మనిషి పాటించాల్సిన శాశ్వత ధర్మాలు

ABN , First Publish Date - 2020-04-09T09:21:38+05:30 IST

ఎంతో ధనం వెచ్చించి అందమైన ఇల్లు కట్టుకున్నాను అని గర్వపడే ఓ మనిషీ, ఏదో ఓ రోజు నువ్వు కట్టుకున్న ఇల్లు కుప్పకూలి మట్టిలో కలిసి పోతుందనే పరమ సత్యాన్ని తెలుసుకో!’’ అంటారు మహాత్మా కబీరు. ఒక రోజు ఆయన

మనిషి పాటించాల్సిన శాశ్వత ధర్మాలు

కబీరా గర్వ్‌ న కీ జియే, ఊంచాదేఖి ఆవాస్‌

కాల్‌ పడో భూ లేటనా, ఊపర్‌ జంసీ ఘాస్‌


‘‘ఎంతో ధనం వెచ్చించి అందమైన ఇల్లు కట్టుకున్నాను అని గర్వపడే ఓ మనిషీ, ఏదో ఓ రోజు నువ్వు కట్టుకున్న ఇల్లు కుప్పకూలి మట్టిలో కలిసి పోతుందనే పరమ సత్యాన్ని తెలుసుకో!’’ అంటారు మహాత్మా కబీరు. ఒక రోజు ఆయన ఒక ఊరిలో ఉండగా.. ఆ ఊరి ధనవంతుడు తన కొత్త ఇంటికి ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టాడు. కబీరు కూడా అక్కడికి వెళ్లారు. ఆ ఇంటి యజమాని అందరికీ నమస్కరించి.. ‘‘నేనెంతో ధనాన్ని వెచ్చించి ఈ ఇల్లు కట్టుకున్నాను. మీరంతా నా ఇంటిని నిశితంగా పరీక్షించి ఏవైనా దోషాలుంటే నిర్భయంగా చెప్పండి. సరిచేసుకోవడానికి ఎంత డబ్బయినా వెనుకాడను’’ అంటాడు. వచ్చిన వాళ్లల్లో కొందరు వాస్తు పండితులు కూడా ఉన్నారు. ఇంట్లోని ప్రతి భాగాన్నీ వాస్తుపరంగా చూసి ఏ దోషం లేదని చెప్పారు. కానీ, అక్కడే ఉన్న కబీరు దాసు మాత్రం.. ‘‘ఓ యజమానీ, ఇందులో నాకు రెండు దోషాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీవు చెప్పమంటే చెబుతాను’’ అన్నాడు. ‘‘అయ్యా, ఆ దోషాలేమిటో నిర్మొహమాటంగా చెప్పి సరిచేసుకునే అవకాశం కల్పించండి’’ అన్నాడు యజమాని. అప్పుడు కబీరు.. ‘‘ ఒకటి.. ఈ ఇల్లు ఎంతకాలం ఇలాగే ఉంటుందో తెలుసా?’’ అని ప్రశ్నించాడు. తెలియదని తల ఊపాడు యజమాని. ‘‘ఇక రెండోది, ఈ ఇల్లు ఉన్నంత కాలం నువ్వుంటావా?’’  అని అడిగాడు కబీరు. ఆ మాట విని యజమాని తెల్లబోయాడు. అప్పుడు కబీరు ‘‘ఈ సంపదలన్నీ అశాశ్వతాలు. ఆత్మ, అందులోని భగవంతుడు మాత్రమే శాశ్వతం. ఈ విషయం తెలుసుకొని మొదట నిన్ను నీవు సరిదిద్దుకో! అప్పుడే నీవు తరిస్తావు. ఈ జన్మకున్న అర్థమేమిటో తెలుసుకుంటావు. మానవులంతా గొర్రెల వలెనే ప్రవర్తిస్తూ.. పుట్టడం గిట్టడం కోసమే అనుకుంటారు తప్ప.. పుట్టడం గిట్టడం మధ్య ఉన్న జీవితాన్ని ఎలా గడపాలో ఆలోచించరు’’ అని చెప్పి అందరితో కలిసి భోంచేసి అక్కడి నుండి వెళ్లి పోయాడు కబీరు. మనం చేసే ఏ పనైనా ఇతరులకు ఉపయోగపడేదిగా శాశ్వతంగా ఉండాలని కబీరు అభిప్రాయం. ఆయనే కాదు.. వివేకానందుడూ అదే చెప్పారు. ఎంతటి సంపన్నుడైనా సమాజానికి ఉపయోగపడని వాడు అధర్మపరుడు, నిత్యదరిద్రుడు అని స్వామి వివేకానందుడు చెప్పేవారు.

రామాయణ భారత భాగవతాలు, పురాణేతిహాసాలు మానవుణ్ని తీర్చిదిద్దడానికి, మానవత్వాన్ని మేలుకొలపడానికి ఎన్నో కథలు చెప్పాయి. వాటిల్లో చెప్పబడినవన్నీ ధర్మసూత్రాలే! వాటన్నింటిసారాన్ని గ్రహించి మానవుడు.. ‘నేను, నాది’ అనే స్వార్థానికి స్వస్తి పలకాలి. అహంభావంతో ఇతరులను బాధించకుండా ప్రవర్తించాలి. అర్హులకు దాన ధర్మాలు చేయాలి. సౌభ్రాతృత్వం కనబరుస్తూ అందరిలో కలిసిపోవాలి. ప్రేమను ఆలంబనగా చేసుకొని ఈర్షాద్వేషాలకు దూరంగా ఉండాలి. భగవంతుని దృష్టిలో అన్నీ సమానమే అనే భావంతో సర్వప్రాణులపట్ల దయ కలిగి ఉండాలి. గురువులు, పెద్దలు, వృద్ధులు, తల్లిదండ్రులతో గౌరవంగా ప్రవర్తించాలి. అతిథులను దైవ సమానులుగా భావిస్తూ వారిని సంతృప్తిపరచ ప్రయత్నించాలి. ఎప్పుడూ సానుకూలంగా ఆలోచిస్తూ ప్రతికూల భావాలు దరిచేరకుండా చూడాలి. ఇవే మానవులు ఆచరించాల్సిన శాశ్వత ధర్మాలు.

- పరికిపండ్ల సారంగపాణి, 9849630290

Updated Date - 2020-04-09T09:21:38+05:30 IST