సర్వపాపైః ప్రముచ్యతే

ABN , First Publish Date - 2020-12-14T08:45:16+05:30 IST

ఈ విశాల విశ్వంలో భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. ఈ జీవుల మరణం, జననం, ఆనందం, బాధలు అన్నీ గత జన్మల కర్మలను అనుసరించే ఉంటాయి. అలాగే ఈ జన్మల కర్మలను అనుసరించి మరుజన్మల ఫలితాలుంటాయి.

సర్వపాపైః ప్రముచ్యతే

ఈ విశాల విశ్వంలో భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. ఈ జీవుల మరణం, జననం, ఆనందం, బాధలు అన్నీ గత జన్మల కర్మలను అనుసరించే ఉంటాయి. అలాగే ఈ జన్మల కర్మలను అనుసరించి మరుజన్మల ఫలితాలుంటాయి. అనేక జీవాలు తమ తమ పాపాలను పోగొట్టుకోవడానికి శరీరం ధరించాలి. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గానికి పోయి  పుణ్యఫలాన్ని అనుభవిస్తారు. ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకానికి పోయి అక్కడ వారి పాపములకు తగినట్లు బాధలను పొందుతారు. రెండూ సమానమైనపుడు భూమిపై విచక్షణశక్తి గల మానవులుగా జన్మించి మోక్ష సాధనకు కృషి చేస్తారు.


సుఖతః క్రియతే రామాభోగః పశ్చాద్ధన్త శరీరే రోగః!

యద్యపి లోకే మరణం శరణం తదపినముంచతి పాపాచరణమ్‌!!


‘సుఖాన్ని ఆశించి మానవుడు ఇంద్రియలోలుడు అవుతాడు. దానివల్ల శరీరం రోగాలతో నిండిపోతుంది. లోకంలో మానవులకు మరణమే చివరికి శరణ్యమైనప్పటికీ వారు పాపాలు చేయడం మానరు’ అని ఆదిశంకరులు ఈ శ్లోకంలో బాధపడ్డారు. కూడబెట్టిన సంపదలన్నీ నశించేవే. లౌఖిక సంబంధాలన్నీ తెగిపోయేవే. ఎంతటి ఉన్నత స్థితిలో జీవించినవారికైనా మరణం తప్పదు. గత జన్మ పాపములు గాని, పుణ్యములు గాని ఎవరైనా, ఎంతటివారైనా అనుభవించవలసిందే.


యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్‌!

అసమ్మూఢస్స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే!!


‘పరమాత్మను ఎవరైతే పుట్టుకలేని వాడు గాను, అనాదిగాను, లోకమునంతా ఈశ్వరునిగాను తెలుసుకోగలుగుతున్నాడో, ఆ మూర్ఖత్వం లేని మానవులు, సకల పాపముల నుంచి విముక్తి పొందుతారు’ అని ఈ గీతా శ్లోక భావం. మానవుడు తనకున్న ధనం వల్ల, ఆస్తుల వల్ల, పదవి వల్ల తానే గొప్పవాడినని, తనకున్న ఆస్తులు, ధనము, పదవి శాశ్వతంగా నిలిచి ఉంటాయని అనుకుంటాడు. అదే అజ్ఞానం. ఎందుకంటే ఇవి త్రిగుణాలైనటువంటి సత్త్వ, రజో, తమో గుణాల వల్ల ఏర్పడిన మాయ వలన కలిగిన అపోహలు మ్రాతమే! నిజాలు కావు. పరమాత్మ ఒక్కడే సత్యం. ఈ జగత్‌ అంతా మిథ్య అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. ఈ జ్ఞానం కలిగినపుడే ‘సర్వపాపైః ప్రముచ్యతే’ అంటే.. అన్ని పాపములు నాశనం అవుతాయి. కొత్తగా పాపాలు చేయం. చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కావున మనస్సును, దేహమును నిగ్రహించినవాడు, ఆశ లేనివాడు, అది నాది ఇది నాది అని వేటిపైనా మమకారం పెంచుకొననివాడు, శరీర పోషణకు కావాల్సినవి మాత్రమే కోరుకునేవాడు పాపాలను పొందడు- అనే సత్యాన్ని గ్రహించి, ఆ విధంగా తన జీవన విధానాన్ని మలచుకుని, పాపాలు చేయకుండా పునర్జన్మ లేకుండా చేసుకోవడం మన  కర్తవ్యంగా భావించాలి.

- ఆచార్య ఎస్‌.జయరామరెడ్డి. 9949027118

Updated Date - 2020-12-14T08:45:16+05:30 IST