్నమండెంలో 264,6, వీఎన పల్లెలో 230.6, ఎర్రగుంట్లలో 204.4, సీకేదిన్నెలో 264, పెండ్లిమర్రిలో 262.8, రాయచోటిలో 273.4, పెనగలూరులో 195.6, రాజంపేటలో 231.8, చిట్వేలిలో 223.8, ఓబులవారిపల్లెలో 188.6 మి.మీల వర్షం పడిందని పేర్కొన్నారు. వానపోటుకు వంకలు, వాగులు, నదులు పోటెత్తాయి. రాజంపేట డివిజనలో అత్యధిక నష్టం జరిగింది. రాజంపేట మండలం వెలిగచెర్ల గ్రామం చుట్టూ వర్షంనీరు చేరి జలదిగ్భంధంలో చిక్కుకుంది. మూడు రోజులుగా ఆ గ్రామంలో కరెంటు లేదు. వేలాది ఎకరాల్లో అరటి, వరి తదితర పంటలు నీటిమునిగాయి. గురువారం రాత్రి బుగ్గవంక పోటెత్తి కడప నగరంలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. శుక్రవారం కూడా గేట్లు ఎత్తుతారేమో అని జనం బిక్కుబిక్కుమంటూ భయంగా గడుపుతున్నారు.

ఛిద్రమైన రోడ్లు

వరదనీరు రోడ్లపై పొంగిపొర్లడంతో పంచాయతీ రాజ్‌ పర్యవేక్షణలోని గ్రామీణ రోడ్లు 921 కి.మీలు దెబ్బతిన్నాయి. మరమ్మతులకు రూ.6 కోట్లు అవసరమన్నారు. రోడ్లు భవనాల శాఖ పరిధిలో 192.60 కి.మీల రోడ్లు దెబ్బదిన్నాయి. తాత్కాలిక మరమ్మతులకు రూ.6.70 కోట్లు, శాశ్విత మరమ్మతులకు రూ.84.78 కోట్లు అవసరమని అంచనా వేశారు. అలాగే.. విద్యుత శాఖ పరిధిలో 99 ట్రాన్సఫార్మర్లు, 850 స్తంభాలు దెబ్బతిన్నాయి. 355 నివాస గృహాలు దెబ్బతిన్నాయి. వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 1,010 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. అధిక సంఖ్యలు గొర్రెలు చనిపోయి కాపరులు తీవ్రనష్టాన్ని మూటగట్టుకున్నారు.


తుఫానకు దెబ్బతిన్న పంటలు (హెక్టార్లు), నష్టం రూ.కోట్లల్లో

----------------------------------------------------------------------------

పంటలు గ్రామాలు విస్తీర్ణం నష్టం విలువ

----------------------------------------------------------------------------

బుడ్డ శనగ             223 45,133 45,11

మినుము     140 5,232 5.23

పత్తి             63 1,202 1.80

పెసలు     83 2,005 2.00

వేరుశనగ     93 1,667 2.50

సజ్జ             26 403         0.27

మొక్కజొన్న             10 1,145 0.14

వరి             369 15,951 23.93

కంది             28 349         0.35

ఇతర పంటలు     49 718         0.73

--------------------------------------------------------------------

మొత్తం 1,083 72,755.5 82.05

------------------------------------------------------------------


మృతి చెందిన గొర్రెల వద్ద విలపిస్తున్న దృశ్యం


కడప నగరంలోని పుట్లంపల్లె చెరువు తెగడంతో ఆర్టీసీ బస్టాండు-అప్సరా సర్కిల్‌ వెళ్లే రోడ్డుపైకి చేరిన వరద నీరు


Advertisement
Advertisement
Advertisement