‘కర్మ’ను సృష్టించకండి!

ABN , First Publish Date - 2020-07-03T06:26:39+05:30 IST

‘కర్మ’ అనే మాటను మనం తరచుగా వింటూనే ఉంటాం. ‘కర్మ’ అంటే ప్రపంచంలో మనం చేసే పనులు మాత్రమే కాదు. మనం కూర్చున్నప్పుడు కూడా కర్మ చేస్తూనే ఉంటాం. ఇక్కడ కూర్చోవడం అనే కర్మను శరీరం చేస్తోంది. అది మనం గమనించకుండానే శ్వాస తీసుకుంటోంది. ఆక్సిజన్‌ను గ్రహించి, కార్బన్‌ డయాక్సైడ్‌ను

‘కర్మ’ను సృష్టించకండి!

‘కర్మ’ అనే మాటను మనం తరచుగా వింటూనే ఉంటాం. ‘కర్మ’ అంటే ప్రపంచంలో మనం చేసే పనులు మాత్రమే కాదు. మనం కూర్చున్నప్పుడు కూడా కర్మ చేస్తూనే ఉంటాం. ఇక్కడ కూర్చోవడం అనే కర్మను శరీరం చేస్తోంది. అది మనం గమనించకుండానే శ్వాస తీసుకుంటోంది. ఆక్సిజన్‌ను గ్రహించి, కార్బన్‌ డయాక్సైడ్‌ను వదిలేస్తోంది. దీన్నే మనం ఎరుకతో కూడా చేయవచ్చు. ఇదంతా భౌతికమైన కర్మ. మానసిక కర్మ, భావపరమైన కర్మ, శక్తిపరమైన కర్మ కూడా మానవుల్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అవి జరగకపోతే మానవులు సజీవంగా ఉండరు. 


మరి బద్ధకస్థులు కర్మ చేయకుండా ఉన్నట్టా? కాదు. బద్ధకం అంటే చాలా ఎక్కువ ప్రమాణంలో కర్మ చేయడం! ఎందుకంటే బద్ధకంతో ఉండాలంటే ఎక్కువ పని చెయ్యాలి. ఏమీ చేయనక్కరలేదని మీకు మీరు నచ్చజెప్పుకోవాలి. ప్రతిదానికీ ఎన్నో వివరణలు ఇచ్చుకోవాలి.  ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తిలో ఉంది. మీ చుట్టుపక్కల ఎవరో రోగగ్రస్థులవుతున్నారు. ఎమరో మరణిస్తున్నారు. దీనికి మీరు సహజంగానే స్పందిస్తారు. అలా స్పందించకుండా ఉండాలంటే మీలో మీరు చాలా చేయాలి. కాబట్టి బద్ధకం అనేది నిష్కర్మ కాదు. 

యోగులు దాదాపు నిద్రాణ స్థితిలో ఉంటారు. ఆ స్థితిలో అన్నీ అతి తక్కువ స్థాయిలో ఉంటాయి. కానీ వారు కూడా కర్మ నుంచి విముక్తులు కారు. మానసిక కర్మకూ, స్పందన సామర్థ్యానికీ సంబంధం ఉంది. ఉదాహరణకు, ఇప్పుడు మన చుట్టూ కరోనా సోకినవారు ఎందరో ఉన్నారు. వాళ్ళు సహాయం కోరితే ఏం చెయ్యాలి? అనే ప్రశ్న ఎదురైందనుకోండి. ప్రతి ఒక్కరూ అందరి జీవితాలనూ కాపాడలేరు. కానీ మీరు ఏదీ చేయకుండా ఉండాలంటే... మానసికంగా ఎంతో కర్మ చేయాలి. కానీ చేయగలిగేది చేస్తే మానసిక కర్మ బాగా తగ్గిపోతుంది. మీకున్న స్పందించే సామర్థ్యం విచక్షణారహితంగా ఉండగలదు. కానీ పనిలో విచక్షణా రహితంగా ఉండడం సాధ్యం కాదు. పని చేసే ప్రతిసారీ విచక్షణా సామర్థ్యాన్ని ఉపయోగిస్తాం. ఎందుకంటే దానికి భౌతిక సామర్థ్యం, శక్తి, మేధస్సు, ఉపకరణాలు, సమయం ఇలా ఎన్నో కావాలి. ఇవన్నీ పరిమితంగా ఉంటాయి. కాబట్టి విచక్షణారహితంగా ఎవరూ పని చెయ్యలేరు. అలా చేసే వాళ్ళు తొందరగా మరణిస్తారు. అది ఒక చెడ్డ కర్మ. అయితే పనులు విచక్షణ లేకుండా ఉండకూడదు కానీ, అన్ని విషయాల పట్లా స్పందనా శక్తి ఉండాలి. సాధ్యమైనది చెయ్యాలి. సాధ్యం కాని వాటి విషయంలో కూడా మంచి ఉద్దేశం ఉండాలి. 


ఎప్పుడూ ఏమైపోతుందో ఏమైపోతుందో అని బాధపడడం... ఇదే ఒక రోగం! ఆరోగ్యం గురించిన విపరీతమైన ఆందోళనే ఒక రోగం! అది భయంకరమైన కర్మ. ఈ కర్మ మీ మీద ఎప్పటికీ ప్రభావం చూపిస్తూనే ఉంటుంది.

మేము ‘ఇన్నర్‌ ఇంజనీరింగ్‌’ శిక్షణలో చేసినది ఏమిటంటే, దానితో కొత్త కర్మను సృష్టించుకోకుండా ఉండడానికి సాధకులకు చిన్న సాధనాలను అందించాం. దానిమీద సాధకులు హోమ్‌ వర్క్‌ చేశారు. శ్రద్ధ దాని మీదే ఉంచారు. ఉన్నట్టుండి వారికి ఎంతో స్వేచ్ఛగా అనిపించింది. రెండున్నర గంటల కార్యక్రమం ఇంత ప్రభావం చూపినప్పుడు, మరింత శ్రద్ధ పెడితే, ఈ లాక్‌డౌన్‌ సమయంలో కొత్త కర్మను సృష్టించకుండా ఎలా ఉండాలో నేర్చుకోగలం!

- సద్గురు జగ్గీవాసుదేవ్‌

(కోవిడ్‌ యోధులైన వైద్య, పోలీసు సిబ్బందికి ‘ఇన్నర్‌ ఇంజనీరింగ్‌’ ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌ను జూలై 5 వరకు ఈశా ఫౌండేషన్‌ ఉచితంగా అందజేస్తోంది. వివరాలకు http://isha.co/ieo-tel లింక్‌ను చూడండి)

Updated Date - 2020-07-03T06:26:39+05:30 IST